సాక్షి, నల్గొండ: పనికిరాని, నాసిరకం విత్తనాలకు రసాయన రంగులను పూయడంతోపాటు ఏకంగా క్యూఆర్ కోడ్‌లతో కూడిన ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి రైతులకు అంటగడుతున్న అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రైతుల నుంచి అందిన ఫిర్యాదులతో 15 రోజులపాటు జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందంతో కలసి అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ఈ కేసులో 13 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, లేబుల్ ప్యాకెట్లు, యాంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన నిందితులను శుక్రవారం నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను ఐజీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రంగనాథ్, వ్యవసాయ జేడీ శ్రీధర్‌రెడ్డిలు వెల్లడించారు. పట్టుబడిన వాటిలో రూ. 4 కోట్ల విలువైన 20 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, రూ. 2 కోట్ల విలువైన 200 టన్నుల నకిలీ వరి, మొక్కజొన్న, మిర్చి, ఇతర కూరగాయల విత్తనాలు ఉన్నాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకోకపోతే 40 వేల ఎకరాల్లో పంట నష్టంతోపాటు రైతులు పెట్టుబడి నష్టపోయేవారన్నారు.
దందా సాగించారిలా...
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో నైరుతి సీడ్స్ కంపెనీ నడుపుతున్న ప్రధాన నిందితుడు, చార్టెడ్ అకౌంటెంట్ అయిన ఏనుబోతుల శ్రీనివాస్‌రెడ్డి, ఏపీలోని నంద్యాలకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డిలు మరికొందరితో కలసి ఈ దందాకు తెరలేపారు. ఇందుకోసం శ్రీనివాస్‌రెడ్డి దేవరయాంజల్‌లో ఎంజీ అగ్రిటెక్ ప్రాసెసింగ్ యూనిట్ నడుపుతున్న కాకినాడవాసి మేడిశెట్టి గోవిందు, నంద్యాలకు చెందిన గోరుకంటి పవన్‌కుమార్, స్వామిదాస్‌ల సహకారం తీసుకున్నాడు. వారి ద్వారా పనికిరాని పత్తి గింజలు, ఇతర పంటల విత్తనాలను కిలో రూ. 200 చొప్పున కొనుగోలు చేసి వాటిని గోవిందుకు చెందిన ప్రాసెసింగ్ యూనిట్‌లో శుద్ధి చేసేవాడు. వాటిని నాణ్యమైన విత్తనాలుగా నమ్మించేందుకు రసాయన రంగులను పూసి అందమైన ప్యాకెట్‌లలో నింపి రైతులకు కిలో ప్యాకెట్‌ను రూ. 900 చొప్పున విక్రయించేవాడు.
రైతులను నమ్మించేం దుకు శ్రీనివాస్‌రెడ్డి నాగపూర్‌కు చెందిన ఐసీఏఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్) సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లుగా ప్యాకిం గ్ కవర్లపై ముద్రించాడు. ఈ దందాకు పాత నేరస్తుడైన మధుసూదన్‌రెడ్డితోపాటు ఖమ్మానికి చెందిన పెద్దిరెడ్డి, నల్లగొండ జిల్లా చండూర్‌కు చెందిన బాలస్వామి, దేవరకొండకు చెందిన పిచ్చయ్య, పవన్‌లతోపాటు మరికొందరు సహకరించేవారు. నకిలీ విత్తనాల రవాణాతోపాటు కొందరు డీలర్లకు అధిక కమీషన్ ఆశచూపి నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టేలా మధుసూదన్‌రెడ్డి తదితరులు ప్రోత్సహించేవారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు టాస్క్‌ఫోర్స్ బృందంతో కలసి ఏపీలోని నంద్యాల, ఆళ్లగడ్డతోపాటు గజ్వేల్, గద్వాల, జడ్చర్ల, హైదరాబాద్, గుండ్లపొచంపల్లి, ఎల్లంపేట, దేవరయాంజల్, బోయినపల్లి తదితర ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 20 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, 140 టన్నుల వరి, 40 టన్నుల మొక్కజొన్న, 4 క్వింటాళ్ల వివిధ కూరగాయల నకిలీ విత్తనాలు బయటపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment