ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద యువకుడు గల్లంతు
నీటిలో చిక్కుకున్న మరో యువకుడిని కాపాడిన పోలీసులు
వల్లూరు:
పెన్నానదిలో ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఎస్‌ఐ కొండారెడ్డి కథనం మేరకు... చెన్నూరు మండలం ఉప్పరపల్లె ఎస్సీ కాలనీకి చెందిన సగినాల ఓబులేసు(35) ,తప్పెట వెంకటరమణ మరో ముగ్గురు యువకులతో కలసి ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్దకు సరదాగా గడపడానికి వచ్చారు. ఆనకట్ట సమీపంలో నదిలో ఈత ఆడుతుండగా ప్రమాదవశాత్తూ ఓబులేసు, వెంకట రమణలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఓబులేసు నీటిలో పూర్తి మునిగి కొట్టుకుని పోయాడు. వెంకట రమణ మాత్రం కొద్ది దూరం నీటిలో కొట్టుకుని పోయి నది మధ్యలోని ఒక బండ రాయిని ఆసరాగా చేసుకుని నిలబడ్డాడు. రక్షించమని కేకలు వేశాడు. స్నేహితులు రక్షించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎస్‌ఐ కొండారెడ్డి సంఘటనా స్థలానికి సిబ్బందితో వెంటనే చేరుకున్నాడు. స్థానికంగా ఉన్న గజ ఈతగాల్ల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. ఎన్ .ఆంజనేయరెడ్డి, వాసు, జీ. ఆంజనేయరెడ్డి, విజయ్, శ్రీను అనే యువకులు తాడు సహాయంతో నదిలోకి దిగి నీటిలో చిక్కుకున్న వెంకట రమణను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. కాగా గల్లంతైన ఓబులేసు దాదాపు 10 సంవత్సరాల క్రితం రాజంపేటకు చెందిన పద్మావతిని వివాహం చేసుకున్నాడు. సంతానం లేక పోవడంతో తన సోదరుని కుమార్తెను పెంచుకుంటున్నట్లు బంధువులు తెలిపారు. ఓబులేసు బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా రోధించారు.
మద్యం మత్తుతోనే..
చెన్నూరుకు చెందిన యువకులు మద్యం సేవించి నదిలోకి దిగడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. నదిలో పెద్ద ప్రవాహమేమీ లేదు. మద్యం సేవించి నదిలోకి దిగిన యువకులు అదుపు తప్పి ప్రవాహంలో కొట్టుకుని పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ వెంకటేష్ సందర్శించారు. ఎస్‌ఐ కొండారెడ్డితో మాట్లాడి ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు.