రెడీ.. నేవీ డే
నేటి సాయంత్రం బీచ్‌లో విన్యాసాలు
విశాఖపట్నం: నేవీడే వేడుకలకు సాగరతీరం ముస్తాబైంది. ఈ సందర్భంగా సాహస విన్యాసాలు ప్రదర్శనకు నావికాదళం సర్వసన్నద్ధమైంది. గురువారం సాయంత్రం జరిగే ఈ ఉత్సవంలో యుద్ధనౌకలు, విమానాలతో పాటు జలాంతర్గాములు సయితం పాల్గొంటున్నాయి. గగనతలంలో ఎగుర కమాండోలు భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ నేలకు దిగే సన్నివేశంతో ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఈ సారి సారంగ్ హెలికాఫ్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. లాండింగ్ డాక్ నౌకలు, క్షిఫణి శతఘు్నల ప్రయోగించే సామర్ధ్యమున్న డెస్ట్రాయర్స్ మార్చ్‌పాస్ట్ చేయనున్నాయి. హఠాత్తుగా సముద్రంలోంచి జెమినీ బోట్లలో నుంచి ప్రత్యర్ధి భూభాగాల్లోకి ప్రవేశించి బంకర్లను సయితం ధ్వంసం చేసి క్షణాల్లోనే తిరిగి భారత జలాల్లోకి ప్రవేశించే మెరీన్ కమాండోల విన్యాసాలు అబ్బుర పరచనున్నాయి. దూసుకువస్తున్న విమానాలను సముద్రం మీద నుంచే క్షిపణి ప్రయోగంతో పేల్చేసే విన్యాసాలు ఆసక్తి రేకిత్తించనున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా నేవీ సిబ్బంది వీటి నిర్వహణకు రిహార్సల్సు నిర్వహించారు.
హాజరు కానున్న ముఖ్యమంత్రి
సిరిపురం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 3-15గంటలకు ఆయనఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వఅతిధి గృహానికి వస్తారు. ప్రపంచబ్యాంకు అధికారులతో తుపాను నష్టతీవ్రతపై చర్చిస్తారని జేసీ తెలిపారు. సాయంత్రం 5-30కు ఆర్కే బీచ్‌లో జరిగే నేవీడే ఉత్సవాల్లో పాల్గొంటారు.
5-40 గంటలకు ప్రభుత్వ అతిధిగృహానికి చేరుకుంటారు. 6నుంచి 7గంటల వరకూ నేవీ గెస్ట్‌హౌస్‌లో నేవీ అధికారులు తేనీటి విందుకు హాజరవుతారు. 7-30గంటలకు విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్ పయనమవుతారు. సీఎం రాక సందర్బంగా జేసీ సమీక్ష నిర్వహించారు.