బాధితుల్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే అమర్‌నాథ్
సాక్షి, అనకాపల్లి/తుమ్మపాల: పాపికొండలను వీక్షించేందుకు వెళ్లిన అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం పాపికొండలకు వెళ్లేందుకు బోటు ఎక్కిన గోపాలపురానికి చెందిన నలుగురిలో ముగ్గురు ఆచూకీ ఇంకా లభించకపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. తమవారు క్షేమంగా ఇంటికి చేరాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. మరోపక్క గ్రామంలో నిశ్శబ్ద వాతావరం నెలకొంది. గల్లంతయిన వారి యోగక్షేమాలు తెలియకపోవడంతో ఏం జరుగుతుందోనన్న భయం అందరిలో నెలకొంది. గోపాలపురానికి చెందిన పెదిరెడ్డి దాలమ్మ(45), తన సోదరీమణి భూసాల లక్ష్మితో కలిసి పాపికొండలకు వెళ్లాలని భావించారు. వీరితో పాటు లక్ష్మి మనుమరాలు సుస్మిత(3)తో పాటు పక్కింటి అమ్మాయి భూసాల పూర్ణ(18)ను కూడా తీసుకువెళ్లారు. లక్ష్మి కుమార్తె అరుణకు చేనుల అగ్రహారానికి చెందిన రమణతో పెళ్లి అయ్యింది. చేనుల అగ్రహానికి చెందిన మధుపాడ రమణ, అరుణ దంపతులు ప్రస్తుతం విశాఖ పట్నంలోని ఆరిలోవలో ఉంటున్నారు.
గోపాలపురానికి చెందిన నలుగురితో పాటు, ఆరిలోవలో ఉంటున్న రమణ, అరుణ దంపతులతో పాటు వారి పిల్లలు అఖిలోష్, కుషాలిలతో కలిపి ఎనిమిది మంది శనివారం సాయంత్రం రైలులో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్లారు. అక్కడి నుంచి బోటులో పాపికొండలకు వెళ్తుండగా బోటు బోల్తాపడి అందులో ఉన్నవారు గల్లంతుకాగా, భూసాల లక్ష్మి సురక్షితంగా బయటపడింది. ఈమెను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మితో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఫోన్‌లో మాట్లాడి ఆమె పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గోపాలపురానికి వెళ్లి బాధిత కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబీకులను రంపచోడవరం ప్రాంతానికి తరలించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా గ్రామంలో విషాదఛాయలు ఏర్పడటంతో తహసీల్దార్ వైఎస్ వీవీ ప్రసాద్, ఎస్సై రామకృష్ణలు గోపాలపురానికి చేరుకున్నారు. మరోవైపు గోపాలపురంలోని బాధిత కుటుంబీకులు అంతా రోదనలో మునిగిపోయారు. వీరిని స్థానికుడైన వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గొర్లె సూరిబాబు, వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి భీశెట్టి జగన్‌లు పరామర్శించారు. లక్ష్మి సురక్షితంగా ఉన్నప్పటికీ పెదిరెడ్డి దాలమ్మ, పూర్ణ, సుశ్మితలు ఎక్కడున్నారనే ఆందోళనతో స్థానికులు ఉన్నారు. ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్ కూడా బాధిత కుటుంబీకుల్ని పరామర్శించారు.
వేపగుంటలో విషాదం
పెందుర్తి: బోటు ప్రమాదంలో వేపగుంట ప్రాంతానికి చెందిన తల్లీ కూతురు గల్లంతయ్యారన్న సమాచారంతో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. వేపగుంట ముత్యమాంబ కాలనీకి చెందిన బొండా శంకర్రావు, లక్ష్మి(37) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పాపికొండలకు వెళ్లేందుకు నగరంలోని బంధువులతో కలిసి ఆదివారం వేకువజామున లక్ష్మి, పెద్ద కుమార్తె పుష్ప బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో తల్లీ కుమార్తెలు గల్లంతుకావడంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి వీరితోపాటు శంకర్రావు, చిన్న కుమార్తె కూడా వెళ్లాల్సి ఉండగా ఇంటి వద్ద పని ఉండడంతో ఉండిపోయారు.
అప్రమత్తమైన కలెక్టర్..
మహారాణిపేట(విశాఖ దక్షిణ): గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో విశాఖ జిల్లా వాసులు ఉండటంతో కలెక్టర్ వి.వినయ్‌చంద్ అప్రమత్తమయ్యారు. తక్షణం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్ ప్రకటించారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఆర్డీవో కిశోర్, టూరిజం అధికారులను పంపారు. అలాగే బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించాలని మహారాణిపేట తహసీల్దార్‌ను ఆదేశించారు.
షాక్‌లో భూసాల లక్ష్మి..
అనకాపల్లి: పాపికొండలకు వెళ్తూ బోటు బోల్తా పడిన ఘటనలో సురక్షితంగా బయటపడిన భూసాల లక్ష్మి తీవ్ర షాక్‌లో ఉంది. పడవ మునిగిన తర్వాత ఎలా ఒడ్డుకు చేరానో తెలియలేదంటూ ఆమె సాక్షికి తెలిపింది. తన వారు ఏమయ్యారంటూ ఆందోళనగా ప్రశ్నిస్తోంది. రంపచోడవరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను కుటుంబీకులు ఓదార్చే ప్రయత్నం చేశారు. మిగిలిన వారంతా మరో ఆస్పత్రిలో ఉన్నారని లక్ష్మి సర్దిచెప్పినప్పటికీ ఆమె షాక్ నుంచి కోలుకోలేదు. కాగా ఫోన్‌లో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ బాధితురాలితో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబీకులకు వెన్నుదన్నుగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు లక్ష్మి చికిత్స పొందుతున్న ప్రాంతానికి ఎమ్మెల్యే వెళ్లనున్నారు.
ప్రమాదం దురదృష్టకరం..
పాపికొండల్లో విహార యాత్రలో విషాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిని మంత్రులు పరామర్శించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.
– వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ నగర అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ
గతంలోనూ అదే చోట ప్రమాదాలు..
దురదుష్టవశాత్తూ జరిగిన బోటు ప్రమాదంలో విశాఖ వాసులు గల్లంతవ్వడం బాధాకరం. మృతి చెందిన వారి కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. గతంలో అదే ప్రదేశంలో రెండు ప్రమాదాలు జరిగాయి.
–కొయ్య ప్రసాదరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment