=గ్యాస్ వినియోగదారులపై దొంగ దెబ్బ
=‘నగదు బదిలీ’తో సబ్సిడీకి మంగళం
=వాటా చెల్లించకుండా చెల్లుచీటీ
=ఒక్కో సిలిండర్‌పై రూ. 54.30
=జిల్లాలో 3.54 లక్షల మంది లబ్ధిదారులపై బాదుడు
=నెలకు రూ.1.92 కోట్ల అదనపు భారం
=ఆధార్ ఎన్‌రోల్ అయిన వారికి అమలవుతున్న సబ్సిడీ కోత
వరంగల్, న్యూస్‌లైన్ : గ్యాస్ సబ్సిడీని ఎత్తివేయూలని రాష్ట్ర సర్కారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. కానీ... ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని పక్కనబెట్టింది. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టిన గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందివచ్చిన అవకాశంగా మలుచుకుంది. సబ్సిడీకి చెల్లుచీటి పలికి... ఆ భారాన్ని దొంగచాటుగా వినియోగదారులపై వేస్తోంది. ఒక్కో సిలిండర్‌పై అదనంగా రూ. 54.30 వసూలు చేస్తూ వారి నడ్డి విరుస్తోంది. జిల్లా వినియోగదారులపై ప్రతి నెలా సుమారు రూ. 1.92 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు అంచనా.
దొంగచాటుగా సబ్సిడీ ఎత్తివేత ఇలా...
నగదు బదిలీ అమలు తర్వాత ఒక్కో గ్యాస్ సిలిండర్‌కు చెల్లించాల్సిన మొత్తం వ్యాట్‌తో కలుపుకుని రూ. 1,090. ఆ తర్వాత ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో జమ చేసే సొమ్ము రూ. 622. అంటే వినియోగదారుడు చెల్లించాల్సింది రూ. 468. (ఆధార్ వివరాలు ఎన్‌రోల్ అరుున తర్వాత ఒక్కో సిలిండర్‌కు వినియోగదారుడు ఈ మొత్తాన్ని తప్పకుండా చెల్లించాల్సిందే) ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ. 413.70. ఈ లెక్కన తేడా రూ. 54.30. ఈ మొత్తమే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిన సబ్సిడీ.
భారం ఎలా అంటే...
జిల్లావ్యాప్తంగా అన్ని కేటగిరీలు కలుపుకుని 5,41,600 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 3.54 లక్షల మంది వినియోగదారులు ప్రతి నెలా రెగ్యులర్‌గా గ్యాస్ తీసుకుంటారని ఏజెన్సీల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు 3.01 లక్షల మంది ఆధార్ వివరాలు సమర్పించారు. వారికి ఇప్పటినుంచే నగదు బదిలీ పథకం వర్తిస్తుంది. ఈ లెక్కన నెలకు ఒక్కో సిలిండర్‌పై వారు అదనంగా చెల్లిస్తున్న మొత్తం రూ. 1,63,44,300. ఇంకా 53 వేల మంది ఆధార్ వివరాలు సమర్పించాల్సి ఉంది.
వీరు ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌కు రూ. 413.70 చెల్లిస్తున్నారు. ఆధార్ వివరాలు సమర్పించిన తర్వాత నెలకు వారికి ఒక్కో సిలిండర్‌కు భరించాల్సిన సబ్సిడీ భారం రూ. 54.30 కాగా... ఈ లెక్కన వారిపై అదనంగా రూ. 28,77,900 పడుతుంది. మొత్తం 3.54 లక్షల మంది వినియోగదారుల నెత్తిన నెలకు రూ. 1,92,22,200 భారం పడుతున్నట్లు అంచనా.