బ్యాంక్ ఖాతా నుంచి నగదు చోరీ | The theft of cash from a bank account | Sakshi
Sakshi News home page

బ్యాంక్ ఖాతా నుంచి నగదు చోరీ

Published Wed, Sep 9 2015 2:55 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

The theft of cash from a bank account

అచ్చంపేట : ‘మేము మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం... మీ ఖాతా వివరాలు తెలపండి’ అని సమాచారం తెలుసుకుని ఒక వ్యక్తి ఖాతా నుంచి అగంతకులు నగదును డ్రా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక టెలిఫోన్ ఎక్ఛేంజి కార్యాలయంలో ఖాశిం సైదులు టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో 91358 54613 నంబరు నుంచి సైదులుకు ఫోన్ వచ్చింది. నేను మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను... గుంటూరులో ఉన్న మీ బ్యాంకు అకౌంటు ఖాతా నంబరు మార్చుకోవాలని సలహా ఇచ్చాడు.

ముందుగా ఆధార్ నంబర్ చెప్పాలని కోరాడు. సైదులు ఆ నంబర్ చెప్పగా, అనంతరం బ్యాంకు ఏటీఎం కార్డుపై ఉండే 16 అంకెల నంబర్ చెప్పాలని కోరాడు. ఆ నంబర్ కూడా చెప్పాడు. దీంతో మీ ఫోనుకు ఒక నంబర్ వస్తుంది అది చెప్పాలని అవతలి వ్యక్తి కోరాడు. అనంతరం సెల్‌కు వచ్చిన వన్‌టైమ్ పాస్‌వర్‌‌డ నంబర్‌ను సైదులు ఫోన్ చేసిన అవతలివైపు వ్యక్తికి తెలిపాడు. ఆ తరువాత అవతలివైపు వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఆ తరువాత కొద్ది సేపటికి సైదులు సెల్‌కు తన అకౌంట్ నుంచి రూ.41 వేలు డ్రా అయినట్టు సమాచారం వచ్చింది.

కంగారుపడ్డ సైదులు వెంటనే బ్యాంకుకు వెళ్లి విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. బీహార్‌లోని ఏటీఎం సర్వీసింగ్ సెంటర్ నుంచి రూ.41 వేలకు 6 వస్తువులను కొనుగోలు చేసినట్టు ప్రింట్ తీసి బాధితుడు సైదులుకు ఇచ్చారు. తాను అసలు బీహారు వెళ్లలేదని, ఇదెలా సాధ్యమని బ్యాంకు అధికారుల వద్ద వాపోయాడు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ ఖాతా వివరాలు ఎవరికీ తెలియజేయవద్దని ఎన్నోసార్లు సెల్ మెసేజ్‌లు ఇస్తున్నామని, అయినా వివరాలు తెలియజేయడం మీ తప్పే అని సైదులుకు తెలియజేశారు.

ఈ విషయంలో తామేమీ చేయలేమని సమాధానం ఇచ్చారు. అనంతరం బాధితుడు సైదులు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, అక్కడి సిబ్బంది ఇది సైబర్ నేరం కిందకు వస్తుందని తెలిపారు. గుంటూరులో ప్రతి సోమవారం ఎస్పీ తన కార్యాలయంలో సైబర్ నేరాలపై గ్రీవెన్స్ నిర్వహిస్తారని, అక్కడ ఫిర్యాదు చేయాలని సూచించారు. తనకు వచ్చిన ఫోన్ నంబరు ఆధారంగా వివరాలు సేకరించగా అది ఏటీఎం సర్వీస్ సెంటర్‌ది అని తేలిందన్నారు. తన భార్య చనిపోతే ఎల్‌ఐసీ క్రింద ఆ డబ్బు వచ్చిందని, తనకు న్యాయం చేయాలని సైదులు వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement