సాక్షి, తిరుపతి: ఎర్ర చందనం దుంగల కోసం దొంగలు శేషాచలం అడవిలోకి క్యూకడుతున్నారు. రోజూ అడవిలోకి చొరబడుతూ అటవీ అధికారులు, పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అధికారులు దాడులు చేస్తున్నా.. వారు లెక్కచేయడంలేదు. అరెస్టులు చేస్తున్నా.. భయపడటంలేదు. టాస్క్‌ఫోర్స్ అధికారులకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం శేషాచలం అడవిలో ఐదువేల మందికి పైగా తమిళ కూలీలు తిష్టవేశారు. వారిని ఎలా తరిమికొట్టాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న శేషాచలం అడవిలోని ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు విచ్చలవిడిగా నరికేస్తున్న విషయం తెలిసిందే. అలా నరికిన చెట్లను దుంగలుగా చేసి ఇతర దేశాలకు తరలించి కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. అటవీ అధికారులు, టాస్క్‌ఫోర్స్, పోలీసులు చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలో ఇప్పటి వరకూ 175 మంది దొంగలపై పీడీ యాక్ట్ కేసులు నమోదుచేశారు. అయినా వారి నుంచి ఆస్తులు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. దీంతో ఎర్రదొంగలు కూడా పీడీయాక్ట్‌లు, అరెస్టులకు భయపడటంలేదు. తాజాగా చిత్తూరు జిల్లా చెన్నై జాతీయ రహదారిలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా అంతర్జాతీయ స్మగ్లర్ నజీముద్దీన్‌ఖాన్ పట్టుబడ్డాడు. వాహనంలో అతనితో పాటు ఉన్న మరో ముగ్గురు స్మగ్లర్లు పారిపోయారు. స్మగ్లర్లు ప్రయాణిస్తున్న వాహనంలో 392 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నజీముద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు బెంగుళూరులో మరో 1,123 కిలోల ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఇదిలా ఉంటే బాకరాపేట వద్ద 32 మంది దొంగలు దుంగలను తీసుకెళ్తుండగా అటవీ అధికారులు దాడులు చేశారు. దీంతో వాటిని వదలి దొంగలు పారిపోయారు.
క్యూ కడుతున్న కూలీలు
ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన స్మగ్లరు తమిళనాడులో 45 మంది, బెంగుళూరులో 63 మంది తిష్టవేసి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో స్మగ్లర్ వద్ద 10 నుంచి 20 మంది అనుచరులున్నారు. వీరు కూలీలను శేషాచలం అడవిలోకి పంపుతుంటారు. కూలీలు తీసుకొచ్చిన ఎర్రచందనం దుంగలను మరో ముఠా చెన్నై, కర్ణాటకలోని రహస్య ప్రాంతాలకు చేరవేస్తుంది. వీరిలో ఏ ఒక్క ముఠా పోలీసులకు చిక్కినా.. మరో ముఠా రంగంలోకి దిగుతుంది. సైక్లింగ్ పద్ధతిలా కూలీలను పంపటం.. ఎర్రచందనం దుంగలను రహస్య ప్రాంతాలకు చేరవేయడం.. నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఇందుకోసం స్మగ్లర్లు కూలీలకు ఒక్కొక్కరికి రోజుకి రూ.1,500 నుంచి రూ.రెండు వేల వరకు చెల్లిస్తుండటంతో వారు అడ్డదారులు తొక్కుతున్నారు.
ఎర్రదొంగల ఎదురు దాడులు
కూలీలను చేరవేసేందుకు కొందరు ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్లు కూడా సహకరిస్తున్నారు. ఆరు నెలల నుంచి ఎర్రచందనం రవాణా అధికమైందని టాస్క్‌ఫోర్స్ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం అడవిలో ఉన్న కూలీలను తరిమేసేందుకు అటవీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు సాహసం చేయలేకపోతున్నారు. ఆ శాఖలో తగినంత సిబ్బంది, సరైన ఆయుధాలు లేకపోవటమే దీనికి కారణమని ఆ అధికారి వివరించారు. ఒకవేళ సాహసం చేసి కూలీలను పట్టుకునేందుకు వెళితే వారు ఎదురు దాడికి దిగుతున్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి గట్టి చర్యలు తీసుకుంటే తప్ప ఎర్రచందనాన్ని కాపాడలేమని అధికారులు స్పష్టంచేస్తున్నారు.
అడవి నిండా.. ఎర్ర దొంగలు!
Published Thu, Nov 2 2017 2:41 AM | Last Updated on Thu, Nov 2 2017 2:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment