‘వయ్యారిభామ’ వణికిస్తోంది. పార్థీనియం ఈస్టిరోఫోరాస్ శాస్త్రీయనామం కలిగిన ఈ గడ్డి జాతి మొక్క ప్రస్తుతం రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. 1960 దశకంలో అమెరికా నుంచి గోధుమల ద్వారా వచ్చిన గడ్డిజాతి విత్తనాల ద్వారా ఈ మొక్కలు దేశమంతా వ్యాపించాయి. తెల్లని పువ్వులతో గుబురుగా ఖాళీ నివేశన స్థలాలు, రైల్వే ట్రాక్, బస్ స్టేషన్లు, కొండ ప్రాంతాల్లో పెరిగే ఈ జాతి మొక్కలు ప్రస్తుతం వ్యవసాయ భూములకు చేరాయి.
కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ గడ్డి అని పిలిచే ఈ కలుపు మొక్క వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ వయ్యారి భామ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి వల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్యపరమైన సమస్యలను గొల్లప్రోలు మండల వ్యవసాయవిస్తరణాధికారి రెడ్ల శ్రీరామ్(88977 41748) ఇలా వివరిస్తున్నారు. - గొల్లప్రోలు
- విస్తరిస్తున్న వయ్యారిభామ
- పొంచి ఉన్న ముప్పు
- పంటలు, పొలాలకు చేటు తెస్తున్న కలుపుగడ్డి
- ఆరోగ్యంపై దుష్ప్రభావం
సుప్తావస్థ కలిగిన గడ్డి జాతి
సుప్తావస్థ కలిగిన ఈ గడ్డి జాతి కలుపు మొక్క ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా సమర్థంగా తట్టుకుంటుంది. ఏడాదికి నాలుగు జీవితదశలను కలిగి ఉంటుంది. విత్తనం భూమిలో రెండేళ్ల వరకు, పై భాగంలో ఆరు నెలల వరకు జీవికతను కలిగి ఉంటుంది. ఒక్కో మొక్క లక్ష విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది. మొక్క సమీపంలోని మూడు కిలోమీటర్ల వరకు విత్తనాన్ని గాలి ద్వారా వ్యాపించగలుగుతుంది. మొక్క మొలచిన దగ్గర నుంచి మూడు నెలల వ్యవధిలో పూత దశకు చేరుతుంది. తెల్లటి పుప్పొడితో ఉన్న వయ్యారిభామ మొక్కలు ఒక రకమైన వాసనను వెదజల్లుతాయి.
నివారణ ఒక్కటే మార్గం
వయ్యారిభామ నివారణకు మొక్కలను తొలగించడం ఒక్కటే మార్గం. ఎటువంటి రసాయనక మందులు లేవు. మొక్కలను ఎప్పటికప్పుడు కాల్చి వేయకపోతే విత్తనాలు తిరిగి మొలకెత్తే అవకాశముంది. జైగోగ్రామాబైకులారేటాకు చెందిన బీటిల్స్(పురుగులు) మొక్కపై వదిలినట్టయి తే మొక్కల ఆకుల ను తిని నివారించే అవకాశముంది. కానీ ఆ టెక్నాలజీ మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఆరోగ్యపరమైన సమస్యలు
ముఖ్యంగా ఈ రకం మొక్కలు పార్ధీనియం, హెస్టరిన్, హైమోనిన్, ఎంబ్రోసిన్ అనే ప్రాణాంతకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా వీటిని తిన్న పశువులు జీర్ణక్రియ, కిడ్నీ, లివర్, అన్నవాహిక శ్వాసక్రియ దెబ్బతింటుంది. ఇవి తిన్న పశువులు చివరికి మృత్యువాత పడతాయి. మనుషులకు కూడా ఎనలేని అనర్థాన్ని తెచ్చి పెడతాయి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు ఎలర్జీ చర్మ, శ్వాససంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంది. దురదలు, తుమ్ములు వచ్చి చర్మంపై మచ్చలు ఏర్పడతాయి.
తొలగించేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి
మొక్కలు తొలగించేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. మొక్కల పుప్పొడి, పువ్వులు చర్మానికి తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ముఖానికి గుడ్డలు లేదా, మాస్క్‌లు ధరించాలి. కాళ్లకు, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. చర్మవ్యాధులు సోకినట్టయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
పంటలకు నష్టమిలా...
పంటలకు ఇది తీరని నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా మెట్ట పంటలైన పత్తి, మొక్కజొన్న, గోధుమ, అపరాలు, మల్బరీ తోటలు, మామిడి, జీడిమామిడి తోటల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. వీటి వల్ల ఇతర పంటల మొలకశాతం తగ్గిపోవడంతో పాటు పంట ఎదుగుదల తగ్గిపోతుంది. భూసారాన్ని, పంటకు వేసిన ఎరువులు సారాన్ని పీల్చి వేస్తుంది. 40 శాతం వరకు పంట దిగుబడిని తగ్గించే గుణం దీనికి ఉంది. నత్రజని శాతాన్ని తగ్గిస్తుంది. భూమి నిస్సారవంతంగా తయారయ్యే అవకాశముంది. పోషకవిలువలు, సూక్ష్మధాతువులు శాతం తగ్గిపోతుంది.
బాబోయ్.. భామ
Published Sun, Sep 7 2014 11:47 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement