తిరుపతి రాజకీయ భిక్ష పెట్టింది | Tirupati has political alms | Sakshi
Sakshi News home page

తిరుపతి రాజకీయ భిక్ష పెట్టింది

Published Wed, Apr 29 2015 2:44 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

తిరుపతి రాజకీయ భిక్ష పెట్టింది - Sakshi

తిరుపతి రాజకీయ భిక్ష పెట్టింది

ఈ ప్రాణం తిరుపతివాసులదే
ఏరోజూ మచ్చ తెచ్చేలా వ్యవహరించను
విద్య, వైద్యం, సంక్షేమమే ధ్యేయం
తిరుమల, తిరుపతికి తాగునీటి సమస్య రాకుండా కృషి
దాతల సాయంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
టీటీడీ ఈవో బాగా పనిచేస్తున్నారు
చదలవాడ కృష్ణ్ణమూర్తి వెల్లడి

 
తిరుపతి కార్పొరేషన్: ‘బతికేందుకు పొట్ట చేతపట్టుకుని వచ్చిన నన్ను అక్కున చేర్చుకుని, రాజకీయ భిక్ష పెట్టింది తిరుపతివాసులే, వారికి ఆజన్మాంతం రుణపడి ఉంటా’ అని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం రాత్రి తిరుపతి పద్మావతిపురంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలుకుతూ ఇంటి వరకు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఇంటికి చేరుకున్న కృష్ణమూర్తికి ఆయన భార్య, చదలవాడ విద్యాసంస్థల చైర్‌పర్సన్ చదలవాడ సుచరిత ఆత్మీయ స్వాగతం పలికారు. చదలవాడ నివాసం వద్ద రాత్రి వరకు కార్యకర్తలు, అభిమానులతో కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా చదలవాడ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ఈ స్థాయిలో అందరి ముందు నిలబడ్డానంటే అందుకు తిరుపతివాసులే కారణమన్నారు. అందుకే ఈపదవి తిరుపతి వాసులకే చెందాలి అని చెమ్మగిల్లిన కళ్లతో ఉద్విగ్నంగా మాట్లాడారు. ఏరోజూ మచ్చ తెచ్చుకునేలా వ్యవహరించలేదన్నారు. ఇకపై వ్యవహరించేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, వివాదాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. తిరుపతి అభివృద్ధే ధ్యేయంగా పనిచేశానని, ఇకపై మరింత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

తిరుపతిలో విద్యా, వైద్యం, సంక్షేమం ఈ మూడు అంశాలే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తనకు వారసులు అంటూ ఎవ్వరూ లేరని, ఈ పదవిని సొంతానికి వాడుకోనని అన్నారు. టీటీడీ వంటి ఆధ్యాత్మిక సంస్థను రాజకీయాలకు వాడుకుని చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించబోనని, తప్పు చేస్తే ఎవ్వరైనా సరే నిలదీయవచ్చన్నారు. ప్రస్తుతం తిరుమలలో కొత్త ఈవో చాలా చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. తిరుపతివాసులకు స్థానిక కోటాలో దర్శనం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. టీటీడీ ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. తిరుమల,తిరుపతిలో తాగునీటి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. దాతల సహకారంతో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్నారు.

అభినందనల వెల్లువ

చదలవాడ కృష్ణమూర్తికి ఆయన నివాసంలో టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్, బుల్లెట్ రమణ, నీలం బాలాజీ, గుణశేఖర్ నాయుడు, టీటీడీ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితరులు అభినందనలు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement