భవిష్యత్తుపై భరోసా పెంచుకోండి
- ఉచితంగా మళ్లీ పోలీసు శిక్షణ ఇప్పిస్తాం
- టీఆర్‌ఎస్‌రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి
మెదక్: మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి...బంగారు భవిష్యత్తు కోసం పునాదులు వేసుకోండి...మీ అందరినీ ఖాకీ దుస్తుల్లో చూడాలన్నదే..మా ఏకైక లక్ష్యం మరోసారి ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఇటీవల ఎస్‌ఐ, కానిస్టేబుల్ శిక్షణలో అర్హత సాధించిన అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగులు అత్యధికంగా పోలీస్ శాఖలో ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో మాధవరెడ్డి చారిటబుల్ ట్రస్టు పేరిట ఉచితంగా శిక్షణ ఇప్పించామన్నారు.
ఈయేడు ఫిబ్రవరి 20నుంచి ఏప్రిల్ 1 వరకు అభ్యర్థులకు హైదరాబాద్ నుంచి శిక్షకులను పిలిపించి 580మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు మధ్యాహ్న భోజనం, బుక్స్ అందజేశామన్నారు. అందులో 150మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించగా, ఈవెంట్స్‌లో 60మంది అర్హత సాధించారన్నారు. వీరిలో ఆరుగురు ఎస్‌ఐ అభ్యర్థులు కాగా, 54మంది కానిస్టేబుల్ అర్హత సాధించినట్లు తెలిపారు. ఈవెంట్స్‌లలో అర్హత సాధించిన వారంతా ఖాకీ యూనిఫాం వేసుకున్నప్పుడే తల్లిదండ్రుల కల, మా లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఇందుకోసం మరోరెండు నెలల వరకు అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామన్నారు.
పేరు నిలబెడతాం
గత ఫిబ్రవరి నుంచి ఉచిత శిక్షణ ఇవ్వడంతో ప్రిలిమినరీ పరీక్షలతోపాటు ఈవెంట్స్‌లో రాణించాం. మేము ప్రైవేట్‌గా శిక్షణ తీసుకుంటే ఆర్థికంగా చాలా ఖర్చయ్యేది. ఇక్కడ శిక్షణ తీసుకున్నందునే మేము ఇంత వరకు రాణించగలిగాం. ఉద్యోగాలు సాధించి ట్రస్టు పేరు నిలబెడతాం.
సురేష్, ఎస్‌ఐ అభ్యర్థి, కొంటూర్
ఉద్యోగం సాధించి తీరుతాం
మేము అడగకుండానే రూ. లక్షలు వెచ్చించి మా భవిష్యత్తు కోసం ఉచిత శిక్షణ, మధ్యాహ్న భోజనం, బుక్స్ అందజేశారు. మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించి తీరుతాం.
కె. రాణి, కానిస్టేబుల్ అభ్యర్థిని, మక్తభూపతిపూర్
డిప్యూటీ స్పీకర్ దంపతులకు రుణపడి ఉంటాం
మా భవిష్యత్తు కోసం డిప్యూటీ స్పీకర్ దంపతులు ఉచితంగా శిక్షణ ఇప్పించడంతో పరీక్షల్లో, ఈవెంట్స్‌లో నెగ్గాం. మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఫైనల్స్‌లో కూడా విజయం సాధిస్తాం. మాకు ఇంతటి చేయుతనిస్తున్న డిప్యూటీ స్పీకర్ దంపతులకు రుణపడి ఉంటాం.
సరిత, కానిస్టేబుల్ అభ్యర్థిని, బి.భూపతిపూర్