ముగ్గురు దొంగల అరెస్ట్ | Three pirates arrested | Sakshi
Sakshi News home page

ముగ్గురు దొంగల అరెస్ట్

Published Fri, Nov 29 2013 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

Three pirates arrested

భీమారం, న్యూస్‌లైన్ : జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను కేయూసీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.1.17 లక్షల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేయూసీ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ దేవేందర్‌రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు.

నగర శివారులోని గోపాలపురానికి చెందిన సల్లూరి సతీష్ (కార్పెంటర్), విద్యారణ్యపురికి చెందిన నిమ్మ సతీష్(మిషన్ వర్కర్), గోపాలపురంలోని సుభాష్‌నగర్‌కు చెందిన కర్ర రాజు(ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థి) ముగ్గురు స్నేహితులు. అయితే తాగుడు, జల్సాలకు అల వాటుపడిన వీరు నగరంలోని వివిధ కాలనీల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని అందులో దొంగతనాలకు పాల్పడేవారు.

చోరీలు చేసే సమయంలో ముగ్గురిలో ఒకరు రోడ్డుపైన, రెం డో వ్యక్తి ఇంటి సమీపంలో, మూడోకరు ఇంటి లో చొరబడి నగలు, విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లేవారు. ఇటీవల వీరు గోపాలపురంలోని శంకరాచారి, విజయభాస్కర్ ఇళ్లతోపాటు విద్యారణ్యపురికి చెందిన రాజిరెడ్డి గృహంలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తాము చోరీ చేసిన వస్తువులను హన్మకొండలో విక్రయించాలనుకుని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వా రు గురువారం భీమారం బస్టాండ్ వద్ద అనుమానస్పదంగా నిలబడి ఉండడంతో కేయూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా తాము చేసిన దొంగతనాలను వారు ఒప్పుకున్నారు.

ఈ సందర్భంగా నిందితుల నుంచి ఒక నోకియా సెల్‌ఫోన్, డీవీడీ ప్లేయర్, 400 గ్రాముల వెండి వస్తువులు, మూడు తులాల బంగారు ఆభరణాలు, మొత్తం రూ.1.17 లక్షల విలువ చేసే సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో క్రైం ఎస్సై ఎన్. శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, దొంగలను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన హోంగార్డు ఎ.నరేష్‌ను సీఐ అభినందించి, రివార్డ్ అందజేశారు.
 

Advertisement
Advertisement