
సోంపేట: పాడైపోయిన కొబ్బరి కాయలను వైఎస్సార్ సీపీ నాయకులకు చూపుతున్న రైతులు
శ్రీకాకుళం, సోంపేట: కొడుకు పోయినా చెట్టు ఉందని ఆశగా బతికేవాళ్లమని, ఇప్పుడు తిత్లీ ధాటికి సర్వం కోల్పోయామని తుఫాన్ బాధితులు వైఎస్సార్‌సీపీ నాయకుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం సోంపేట మండలంలోని తాళభద్ర, సిరిమామిడి, మామిడిపల్లి, టి.శాసనాం, గొల్లవూరు, ఉప్పలాం, రుషికుడ్డ, ఇస్కలపాలేం, గొల్లగండి పంచాయతీల్లో తుఫాన్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా తాళభద్ర పంచాయతీలో పలువురు వృద్ధులు మాట్లాడుతూ.. తమ కుమారులు కిడ్నీ వ్యాధులతో మరణించినా చెట్లు ఉన్నాయనే ధైర్యంతో బతికామని, ఇప్పుడు ఆ ఆశలన్నీ చచ్చిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిమామిడి పంచాయతీలో పలువురు మహిళలు మాట్లాడుతూ ఇళ్లన్నీ పాడైపోయాయని, అంగన్‌వాడీల వద్ద భోజనం చేస్తూ, పక్కవారింటిలో తలదాచుకుంటున్నామని బోరుమన్నారు. గొల్లవూరు గ్రామంలో ఉద్దానం అభివృద్ధి వేదిక ప్రతినిధులు మోపిదేవితో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం సరిపోదని, పరిహారం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మత్స్యకారులకు కూడా నష్టపరిహారం సరిపోదని మత్స్యకార నాయకులు సూరాడ పాపారావు, బట్టి మాధవరావు తదితరులు తెలిపారు. ఉప్పలాం, ఇస్కలపాలేం, గొల్లగండి పంచాయతీల్లో పాడైన బోట్లు, వలలను చూపించి వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం
బాధితుల సమస్యలను సాంతం విన్న మోపిదేవి, దువ్వాడ శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం బాధితులకు అందిస్తున్న నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదని తెలిపారు. ఈ పరిహారాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇరవై ఏళ్ల వరకు ఇక్కడి రైతులకు ఆదాయం లభించదని తెలిపారు. ప్రభుత్వం వీరికి అంతర పంటలు వేసుకునే విధంగా ఆర్థిక సాయం చేయాలని సూచించారు. మరో పదిహేను రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర జిల్లాకు చేరుకుంటుందని, ఆయన తిత్లీ బాధితుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారని బాధితులకు ధైర్యం చెప్పారు. వారితో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్.దాసు, ఉద్దానం ఫౌండేషన్ కన్వీనర్ పిరియా విజయ, మండల కమిటీ అధ్యక్షుడు తడక జోగారావు, కడియాల ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డురాజారావు, మాజీ ఎంపీపీ పి.ఎం.తిలక్, పార్టీ నాయకులు ప్రధాన రాజేంద్ర, జుత్తు నీలకంఠం, ఉగ్రçపల్లితిరుపతిరావు, పాతిన రామమూర్తి,కర్రి కామేశ్వరరావు, గోకర్ల దర్మారావు, గూడ తాతారావు, దుర్యోధన తదితరులు పాల్గొన్నారు.
ప్రచార ఆర్భాటానికే బాబు ఆరాటం
అరసవల్లి: రాష్ట్రంలో ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ.. కేవలం ఆర్భాటాలు, ప్రచారాలకే ప్రాధాన్యమిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ముఖ్య నేత మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ఆదివారం అరసవల్లి ఆదిత్యున్ని దర్శించుకున్న అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో తిత్లీ తుఫాన్ బీభత్సంతో ప్రజలు అల్లాడుతుంటే.. ఆ పరిస్థితులను కూడా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రచారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకోవడం మానేసి, ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతూ ..ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూనే కాలం గడిపేస్తున్నారని మండిపడ్డారు. నష్ట పరిహారాల చెల్లింపులోనూ రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. అవసరానికి మించి నిధులను దుబారా చేయడంలో బాబు సిద్ధహస్తుడని విమర్శించారు. గతంలో సంభవించిన హుద్‌హుద్ తుఫాన్ సమయంలోనే ఇది రుజువైందని, మళ్లీ ఇప్పుడు తిత్లీలో కూడా కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment