Chemical drugs
-
రంగులు పూసి.. రైతుల్ని ఏమార్చి.. రూ.6 కోట్లు
సాక్షి, నల్గొండ: పనికిరాని, నాసిరకం విత్తనాలకు రసాయన రంగులను పూయడంతోపాటు ఏకంగా క్యూఆర్ కోడ్లతో కూడిన ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి రైతులకు అంటగడుతున్న అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రైతుల నుంచి అందిన ఫిర్యాదులతో 15 రోజులపాటు జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందంతో కలసి అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ఈ కేసులో 13 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, లేబుల్ ప్యాకెట్లు, యాంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన నిందితులను శుక్రవారం నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను ఐజీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రంగనాథ్, వ్యవసాయ జేడీ శ్రీధర్‌రెడ్డిలు వెల్లడించారు. పట్టుబడిన వాటిలో రూ. 4 కోట్ల విలువైన 20 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, రూ. 2 కోట్ల విలువైన 200 టన్నుల నకిలీ వరి, మొక్కజొన్న, మిర్చి, ఇతర కూరగాయల విత్తనాలు ఉన్నాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకోకపోతే 40 వేల ఎకరాల్లో పంట నష్టంతోపాటు రైతులు పెట్టుబడి నష్టపోయేవారన్నారు. దందా సాగించారిలా... ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో నైరుతి సీడ్స్ కంపెనీ నడుపుతున్న ప్రధాన నిందితుడు, చార్టెడ్ అకౌంటెంట్ అయిన ఏనుబోతుల శ్రీనివాస్‌రెడ్డి, ఏపీలోని నంద్యాలకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డిలు మరికొందరితో కలసి ఈ దందాకు తెరలేపారు. ఇందుకోసం శ్రీనివాస్‌రెడ్డి దేవరయాంజల్లో ఎంజీ అగ్రిటెక్ ప్రాసెసింగ్ యూనిట్ నడుపుతున్న కాకినాడవాసి మేడిశెట్టి గోవిందు, నంద్యాలకు చెందిన గోరుకంటి పవన్‌కుమార్, స్వామిదాస్ల సహకారం తీసుకున్నాడు. వారి ద్వారా పనికిరాని పత్తి గింజలు, ఇతర పంటల విత్తనాలను కిలో రూ. 200 చొప్పున కొనుగోలు చేసి వాటిని గోవిందుకు చెందిన ప్రాసెసింగ్ యూనిట్లో శుద్ధి చేసేవాడు. వాటిని నాణ్యమైన విత్తనాలుగా నమ్మించేందుకు రసాయన రంగులను పూసి అందమైన ప్యాకెట్లలో నింపి రైతులకు కిలో ప్యాకెట్‌ను రూ. 900 చొప్పున విక్రయించేవాడు. రైతులను నమ్మించేం దుకు శ్రీనివాస్‌రెడ్డి నాగపూర్‌కు చెందిన ఐసీఏఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్) సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లుగా ప్యాకిం గ్ కవర్లపై ముద్రించాడు. ఈ దందాకు పాత నేరస్తుడైన మధుసూదన్‌రెడ్డితోపాటు ఖమ్మానికి చెందిన పెద్దిరెడ్డి, నల్లగొండ జిల్లా చండూర్‌కు చెందిన బాలస్వామి, దేవరకొండకు చెందిన పిచ్చయ్య, పవన్‌లతోపాటు మరికొందరు సహకరించేవారు. నకిలీ విత్తనాల రవాణాతోపాటు కొందరు డీలర్లకు అధిక కమీషన్ ఆశచూపి నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టేలా మధుసూదన్‌రెడ్డి తదితరులు ప్రోత్సహించేవారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు టాస్క్‌ఫోర్స్ బృందంతో కలసి ఏపీలోని నంద్యాల, ఆళ్లగడ్డతోపాటు గజ్వేల్, గద్వాల, జడ్చర్ల, హైదరాబాద్, గుండ్లపొచంపల్లి, ఎల్లంపేట, దేవరయాంజల్, బోయినపల్లి తదితర ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 20 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, 140 టన్నుల వరి, 40 టన్నుల మొక్కజొన్న, 4 క్వింటాళ్ల వివిధ కూరగాయల నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. -
డ్రగ్స్ తయారీ కేసులో ఇద్దరు ప్రొఫెసర్ల అరెస్టు
వాషింగ్టన్: ఉత్తర అమెరికాలోని ఓ కళాశాల ల్యాబ్‌లో మాదక ద్రవ్యాలను ఉపయోగించి మెత్‌ను తయారు చేశారని ఇద్దరు కెమిస్ట్రీ ప్రొఫెసర్లను శుక్రవారం పోలీసులు ఆరెస్టు చేశారు. ప్రొపెసర్లు ఇద్దరు ఆర్కాన్సాస్ కళాశాలకు చెందిన వారని పోలీసులు తెలపారు. వివరాలు.. హెండర్సన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఆర్కాన్సాస్ కళాశాల ప్రొఫెసర్లు టెర్రీ డేవిడ్ బాటెమన్, బ్రాడ్లీ అలెన్ రోలాండ్లు మెథాంపేటమిన్ తయారు చేశారని, ఇందుకోసం మాదక ద్రవ్యాల పరికరాలను కూడా వాడినట్లు సమాచారం రావడంతో వారిని అరెస్టు చేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే దీనిపై కళాశాల ప్రతినిధి టీనా హాల్ మాట్లాడుతూ.. వారిద్దరు గత అక్టోబర్ 11 నుంచి అధికారిక సెలవులలో ఉన్నారని తెలిపారు. కాగా మూడు రోజుల క్రితం కళాశాల సైన్స్ ల్యాబ్ నుంచి ఏదో కెమికల్ వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించామని, దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా ల్యాబ్‌లో మాదక ద్రవ్యాల సామాగ్రిని ఉపమోగించి మెథాంపేటమిన్ అనే కొత్త కెమికల్ డ్రగ్‌ను తయారు చేసినట్లుగా తెలింది. దీంతో కెమికల్ డ్రగ్ వల్ల కళాశాల క్యాంపస్ ఆవరణం అంతా దుర్వాసనా రావడంతో మూడు రోజుల పాటు కళాశాలను మూసివేశామన్నారు. ఇక ల్యాబ్‌ను శుభ్రం చేయించి తిరిగి అక్టోబర్ 29 కళాశాలను తిరిగి ప్రారంభించామని టీనా హాల్ మీడియాకు తెలిపారు. -
సేంద్రియ గుడ్లు!
‘ఆహారం సరైనదైతే ఏ ఔషధమూ అవసరం లేదు.. ఆహారం సరైనది కాకపోతే ఏ ఔషధమూ పనిచేయదు’... ఈ సూత్రాన్ని మనుషులకే కాదు ఫారం కోళ్లక్కూడా విజయవంతంగా వర్తింపజే యవచ్చని రుజువు చేస్తున్నారు ఓ మహిళా రైతు. గత రెండేళ్లుగా రసాయనిక ఔషధాలు, వాక్సిన్లు మచ్చుకి కూడా వాడకుండా 15 వేల లేయర్ కోళ్లను ఆరోగ్యదాయకంగా పెంచుతున్నారు జయప్రదారెడ్డి. చిరుధాన్యాలతో తయారు చేసుకునే దాణాలో 15% మేరకు కూరగాయలు, ఆకులు అలములు కలిపి కోళ్లకు మేపుతున్నారు. ఇందుకోసం రెండున్నర ఎకరాల్లో ఔషధ మొక్కలు, చెట్లు, పందిరి కూరగాయలు పెంచుతున్నారు. అత్యంత నాణ్యమైన ‘సేంద్రియ గుడ్ల’ను ఉత్పత్తి చేస్తూ గణనీయమైన లాభాలు గడిస్తున్నారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన ఆ మహిళా రైతు జయప్రదా రెడ్డి అభినందనీయురాలు. సాధారణ పౌల్ట్రీ రైతుగా జీవనం ప్రారంభించి సొంత ఆలోచనతో సేంద్రియ రైతుగా ఎదిగారు. ఏదైనా రంగంలో కృషి చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన జయప్రదారెడ్డి(53)ని సేంద్రియ కోళ్ల రైతుగా మార్చింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రాణిపేట ఆమె స్వగ్రామం. నిజాం సర్కారులో కొత్వాల్‌గా పని చేసిన రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి వంశంలోని కుటుంబానికి కోడలిగా వచ్చిన జయప్రదారెడ్డి పెళ్లి తర్వాత హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో ఉండి డిగ్రీ పూర్తి చేశారు. భర్త జనార్దన్‌రెడ్డి గతంలో జైళ్లవిభాగంలో హైదరాబాద్‌లో పనిచేసి డీఎస్పీగా రిటైరయ్యారు. ఆ తర్వాత రాణిపేటకు మకాం మారింది. ఆ దశలో ఏడేళ్ల క్రితం భర్త ప్రోత్సాహంతో జయప్రదారెడ్డి రాణిపేటలోని తమ ఇంటి దగ్గర్లోని సొంత భూమిలో షెడ్లు నిర్మించి లేయర్ (గుడ్లు పెట్టే) కోళ్ల ఫారాన్ని ప్రారంభించారు. దాణా గోదాము నిర్మించారు. ఇందుకోసం రూ. 45 లక్షల బ్యాంకు రుణం తీసుకున్నారు. లేయర్కోళ్ల పెంపకంలో ఒక పంట కాలం వంద వారాలు. ఒకరోజు వయసున్న కోడి పిల్లలను హేచరీ నుంచి తెచ్చి ఫారంలో పెంచుతారు. అయితే, కోళ్ల ఫారం నిర్వహణలో అనుభవరాహిత్యం వల్ల మొదటి పంట కాలంలో ఎదిగిన కోళ్లను కొన్నారు. నిపుణుల సూచన మేరకు ఔషధాలు, వాక్సిన్లు వాడినప్పటికీ జబ్బు పడి కోళ్లు చనిపోయాయి. 60వ వారానికే ఆ బ్యాచ్ మొత్తాన్నీ తీసేయాల్సి వచ్చింది. రూ. లక్షల్లో నష్టం వచ్చింది. అయినా, అధైర్యపడకుండా, సొంత భూమి తనఖా పెట్టి వర్కింగ్ క్యాపిటల్‌గా రూ. 30 లక్షలు రుణం తీసుకొని రెండో బ్యాచ్ కోడిపిల్లల పెంపకం చేపట్టారు. మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జలు తదితరాలతో కూడిన దాణా ఇచ్చే వారు. 45 రోజులకోసారి వ్యాక్సిన్ వేయడంతోబాటు ఔషధాలూ వాడేవారు. తరచూ జబ్బులు వచ్చేవి. రెండో బ్యాచ్‌ను 82 వారాల్లో తీసేయాల్సి వచ్చింది. ఆరుబయట గరికను కొరుక్కు తినే నాటు కోళ్లు ఆరోగ్యంగా ఉండటం గమనించిన జయప్రదారెడ్డికి, తన ఫారం కోళ్లకు పెట్టే దాణాలో డ్రై ఫీడ్తోపాటు గరికను, మేకలు తినే రకరకాల ఆకులను కలిపి పెడితే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న ఆలోచన వచ్చింది. ప్రయోగాత్మకంగా గరికను దాణాలో కలపడం ప్రారంభించగా కొద్ది రోజుల్లోనే మంచి మార్పు వచ్చింది. ఆ మార్పు ఆమెను ఉత్సాహపరచింది. 15% మేరకు ఆకులు, కూరగాయలు మూడో బ్యాచ్ కోడి పిల్లల పెంపకం ప్రారంభించిన తొలిదశ నుంచే దాణాలో పూర్తిస్థాయి మార్పులు చేశారు. గరిక, ఆకులతోపాటు టమాటా, సొర వంటి కూరగాయలను సైతం ముక్కలుగా తరిగి ప్రయోగాత్మకంగా దాణాలో కలిపి కోళ్లకు మేపడం మొదలు పెట్టారు. ఆహారంలో చేసిన మార్పులు మంచి ఫలితాలిస్తున్నట్లు గమనించిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. వివిధ ధాన్యాలు(డ్రై ఫీడ్) 85%, ఆకులు–కూరగాయలు కలిపి 15% మేరకు దాణాలో కలపడం ప్రారంభించారు. డ్రై ఫీడ్‌లో సగం మేరకు ధాన్యాలు, సగం మేరకు నూనె తీసిన తెలగపిండి ఉండేలా చూస్తున్నారు. మొక్కజొన్న(45%), సజ్జలు, జొన్నలు, కొర్రలు (తలా ఒక 10%)తో పాటు తవుడు, నూకలు, గడ్డిగింజల(మిగతా 25%)తో పాటు ఇదే మోతాదులో తెలగపిండులు కలిపి మరపట్టించి దాణాగా వాడుతున్నారు. ఎకరం భూమిలో పెరుగుతున్న గరిక, కరివేపాకు, సొర ఆకు, కానుగ చిగుర్లు, బాదం ఆకులు, కొబ్బరి ఆకులు, మునగాకు, సపోటా ఆకులు, చింత ఆకులు, వేపాకులు, నేరేడాకులు, మామిడి ఆకులు వేస్తున్నారు. ఎండాకుల పొడిని కూడా వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి గుజ్జు కూడా అడపా దడపా వేస్తున్నారు. ధర తక్కువగా ఉన్నప్పుడు టమాటా, ఉల్లిపాయలు, సొరకాయలు వంటి కూరగాయలను రోజూ ఉదయం చాఫ్ కట్టర్‌తో ముక్కలు చేసి.. గ్రైండర్లో వేసి డ్రైఫీడ్తో కలగలిపి.. రోజుకు రెండు సార్లు కోళ్లకు మేపుతున్నారు. ఎకరంన్నర భూమిలో ప్రత్యేకంగా సొర పాదులు పెంచి.. ఆ కాయలను కోళ్లకు వినియోగిస్తున్నారు. మూడో బ్యాచ్ నుంచి హెర్బల్ ఎగ్స్ మూడో బ్యాచ్‌లో పూర్తి సేంద్రియంగా హెర్బల్ గుడ్ల ఉత్పత్తి చేపట్టడంతో అంతకుముందు చేసిన అప్పులన్నీ తిరిపోయాయని, 90వారాలు అనుకుంటే 98 వారాల వరకు 85% గుడ్ల ఉత్పత్తితో కొనసాగించానని, కల్ బర్డ్స్ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయని జయప్రదారెడ్డి ఎంతో సంతోషంగా చెప్పారు. ప్రస్తుతం నాలుగో బ్యాచ్ సగంలో ఉంది. గుడ్ల ఉత్పాదకత బాగుంది. ఎండాకాలం కాబట్టి రోజుకు 150 నిమ్మకాయల రసం దాణాలో కలుపుతున్నారు. గుడ్డు సాఫ్ట్‌గా, నీచు వాసన లేకుండా, రుచి నాటు గుడ్ల మాదిరిగా ఉంటున్నదని ఆమె తెలిపారు. కుంటుతున్న కోళ్లకు చింత గింజలు, చింతాకు, చింతపండు దాణాలో కలిపి 15 రోజులు ఇస్తే సమస్య తగ్గిందని జయప్రదారెడ్డి తెలిపారు. కోళ్లు రొప్పుతూ ఉంటే (దగ తీయటం) మొదట్లో వంట సోడా ఫీడ్‌లో కలిపి ఇచ్చేవాళ్లం. 3 ఏళ్ల నుంచి వాడటం లేదు. ప్రతి 45 రోజులకోసారి రోగనిరోధక శక్తి పెంచడానికి వాక్సిన్ ఇచ్చే వాళ్లం అది కూడా ఇవ్వడం లేదు. రోజుకు ఐదారు గంటల పాటు విద్యుత్ లైట్లు వేసేవాళ్లం. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. గతంలో రెండు, మూడు రోజులకోసారి ఏదో ఒక మందు వేయాల్సి వచ్చేది. దాణాలో మార్పులు చేసి ఆకులు, కూరగాయలు వాడుతున్న తర్వాత గత రెండేళ్లుగా ఎటువంటి రసాయనిక వ్యాక్సిన్లు గాని, యాంటిబయాటిక్స్ గాని, ఇతర రసాయనిక ఔషధాలు గానీ కోళ్లకు వాడాల్సిన అవసరమే రాలేదని జయప్రదారెడ్డి అన్నారు. ‘జయ హెర్బల్ ఎగ్స్’ బ్రాండ్ పేరుతో ఆమె గుడ్లను విక్రయిస్తున్నారు. హైదరాబాద్, కర్నూలులోని అనేక మాల్స్ వారు వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ గుడ్లు 20 రోజుల వరకు నిల్వ∙ఉంటున్నాయన్నారు. గతంలో షెడ్ నుంచి వంద మీటర్ల దూరం వరకు దుర్వాసన వచ్చేది. ఈగలు, దోమల బెడద బాగా ఉండేదని, కోళ్ల పెంట బాగా దుర్వాసన వచ్చేది. ఇప్పుడు వాసన బాగా తగ్గిపోయింది. జర్మనీ శాస్త్రవేత్తలు అభినందించడం సంతోషాన్నిచ్చిందన్నారు. రసాయన రహితంగా గుడ్లను ఉత్పత్తి చేస్తున్న ఆమె ఆదర్శప్రాయురాలు. కోడిలా జీవించాలి! కోళ్లను పెంచే రైతులు తామే కోడిలా జీవించాలి. 24 గంటలూ వాటికి ఏమేమి అవసరమో శ్రద్ధగా గమనిస్తూ ఏ లోటూ రాకుండా చూసుకోవాలి. పని వాళ్లు చేస్తారులే అని వదిలేసి ఊరుకుంటే జరగదు. ఇంట్రెస్టుగా చెయ్యటం ముఖ్యం. కూర చేసినా మనసుపెట్టి ఇంట్రెస్టుగా చెయ్యాలి. అలాగే కోళ్లను కూడా ఇష్టంగా చూసుకోవాలి. నేను ఉదయం 5.30 గంటలకే షెడ్ దగ్గరకు వెళ్లి ఫీడ్ మిక్సింగ్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నా. ఇష్టంగా పనులు చేసుకుంటూ ఉంటే కోళ్ల ఫారంలో పెట్టుబడి ఆరేళ్లలో తిరిగి వచ్చేస్తుంది. – జయప్రదారెడ్డి (86394 21276), రాణిపేట, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ ∙కోళ్ల కోసం సొరకాయలు కోస్తున్న జయప్రదారెడ్డి కొర్రలు, సొర ముక్కలు, ఎండాకులతో తయారవుతున్న దాణా అమ్మకానికి సిద్ధం దాణాలో కలిపేందుకు సొరకాయలను కట్ చేస్తూ... – బొలెమోని రమేష్, సాక్షి, వనపర్తి ఫొటోలు: ఎం.యాదిరెడ్డి -
‘మక్క లద్దెపురుగు’ నోట్లో మట్టి!
మిత్రపురుగులే రైతు సైన్యం. మిత్రపురుగులకు హాని చేసే రసాయనిక పురుగుమందుల కంటే.. ప్రకృతికి అనుగుణమైన పద్ధతుల్లోనే చీడపీడలను అరికట్టడం అన్నివిధాలా మేలు. మొక్కజొన్న మొక్క ఆకు సుడుల్లో పొలంలోని మట్టిని వేస్తే చాలు, నూటికి నూరు శాతం దీన్ని అరికట్టగలమని మెదక్ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కేవీకే తెలిపింది. మట్టిని సుడుల్లో వేసిన తెల్లారి నుంచే పురుగు చురుకుదనాన్ని, ఆకలిని కోల్పోయింది. పంటకు నష్టం జరగటం ఆగిపోతుంది. నాలుగైదు రోజుల్లోనే పురుగు చనిపోయిందని కేవీకే అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డా. గున్నంరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి ‘సాగుబడి’కి వెల్లడించారు. మొక్కజొన్న రైతులు భయభ్రాంతులకు గురికావాల్సిన పని లేదని, రసాయనిక పురుగుమందుల ఖర్చు లేకుండానే రైతులు ఈ పురుగు బెడద నుంచి పంటను నిస్సందేహంగా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క లద్దెపురుగు తీరుతెన్నులు, నియంత్రణ మార్గాలపై ‘సాగుబడి’ ప్రత్యేక కథనం.. మక్క(మొక్కజొన్న) లద్దెపురుగు.. ఇటీవల కొత్తగా కనిపిస్తున్న విదేశీ జాతి విధ్వంసక లద్దెపురుగు ఇది. మొక్కజొన్న చేలల్లో లేత ఆకులను, మొవ్వు(ఆకు సుడు)లను, కండెలను ఆవురావురుమంటూ కరకరా నమిలేయడం, అత్యంత వేగంగా కొత్త ప్రాంతాలకు పాకటం దీనికున్న అత్యంత ప్రమాదకర లక్షణాలు. ఖరీఫ్ మొక్కజొన్న పంటను నమిలేస్తున్నది. మూడు నెలల్లోనే.. మన దేశంలో తొలిసారి కర్ణాటకలో మేలో కనిపించి కలకలం రేపింది. ఆగస్టు తొలివారంలో తెలుగురాష్ట్రాల్లో వర్షాభావ వాతావరణ పరిస్థితుల్లో బయటపడింది. ఖరీఫ్ మొక్కజొన్న సాగవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జిల్లాల్లో మక్క లద్దెపురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్నట్లు రైతులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆశించిన కొద్ది రోజుల్లోనే పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్న పురుగు కావడంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐ.సి.ఎ.ఆర్.) అప్రమత్తమైంది. తక్కువ ప్రమాదకరమైన రసాయనిక పురుగుమందులు వాడమని సూచిస్తోంది. ఏక పంటలకే ముప్పు ఎక్కువ! రెక్కల పురుగు రోజుకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని, ఆడ రెక్కల పురుగు వెయ్యి వరకూ గుడ్లు పెట్టడం ద్వారా సంతతిని వ్యాపింపజేస్తుందని ఎఫ్.ఎ.ఓ. తెలిపింది. పొలం అంతా ఒక మొక్కజొన్న పంట(మోనోకల్చర్)ను మాత్రమే సాగు చేసే పొలాలకే ఇతర చీడపీడల మాదిరిగా మక్క లద్దెపురుగు బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నతోపాటు (పప్పుధాన్యాలు, నూనెగింజ, చిరుధాన్యాల) ఇతర పంటలను కలిపి సాగు చేసే పొలాల్లో ఇది వేగంగా వ్యాప్తి చెందదని గుర్తించారు. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఏక పంటల సాగుకు ప్రసిద్ధి పొందిన అమెరికా ఖండంలోని కెనడా(దక్షిణ ప్రాంతం), చిలి, అర్జెంటీనా వంటి వివిధ దేశాల్లో కొన్ని ఏళ్ల నుంచి ఇది వివిధ పంటలను ఆశిస్తూ నష్టపరుస్తున్నది. రెండేళ్ల క్రితం ఆఫ్రికా ఖండంలోకి పాకి చాలా దేశాలను చుట్టుముట్టింది. ఈ పురుగు మొక్కజొన్నతోపాటు వరి, జొన్న, చెరకు, గోధుమ, పత్తి, కొన్ని రకాల కూరగాయలు సహా 80 రకాల పంటలను ఆశించి ఆహార భద్రతకు ముప్పు తెచ్చే ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. మక్క లద్దెపురుగు గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో మొక్కజొన్న పొలాలను గుల్ల చేస్తున్నది. అయితే, రైతుకు ఖర్చులేని, సులువైన, ప్రకృతికి అనుగుణమైన మట్టితో పురుగు నిర్మూలన పద్ధతులు ఉన్నాయి. మొక్కజొన్న రైతులు ఈ పురుగుకు భయపడాల్సిన పని లేదు. మా కృషి విజ్ఞాన కేంద్రంలో 5 రకాల పద్ధతుల్లో మక్క లద్దెపురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చని అనుభవపూర్వకంగా గుర్తించాం.. 1. మట్టి 100% అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది! మాది ఎర్రమట్టి పొలం. ఆ మట్టినే చేతితో తీసి లద్దెపురుగు ఉండే ఆకు సుడుల్లో వేశాం. మట్టి వేసిన తెల్లారికి మక్క లద్దెపురుగు ఆకులను తినటం, లద్దెలు(విసర్జితాలు) వేయటం ఆగిపోయింది. మూడో రోజుకు పురుగు నశించడం ప్రారంభమైంది. 4–5 రోజులకు పురుగు చనిపోయింది. వర్షం పడుతున్నందు వల్ల లొట్టపీచు కషాయాలు అంతగా పనిచేయలేదు. నేల మీద మట్టినే తీసి నేరుగా సుడుల్లో వేశాం. మట్టి పెళ్లలు సుడుల్లో వేసిన తర్వాత వర్షం కురవకపోతే, ఆ మట్టి పెళ్లలపై నీరు పిచికారీ చేశాం. దీన్ని బట్టి మాకు అర్థమైందేమిటంటే.. రైతు రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏ పురుగుమందూ పిచికారీ చేయకుండా.. మట్టిని తీసుకొని సుడిలో వేస్తే చాలు. పురుగు ఆకలి తగ్గి, కృశించి 4–5 రోజుల్లో చనిపోతుంది. 2. మట్టి వేయకుండా.. రాతి పొడిని సుడుల్లో చల్లాం. ఇది 98% ఫలితం కనిపించింది. 3. బొగ్గు పొడిని సుడుల్లో చల్లాం. పురుగును అరికట్టడంలో దీని ప్రభావం 90% ఉంది. 4. కర్ర బూడిద చల్లాం. 86% ప్రభావం ఉంది. 5. లొట్టపీచు కషాయం(లీ. నీటికి 100 ఎం.ఎల్. కషాయం) పిచికారీ చేశాం. వర్షం లేనప్పుడు దీని ప్రభావం 80% ఉంది. వీటన్నిటిలోకీ ఎర్రమట్టి అద్భుతమైన ప్రభావం చూపింది. నల్ల రేగడి లేదా బంకమన్ను ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించి చూడాల్సి ఉంది. మక్క లద్దెపురుగును ప్రకృతిసిద్ధంగా అదుపు చేసే బదనికలు మన వాతావరణంలో అభివృద్ధి చెందేవరకు కొన్ని సీజన్లు గడుస్తాయి. ఈ లోగా రసాయనిక పురుగుమందులు వాడితే మిత్రపురుగులు చనిపోయే ప్రమాదం ఉంది. మేము అనుసరించిన పద్ధతుల వల్ల గండు చీమలు, సాలెపురుగులు, తూనీగలు వంటి మిత్రపురుగులకు హాని కలగదు. కాబట్టి, ఈ మిత్రపురుగుల సహాయం తీసుకొని పదింతలు శక్తితో కొత్త పురుగుపై పోరాడే శక్తి మనకు చేకూరుతుంది. ప్రకృతి సహకారం మనకు తోడవుతుంది. మట్టి సుడుల్లో వేసి ఎదిగిన లద్దెపురుగులను మొక్కజొన్న రైతులంతా నాశనం చేయగలిగితే.. ఈ పురుగు సంతతి వృద్ధిని సమర్థవంతంగా అరికట్టవచ్చన్న గట్టి విశ్వాసం మాకుంది. ఇతర దేశాల్లో రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల దీని వ్యాప్తిని నిలువరించలేకపోయిన విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. – డా. జి. శ్యాంసుందర్ రెడ్డి (99082 24649), సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి, డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కేవీకే, తునికి, కౌడిపల్లి, మెదక్, తెలంగాణ–502316 వివరాలకు: శాస్త్రవేత్త నరేశ్ (9290615952) ‘కత్తెర పురుగు’ కాదు ‘మక్క లద్దెపురుగు’ అంతర్జాతీయంగా ఈ లద్దెపురుగు ఇంగ్లిష్ పేరు ‘ఫాల్ ఆర్మీవార్మ్’ (ఊఅఔఔ అఖM్గగిఅఖM టఞౌఛీౌp్ట్ఛట్చ జటuజజీp్ఛటఛ్చీ). మొక్కజొన్న పంట అందుబాటులో ఉంటే ఇది ఇతర పంటల జోలికి పోదు. అందుకే దీన్ని ‘మక్క (మొక్కజొన్న) లద్దెపురుగు’ అని మనం పిలుచుకోవచ్చు. పొగాకు లద్దెపురుగు, రాగి లద్దెపురుగుల మాదిరిగా తొలుత ఏ పంట మీద కొత్త పురుగు కనిపిస్తే.. ఆ పంట పేరుతో పిలవటం ఆనవాయితీ. అందువల్ల మొక్కజొన్నను ఆశిస్తున్న ‘ఫాల్ ఆర్మీవార్మ్’ ను కొందరు పిలుస్తున్నట్లుగా ‘కత్తెర పురుగు’ అనటం కన్నా.. ‘మక్క లద్దెపురుగు’ అని పిలవటమే సులువు అని అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సుడిలో మట్టి వేసిన ఐదవ రోజుకు చనిపోయిన మక్క లద్దె పురుగు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
మామిడిని కాపాడుకుందాం!
వాతావరణం మారిపోయింది. అసాధారణ వాతావరణం మామిడిౖ రైతు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. సంక్రాంతి సమయంలో చుట్టుముట్టిన దట్టమైన పొగమంచు పూతను దెబ్బతీసింది. ఇప్పుడేమో రాత్రి పూట వణికించే చలి, పగటి పూట అధిక ఉష్ణోగ్రత మామిడి రైతుపై పగబట్టినట్టే కనిపిస్తున్నాయి. పూత ఆలస్యం కావడం, తీరా వచ్చిన పిందెలు కూడా రాలిపోతుండడంతో రైతులు కలవరపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు తక్కువగా ఉండటం.. పగటి ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఎక్కువగా ఉండటం వంటి విపరిణామాలు ఆశలను తుంచేస్తున్నాయి. తేనెమంచు, తదితరæ చీడపీడలు రసాయనిక మందులు చల్లే రైతులను అల్లాడిస్తున్నాయి. అయితే, ప్రకృతి వ్యవసాయదారుల పరిస్థితి మెరుగ్గానే ఉంది. సేంద్రియ తోటల్లో చీడపీడల బెడద లేదు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కోవచ్చని, మామిడి తోటలను కాపాడుకోవచ్చని వీరి అనుభవాలు చెబుతున్నాయి.. చలి పెరిగినా పూత బాగుంది.. గత ఏడాది ఆగస్టు తర్వాత వర్షాలేవు. కరువొచ్చింది. చలి కూడా తక్కువే. ఈ ఏడాది వర్షాలు బాగున్నాయి. చలి పెరిగింది. పూత బాగుంది. గత ఏడాదికన్నా రెట్టింపు దిగుబడి వస్తుందనుకుంటున్నాను. మా తోట పదెకరాలు. 14 ఏళ్ల నాటిది. మొదటి నుంచీ మనసబు ఫుకుఒకా ప్రకృతి వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నా. అసలు నీరు పెట్టలేదు. కలుపు తీయకుండా సజీవ ఆచ్ఛాదన చేస్తున్నాం. వాన నీటి సంరక్షణకు ఇంకుడుగుంటలు తీశాం. కలుపుమందులు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడట్లేదు. మా చెట్లకు ఎటువంటి తెగుళ్లూ లేవు. వేపనూనె కూడా పిచికారీ చేయట్లేదు. నీరు ఎప్పుడూ పెట్టలేదు. మా ప్రాంతంలో నీరు పెట్టిన తోటలు చిగుళ్లతో గుబురుగా ఉన్నాయి, తేనెమంచు పురుగు వచ్చింది. రసం పీల్చే పురుగుల వల్ల ఆకులు కూడా రాలిపోతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వల్ల రోగనిరోధక శక్తి ఆ చెట్లకు తక్కువగా ఉండటం వల్ల అన్ని రకాల పురుగులు, తెగుళ్లూ వస్తుంటాయి. మాకు ఆ బెడద లేదు. మా తోటలో ఎకరానికి 99 చొప్పున చిన్న రసం చెట్లున్నాయి. మాది కరువు ప్రాంతాలకూ సరిపోయే అధిక సాంద్రత పద్ధతి. ఎటు చూసినా 21 అడుగులకో చెట్టు నాటాం. పంట అయిపోగానే ప్రూనింగ్ చేస్తాం. గాలిదుమ్ములను తట్టుకుంటుంది. కాయ రాలుడు చాలా తక్కువ. కరువును తట్టుకొని, గాలులను తట్టుకొని దీర్ఘకాలం దిగుబడులనిచ్చే విధంగా ఇన్‌సిటు గ్రాఫ్టింగ్ పద్ధతిని అనుసరిస్తున్నాం. – ఎల్.జి.బి.ఎస్. రామరాజు (94401 06567), కొత్తూరు తాడేపల్లి, విజయవాడ రూరల్ మండలం ఆవు పిడకల పొగ వేస్తున్నాం.. మా 20 ఎకరాల తోట 30 ఏళ్ల నాటిది. వెయ్యి చెట్లున్నాయి. ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. 80% బేనిషాన్(బంగినపల్లి) చెట్లున్నాయి. ఈ ఏడాది చాలా చెట్లకు 80% పూత వచ్చింది. పిందె బాగానే వచ్చింది. అయితే, కొన్ని చెట్లకు చిగుళ్లు వచ్చాయి, పూత 25% మాత్రమే వచ్చింది. గత ఏడాది పూత ఎక్కువగానే వచ్చినా నిలబడింది తక్కువ. ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియటం లేదు. ఇప్పటికి మా తోటకు తెగుళ్లు ఏమీ రాలేదు. పూత రాకముందు పది రోజులకోసారి ఆవు మూత్రం కలిపిన నీటిని పిచికారీ చేశాం. ఇప్పుడు పిచికారీలు చేయడం లేదు. నీరు ఇవ్వడం లేదు. చీడపీడలు రాకుండా పది రోజులకోసారి పిడకల పొగ వేస్తున్నాం. సాయంత్రపు వేళలో ఐదెకరాలకు ఒక చోట కిలో ఆవు పిడకలు, పావు కిలో నెయ్యి, పచ్చి ఆకులు వేసి పిడకల పొగ వేస్తున్నాం. పూత, పిందెలు రాలిపోకుండా రక్షించుకోవడానికి పిడకల పొగ ఉపయోగపడుతున్నది. తేనెమంచు పురుగు కూడా రాలేదు. ఏ చెట్టుపైనైనా వచ్చిందన్న అనుమానం వస్తే ఆ దగ్గర్లో పిడకల పొగ పెడుతున్నాం. పిచికారీలు చేయడం లేదు. వడగళ్ల వాన రాకుండా ఉంటే ఈ ఏడాది మంచి దిగుబడే వస్తుందనుకుంటున్నాం. – సుధామోహన్ (93947 47100), బొమ్మరాజుపేట, శామీర్‌పేట మండలం, మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా వేస్ట్ డీ కంపోజర్ వల్ల తోట బాగుంది.. మా 60 ఎకరాల సేంద్రియ తోటలో 1500 మామిడి చెట్లు, 1500 కొబ్బరి చెట్లున్నాయి. 1995 నుంచి సేంద్రియ, బయోడైనమిక్ పద్ధతిలో సాగు చేస్తున్నాం. ఇప్పుడు జీవామృతం, ఘనజీవామృతం, వేస్ట్ డీ కంపోజర్‌ను విరివిగా వాడుతున్నాం. జాతీయ, అంతర్జాతీయ సేంద్రియ సర్టిఫికేషన్లు ఉన్నాయి. మా తోటలో పల్ప్ రకం మామిడి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. రసాలు తక్కువ. గత మూడేళ్లుగా మా చెట్లకు ఎటువంటి తెగుళ్లూ ఎరుగం. కాయకు చివరన ముడ్డిపుచ్చు వస్తుంటుంది. మాకు అది అసలు లేనే లేదు. ‘సాక్షి సాగుబడి’ ద్వారా వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం గురించి తెలుసుకొని గత అక్టోబర్ నుంచి దాదాపు రోజు మార్చి రోజు వాడుతున్నాం. వెయ్యి లీటర్ల ట్యాంకులు 24 చోట్ల ఏర్పాటు చేసి.. పావు గంటలో చెట్లన్నిటికీ ఈ ద్రావణాన్ని ఇచ్చే ఏర్పాటు చేశాం. ఇప్పుడు తోట చాలా ఆరోగ్యంగా ఉంది. ఏ తెగుళ్లూ లేవు. అప్పుడప్పుడూ ఘనజీవామృతం వేస్తున్నాం. జీవామృతం ఇస్తున్నాం. అయితే, వేస్ట్ డీ కంపోజర్‌ను జీవామృతంతో కలపకుండా విడిగా ఇస్తున్నాం. మా తోటలో మామిడి చెట్లు ప్రతి ఏటా కాస్తున్నాయి. కాయకోతలు పూర్తవ్వగానే ప్రూనింగ్ చేసి, ఎండుపుల్ల తీసేసి.. సక్రమంగా పోషణ ఇస్తాం. మళ్లీ ఏడాదీ కాపు వస్తుంది. వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహకు అందటం లేదు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు మామిడి తోటల్లో ఈ ఏడాది తెగుళ్లతో పిందె రాలిపోతున్నది. ఇప్పటికే 8,9 సార్లు పురుగుమందులను పిచికారీ చేసినా, పిందె రాలుతూనే ఉంది. వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కోవడానికి సేంద్రియ వ్యవసాయం తోడ్పడుతుంది. – చలసాని దత్తు (94414 73246), నూజివీడు, కృష్ణా జిల్లా పది రోజులకోసారి కషాయం పిచికారీ.. ఈ ఏడాది జనవరిలో 3 రోజుల పాటు దట్టమైన పొగమంచు కురిసి మామిడి పూతను దెబ్బతీసింది. దీని ప్రభావం వల్ల కొన్ని చెట్లకు పూత 50% వస్తే, మరికొన్నిటికి ఇంకా తక్కువే వచ్చింది. మాకున్న 30 ఎకరాలలో చాలా ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్నే చేస్తున్నాను. 310 మామిడి చెట్లున్నాయి. గత ఏడాది 70% చెట్లకు పూత, కాత చాలా బాగా వచ్చింది. లోకల్‌గా కిలో రూ. 100–120 వరకు అమ్మాం. అమెరికా, జర్మనీ, సింగపూర్‌కు కూడా పంపాం. ఖర్చులు పోను రూ. 8 లక్షల నికరాదాయం వచ్చింది. ఈ ఏడాది పూతే తక్కువగా వచ్చింది. పూతరాక ముందు నవంబర్ నుంచే 15 రోజులకోసారి కషాయాలు, జీవామృతం పిచికారీ చేస్తున్నాం. తేనెమంచు పురుగు రాలేదు. 20 ఆకులను కుళ్లబెట్టి తయారు చేసుకున్న కషాయం, జీవామృతం, పులిసిన మజ్జిగ, దేశీ ఆవు పాలు–శొంఠి–ఇంగువ ద్రావణం, కొబ్బరి నీరు, సప్తధాన్యాంకుర కషాయం.. అదొకసారి ఇదొకసారి 7–10 రోజులకోసారి పిచికారీ చేస్తున్నాం. పిందె రాలడం ఆగే వరకు, పిందెలు గోలికాయ సైజుకు పెరిగే వరకు కొడుతూ ఉంటాం. అయినా గత ఏడాది బూడిద తెగులు కంట్రోల్ కాలేదు. – బీరం వెంకట్రామారెడ్డి (98498 04527), సింగోంటం, మహబూబ్‌నగర్ జిల్లా వాతావరణం మారింది.. పూత, లేత పిందె మాడిపోతున్నది.. మా 8 ఎకరాలలోని 18 ఏళ్ల మామిడి తోటలో 500 చెట్లున్నాయి. సొంతంగా తయారు చేసుకునే జీవన ఎరువులు, జీవామృతంతో వ్యవసాయం చేస్తున్నాను. సగటున 40 టన్నుల దిగుబడి వచ్చేది.. రెండేళ్లుగా 25 టన్నులకు పడిపోయింది. మూడేళ్లుగా వాతావరణం మారిపోయింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు మరీ ఎక్కువై.. పూత, పిందెకు గొడ్డలిపెట్టులా మారాయి. ఈ రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రత(సాధారణంగా 23–24 డిగ్రీలు ఉండాల్సింది) 19 డిగ్రీలకు తగ్గింది. పగటి ఉష్ణోగ్రత (ఉగాది లోపల 35 డిగ్రీలు ఉండాల్సింది) 38–39 డిగ్రీలకు పెరిగింది. గత రెండేళ్లు దిగుబడి తగ్గినా పూత సమయానికి వచ్చింది. ఈ ఏడాది పూత 25–30 రోజులు ఆలస్యంగా వచ్చింది. దశేరి, హిమాయత్ కన్నా బంగినపల్లి పూత ఆలస్యంగా వస్తుంది. బంగినపల్లి చిన్న పిందె దశలో ఉంది. ఇప్పుడున్న లేత పిందె, లేత ఆకులు కూడా మాడి, రాలిపోతున్నాయి. ఇందులో 80% రాలిపోయే అవకాశం ఉంది. పిందెలను నిలబెట్టుకునేందుకు మామిడి చెట్లపై వేప నూనె, వర్టిసెల్లం లఖానియా(జీవన శిలీంధ్ర నాశిని)లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 20,000–50,000 పీపీఎం గల వేపనూనె అర లీటరు, వర్టిసెల్లం లఖానియా 0.5% ద్రావణం అర లీటరు చొప్పున 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి. ఇందులో ఎమల్సిఫయర్ కలపకూడదు. ఎమల్సిఫయర్ కలిపితే వేడి పెరుగుతుంది. 10,000 పీపీఎం లోపు ఉండే వేప నూనె నీటిలో కరగదు కాబట్టి ఎమల్సిఫయర్ కలుపుతుంటాము. 20,000–50,000 పీపీఎం వేపనూనెకు అవసరం లేదు. వర్టిసెల్లం లఖానియా.. రసం పీల్చే పురుగులన్నిటినీ సమర్థవంతంగా అరికడుతుంది. తేనెమంచు పురుగు, బూడిద తెగులు, పేనుబంక, పాముపొడ(లీఫ్‌మైనర్)లను అరికడుతుంది, నిరోధిస్తుంది. – కొక్కు అశోక్‌కుమార్ (98661 92761), సేంద్రియ మామిడి రైతు, ఒగులాపురం, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
బాబోయ్.. భామ
‘వయ్యారిభామ’ వణికిస్తోంది. పార్థీనియం ఈస్టిరోఫోరాస్ శాస్త్రీయనామం కలిగిన ఈ గడ్డి జాతి మొక్క ప్రస్తుతం రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. 1960 దశకంలో అమెరికా నుంచి గోధుమల ద్వారా వచ్చిన గడ్డిజాతి విత్తనాల ద్వారా ఈ మొక్కలు దేశమంతా వ్యాపించాయి. తెల్లని పువ్వులతో గుబురుగా ఖాళీ నివేశన స్థలాలు, రైల్వే ట్రాక్, బస్ స్టేషన్లు, కొండ ప్రాంతాల్లో పెరిగే ఈ జాతి మొక్కలు ప్రస్తుతం వ్యవసాయ భూములకు చేరాయి. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ గడ్డి అని పిలిచే ఈ కలుపు మొక్క వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ వయ్యారి భామ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి వల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్యపరమైన సమస్యలను గొల్లప్రోలు మండల వ్యవసాయవిస్తరణాధికారి రెడ్ల శ్రీరామ్(88977 41748) ఇలా వివరిస్తున్నారు. - గొల్లప్రోలు - విస్తరిస్తున్న వయ్యారిభామ - పొంచి ఉన్న ముప్పు - పంటలు, పొలాలకు చేటు తెస్తున్న కలుపుగడ్డి - ఆరోగ్యంపై దుష్ప్రభావం సుప్తావస్థ కలిగిన గడ్డి జాతి సుప్తావస్థ కలిగిన ఈ గడ్డి జాతి కలుపు మొక్క ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా సమర్థంగా తట్టుకుంటుంది. ఏడాదికి నాలుగు జీవితదశలను కలిగి ఉంటుంది. విత్తనం భూమిలో రెండేళ్ల వరకు, పై భాగంలో ఆరు నెలల వరకు జీవికతను కలిగి ఉంటుంది. ఒక్కో మొక్క లక్ష విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది. మొక్క సమీపంలోని మూడు కిలోమీటర్ల వరకు విత్తనాన్ని గాలి ద్వారా వ్యాపించగలుగుతుంది. మొక్క మొలచిన దగ్గర నుంచి మూడు నెలల వ్యవధిలో పూత దశకు చేరుతుంది. తెల్లటి పుప్పొడితో ఉన్న వయ్యారిభామ మొక్కలు ఒక రకమైన వాసనను వెదజల్లుతాయి. నివారణ ఒక్కటే మార్గం వయ్యారిభామ నివారణకు మొక్కలను తొలగించడం ఒక్కటే మార్గం. ఎటువంటి రసాయనక మందులు లేవు. మొక్కలను ఎప్పటికప్పుడు కాల్చి వేయకపోతే విత్తనాలు తిరిగి మొలకెత్తే అవకాశముంది. జైగోగ్రామాబైకులారేటాకు చెందిన బీటిల్స్(పురుగులు) మొక్కపై వదిలినట్టయి తే మొక్కల ఆకుల ను తిని నివారించే అవకాశముంది. కానీ ఆ టెక్నాలజీ మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆరోగ్యపరమైన సమస్యలు ముఖ్యంగా ఈ రకం మొక్కలు పార్ధీనియం, హెస్టరిన్, హైమోనిన్, ఎంబ్రోసిన్ అనే ప్రాణాంతకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా వీటిని తిన్న పశువులు జీర్ణక్రియ, కిడ్నీ, లివర్, అన్నవాహిక శ్వాసక్రియ దెబ్బతింటుంది. ఇవి తిన్న పశువులు చివరికి మృత్యువాత పడతాయి. మనుషులకు కూడా ఎనలేని అనర్థాన్ని తెచ్చి పెడతాయి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు ఎలర్జీ చర్మ, శ్వాససంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంది. దురదలు, తుమ్ములు వచ్చి చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. తొలగించేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి మొక్కలు తొలగించేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. మొక్కల పుప్పొడి, పువ్వులు చర్మానికి తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ముఖానికి గుడ్డలు లేదా, మాస్క్‌లు ధరించాలి. కాళ్లకు, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. చర్మవ్యాధులు సోకినట్టయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పంటలకు నష్టమిలా... పంటలకు ఇది తీరని నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా మెట్ట పంటలైన పత్తి, మొక్కజొన్న, గోధుమ, అపరాలు, మల్బరీ తోటలు, మామిడి, జీడిమామిడి తోటల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. వీటి వల్ల ఇతర పంటల మొలకశాతం తగ్గిపోవడంతో పాటు పంట ఎదుగుదల తగ్గిపోతుంది. భూసారాన్ని, పంటకు వేసిన ఎరువులు సారాన్ని పీల్చి వేస్తుంది. 40 శాతం వరకు పంట దిగుబడిని తగ్గించే గుణం దీనికి ఉంది. నత్రజని శాతాన్ని తగ్గిస్తుంది. భూమి నిస్సారవంతంగా తయారయ్యే అవకాశముంది. పోషకవిలువలు, సూక్ష్మధాతువులు శాతం తగ్గిపోతుంది. -
ఇలా చేస్తే.. కలుపుపై మనదే గెలుపు
వరిలో కలుపు నివారణకు ప్రస్తుతం ఎన్నో రసాయనిక మందులు అందుబాటులో ఉన్నాయి. ఆయా పద్ధతుల్లో వరి సాగుకు సంబంధించి కలుపు నివారణకు ఏఏ మందులు వాడాలో బాపట్ల మండల వ్యవసాయాధికారి పి. రఘు (8886614161) రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాస్తంత దృష్టి పెడితే వరిలో కలుపు నివారణ చాలా తేలికైన పని అని చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బాపట్లటౌన్: వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరిలో కలుపు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కూలీల కొరత కారణంగా కలుపు తీయడం ఖర్చుతో కూడుకున్న పనిగా మారుతోంది. ఈ నేపథ్యంలో కలుపు నివారణకు రైతులు రసాయనాలు వినియోగించాల్సిన అవసరం ఉంది. పలు పద్ధతుల్లో సాగు చేస్తున్న వరిలో కలుపు నివారణకు సంబంధించి రైతులు వేర్వేరు మందులు వాడాల్సి ఉంది. ప్రత్యేక పద్ధతులు అవలంబించాల్సి ఉంది. మెట్టవరిలో కలుపు యాజమాన్యం మెట్టపొలాల్లో వరిని రెండు పద్ధతుల్లో సాగుచేస్తున్నారు. వెదజల్లడం, గొర్రుతో విత్తడం.. ఇవే ఆ పద్ధతులు. ఇలా సాగుచేసిన పైరులో కలుపు నివారణకు వరి విత్తిన రెండు లేక మూడు రోజుల్లోగా లీటరు నీటికి ఐదు నుంచి ఆరు మిల్లీ లీటర్ల ఫెండీమిథాలిన్గానీ, రెండు మిల్లీలీటర్ల ప్రిటిలాక్లోర్ 50 శాతం ద్రావకాన్నిగానీ, 1.5 మిల్లీలీటర్ల అనిలోఫాస్గానీ పిచికారీ చేయాలి. ఊదలాంటి గడ్డిజాతి మొక్కలు ఉంటే.. - విధ పద్దతుల్లో సాగుచేసిన వరిలో విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్య ఊదలాంటి గడ్డిజాతి మొక్కలు ఎక్కువుగా ఉంటే ఎకరాకు 400 మిల్లీలీటర్లసైహాలోపాప్ బ్యూటైల్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - గడ్డిజాతి మొక్కలు, వెడల్పాటి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 80 నుంచి 100 మి.లీ బీస్పైరి బాక్ సోడియంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - విత్తినా, నాటిన 25 నుంచి 30 రోజుల్లో ఎకరాకు 400 గ్రాముల 2.4-డి సోడియం సాల్టుగానీ, 50 గ్రాములు ఇథాక్సి సల్ఫ్యూరాన్నుగానీ 15 శాతం పొడి మందుతో, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఎలాంటి కలుపునైనా సమర్థంగా నివారించుకోవచ్చు. డ్రమ్‌సీడర్ సాగులో వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల్లోగా పొలంలో నీరు పలుచగా ఉన్నప్పుడు ఎకరాకు 35 నుంచి 50 గ్రాముల ఆక్సాడయార్టిల్ పొడి మందు చల్లుకోవాలి. లేదంటే 80 గ్రాముల ఫైరజో సెల్ఫూరాన్ ఇథైల్‌ను అరలీటరు నీటిలో కరిగించి దానికి 20 కిలోల పొడి ఇసుక కలిపి పొలంలో చల్లుకోవాలి. వరి విత్తిన 3 నుంచి 4 రోజుల్లోగా ఎకరాకు 80 గ్రాముల పైరజోసల్ఫూరాన్ ఇథైల్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.