=తల్లి చనిపోయిన కొన్ని గంటల్లోనే మనోవేదనతో కుమార్తె మృతి
=రెండు కుటుంబాల్లో విషాదం
గొలుగొండ, న్యూస్‌లైన్: విధి విచిత్రమైనది. ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితి. గొలుగొండ మండలంలో శనివారం ఇదే జరిగింది. మండలంలోని శ్రీరాంపురానికి చెందిన చిటికెల నూకాలమ్మ(70) శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయింది. ఆరోగ్యంగా తిరుగాడుతున్న నూకాలమ్మ ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
అనంతరం బంధువులకు మరణవార్త చెప్పేందుకు అంతా తలోదారి వెళ్లారు. నూకాలమ్మకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. కుమారులు ముగ్గురు గ్రామంలోనే ఉంటున్నారు. పెద్దకుమార్లె సుర్ల ఆదిలక్ష్మి తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామంలో ఉంది. రాత్రి 7గంటలకు తల్లి మరణవార్తను ఆమెకు చేరవేశారు. తల్లి చనిపోయిందని తెలిసి ఆదిలక్ష్మి కన్నీరుమున్నీరైంది. కుమారుడు భవానీమాలలో ఉండటంతో బయటకు వెళ్లకూడదని అంతా ఆమెకు తెలిపారు.
దీంతో తల్లి ఆఖరిచూపులకు నోచుకోలేదనే బెంగతో మానసికంగా కుంగిపోయింది. రాత్రి 8.30 గంటలకు ఆదిలక్ష్మి(51) కూడా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. తల్లి నూకాలమ్మకు శనివారం రాత్రే అంత్యక్రియలు చేపట్టిన శ్రీరాంపురంలోని బంధువులు ఆదివారం ఉదయాన్నే నాగరాయి గ్రామం వెళ్లి ఆదిలక్ష్మి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కొన్ని గంటల వ్యవధిలో తల్లీకుమార్తెల మరణంతో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది.
అమ్మా! నీ వెంటే..
Published Mon, Dec 16 2013 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement