
నేడు వైఎస్ జగన్ ప్రకాశం బ్యారేజీ సందర్శన
విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో అవినీతిని ఎండగడుతూ ప్రాజెక్టుల పరిశీలన యాత్రను చేపట్టిన శాసనసభ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రకాశం బ్యారేజీని సందర్శించనున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించిన ఆయన రాత్రికి విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారని తెలిపారు.
గురువారం ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటారని రఘురాం పేర్కొన్నారు. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారని తెలిపారు. అక్కడి నుంచి నేరుగా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు వద్దకు జగన్‌మోహన్‌రెడ్డి వెళతారని రఘురాం వివరించారు.