ఆరు శాఖల్లో మార్పు
- 20 సూత్రాలతో కలెక్టర్ కసరత్తు
- ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
- వివిధ శాఖల సమన్వయానికి కృషి
- నేడు అధికారులతో సమీక్ష
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఆరు శాఖల్లో ‘మార్పు’ 20 సూత్రాల్లో భాగంగా గర్భిణుల నమోదు, ఆమె ఆరోగ్యంపై కనీసం నాలుగు సార్లు వైద్యునితో తనిఖీలు, తగినంత పోషకాహారం అందించడం, విటమిన్ల మాత్రలు వేసుకుంటున్నదీ లేనిదీ పరిశీలిస్తారు. తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడడం, పుట్టిన బిడ్డకు టీకాలు వేయడం, ప్రసవించిన 48 గంటల వరకూ ఆస్పత్రిలోనే ఉంచి ఇద్దరి ఆరోగ్యాలను వైద్యులు పర్యవేక్షిస్తారు. ఆరు నెలల వరకూ తల్లి పాలను బిడ్డకు ఇచ్చేలా ప్రోత్సహించడం, ఐదేళ్ల దాకా బిడ్డ ఎదుగుదలపై దృష్టి పెట్టి వ్యాధులు సోకకుండా పర్యవేక్షణ, కుటుంబ నియంత్రణ పాటించడం వంటి అన్ని అంశాలపై ఈ ఆరు శాఖలు దృష్టి సారించేలా జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.
ఓ కుగ్రామంలో అతిసార. వైద్య సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టి బాధితులకు మందులిచ్చి ఎలాగోలా బతికిస్తారు. ఆ పక్కనే మరో ఊళ్లో మళ్లీ డయేరియా ప్రబలి కుటుంబాలకు కుటుంబాలే మంచానపడతాయి. వైద్య సిబ్బంది అక్కడికీ పరుగులు తీస్తారు. కానీ ఏం లాభం? అతిసార, డయేరియాలు నీటి కలుషితం వల్లే వస్తాయి. ఈ విషయం వైద్యులకు తెలిసినా నీటి సరఫరా విభాగం వీరి చేతుల్లో ఉండదు.
మరో పల్లెలో ఓ తల్లి బిడ్డకు జన్మనిస్తూనే కన్నుమూస్తుంది. కారణం పౌష్టికాహార లోపం. కొద్ది రోజులయ్యాక ఆ బిడ్డకూ ఆరోగ్య సమస్యలే. దానికి పౌష్టికాహార లోపమే అంటారు. అయితే వారికి పౌష్టికాహారాన్ని అందించినట్టు స్త్రీశిశు సంక్షేమ శాఖ రికార్డుల్లో వుంటుంది. కానీ అదెక్కడికి పోతుంది?. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఒక్క శాఖతోనే సాధ్యం కాదని ప్రభుత్వం భావించింది. అందుకోసం 20 సూత్రాలను రూపొందించి పలు శాఖల్లో ‘మార్పు’ పేరిట సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది.
అనేక సమస్యలకు వివిధ శాఖల మధ్య సమన్వయలోపమే కారణమని ప్రభుత్వం గుర్తించింది. గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యే ఆరు ప్రభుత్వ శాఖలు కలిసి పని చేస్తేనే తప్ప మారో మార్గం లేదని నిర్ధారించింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలోని పలు సేవలు అట్టడుగు ప్రజలకు అందకపోవడానికి ఇదే కారణమని తేల్చింది. కలెక్టర్ ఆరోఖ్యరాజ్‌కు చిత్తూరులో మంచి గుర్తింపు తీసుకొచ్చిన ‘మార్పు’ను జిల్లాలోనూ అమలుకు అధికారులు నడుం బిగించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు జెడ్పీ హా ల్లో వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, ఐకేపీ, పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, మెప్మా వంటి శాఖలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించనున్నారు.