నా భర్త షాపు దగ్గర లేకపోతే లారీలు వెళ్లిపోయేవి
భద్రాచలం, మణుగూరు నుంచి రోజూ సిమెంట్ లారీలు, టిప్పర్లు బయలుదేరి కొత్తగూడెంలోని ఆదిలక్ష్మి పంక్చర్ షాపు ముందు ఆగుతాయి. ఆదిలక్ష్మి చేయి పడితే వాటి టైర్లకున్న జబ్బులన్నీ పోతాయి. ఇంతకాలం పురుషులే టైర్ల మరమ్మతులు చేసేవారు. ఇప్పుడు ఆదిలక్ష్మి వాటిని ఇటు అటూ తిప్పి అవలీలగా బోర్లించి రిపేర్ చేస్తుంది. ‘నా భర్త షాపు దగ్గర లేకపోతే లారీలు వెళ్లిపోయేవి. బేరం చెడగొట్టుకోవడం ఎందుకు అని నేనే పనిలో దిగా’ అంటుంది ఆదిలక్ష్మి. ఇప్పుడూ ఆదిలక్ష్మి భర్త పంక్చర్లు వేస్తాడు. కాని టైర్లన్నీ అదిరిపడేది ఆదిలక్ష్మి అడుగుల చప్పుడుకే. తెలంగాణ తొలి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మి కథ ఇది.
‘నా కడుపులో రెండో అమ్మాయి ఉన్నప్పుడు మా ఆయన కరెంటు పోల్స్ వేసే పనికి కొత్తగూడెం నుంచి కడప వైపు వెళ్లాడు. నిండు నెలలు నాకు. నొప్పులొచ్చాయి. పైసలు లేవు. మనిషి దగ్గర లేడు. కూతురు పుట్టిన వారానికి చూడటానికి వచ్చాడు. నాకు దుఃఖం వచ్చింది. ఏం చేద్దామా అని ఆలోచించాను ఇద్దరం ఒకటే చోట ఉండి పని చేయడానికి’ అంది ఆదిలక్ష్మి. ఆమె వయసెంతో ఆమెకు తెలియదు. 30 ఉండొచ్చని అంటుంది. కొత్తగూడెం నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండే పాత అంజనాపురం వాళ్లది. ‘మేము నలుగురం ఆడపిల్లలం. నేను రెండోదాన్ని. మా అమ్మా నాన్న పొలం కూలీకి పోతే ఇంట్లో నా చెల్లెళ్లని చూసుకోవడానికి ఉండిపోయాను. బడికెళ్లలేదు’ అంటుంది ఆదిలక్ష్మి.
లారీ టైర్‌కు గాలి నింపుతున్న ఆదిలక్ష్మి
ఇప్పుడు ఆమె కొత్తగూడెంలో చాలా ఫేమస్. ఇంకొన్నాళ్లలో తెలంగాణ అంతా ఫేమస్ కావచ్చు. ఎందుకంటే లారీ టైర్ల మరమ్మతు చేస్తున్న ఏకైక మహిళా మెకానిక్ కాబట్టి. హెవీ వెహికిల్స్ టైర్లను విప్పడం సామాన్యమైన విషయం కాదు. వాటికి పంక్చర్లు వేయడానికి చాలా బలం కావాలి. కాని ఆదిలక్ష్మి ఆ పనులన్నీ పర్ఫెక్ట్గా చేస్తుంది. ఆ దారిలో మగవాళ్లు వేసే పంక్చర్లనైనా డ్రైవర్లు అనుమానిస్తారేమోగాని ఆదిలక్ష్మి వేసే పంక్చర్లను అనుమానించరు. అంత పర్ఫెక్ట్ వర్కర్ ఆమె.
చెట్లెక్కే నిపుణురాలు
‘నా చిన్నప్పుడు ఇంట్లో మొక్కజొన్న దంచి కడక చేసేవారు. జావ కాచేవారు. బియ్యమే తెలియదు మాకు. జొన్నకూడు తినలేక నేను అడవిలో, పొలాల్లో దొరికే వాటి కోసం తిరిగేదాన్ని. పన్నెండేళ్లకే తాటిచెట్లు ఎక్కి కాయలు కోశా. కొబ్బరిచెట్లు ఎక్కా, రేగుకాయలు, పరిగి కాయలు, సీమసింత గుబ్బలు తిని పెరిగా. నాకు కష్టం చేయడం పెద్ద కష్టం కాదు’ అంది ఆదిలక్ష్మి. వరుసకు అత్తకొడుకైన భద్రంతో ఆమెకు 12 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. అతడు టైర్ల మెకానిక్. వెల్డింగ్ చేస్తాడు. జీతానికి ఉంటే ఆ జీతం ఏ కోశానా సరిపోయేది కాదు. దూరానికి వెళ్లి కూలి చేసేవాడు. ఇవంతా వద్దు మనమే చేసుకుందాం అని షాపు పెట్టించింది ఆదిలక్ష్మి. ‘మాకు ఎవరూ అప్పు ఇవ్వలేదు. ఎలాగో 80 వేలు వడ్డీకి తీసుకొని అవి చాలక మరో 50 వేలు అప్పు చేసి... సుజాత నగర్లో ఈ స్థలం నెలకు 2 వేలు కిరాయికి తీసుకొని షాపు మొదలెట్టా’ అందామె.
మొదలైన పని..
భర్త కోసం ఆదిలక్ష్మి గాలి మిషను, బోల్డ్ మిషను, గ్రీజు మిషను, జనరేటర్... ఇన్ని ఎలాగోలా సమకూర్చింది. కాని భర్త ఏవో పనుల కోసం బయటకు వెళ్లేవాడు. లేదంటే తొందరగా అలసిపోయేవాడు. ‘బేరాలు పోతుంటే తట్టుకోలేకపోయా. నేనే చేయడానికి పనిలో దిగా. నన్ను చూసి నువ్వు వేస్తావా అని లారీ డ్రైవర్లు ఆగకుండా వెళ్లిపోయేవాళ్లు. ఇలా కాదని వాళ్లను కూచోబెట్టి వాళ్లముందే టైర్లను విప్పి పంక్చర్లు వేశా. ఒకప్పుడు వెళ్లిపోయిన వాళ్లంతా ఇప్పుడు ఆగుతున్నారు’ అంది ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి స్టిక్కర్ వేస్తుంది. హీట్ పంక్చర్ వేస్తుంది. టైర్‌కు చిల్లిపడితే క్షణాల్లో పూడ్చేస్తుంది. బండ్లకు అవసరమైన మైనర్ వెల్డింగ్ వర్కులు చేస్తుంది. ‘ఆ వెల్డింగ్‌లో ప్రమాదం జరిగి కన్ను పోయేంత పనయ్యింది. విజయవాడ ఎల్.వి.ప్రసాద్లో 50 వేలు ఖర్చయ్యింది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఒక కన్ను ఏమీ కనపడదు. కొన్ని గంటల పాటు ఎదుట ఉన్నది నెగెటివ్ లాగా కనిపిస్తుంది’ అంటుంది ఆదిలక్ష్మి.
కొనసాగుతున్న పని
ఆదిలక్ష్మికి మూడు కోరికలు ఉన్నాయి. పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి, మూడు... అప్పులు తీరాలి. ఇవన్నీ ఆమె సాధించుకోగలదు. కాని ఆమె మరోమాట అంది. ‘నా దగ్గరకు పని నేర్చుకోవడానికి వచ్చినవారికి మంచిగా తిండి పెట్టి పని నేర్పించేలా నేనుండాలి’ అని. ఈ హృదయం తక్కువమందిలో ఉంది. ఆదిలక్ష్మి భవిష్యత్తులో మరింత ఎదుగుతుంది. ఆమె భవిష్యత్తు చక్రానికి తిరుగులేదనే అనిపిస్తుంది. శ్రమను నమ్ముకుంటే ఓటమి ఉంటుందా?
– సాక్షి ఫ్యామిలీ
ఫొటోలు: దశరథ్ రజ్వా