టమటాష్!
Published Sun, Jan 19 2014 3:02 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
కొత్తూరు, న్యూస్‌లైన్: చిల్లర కాసులకు ఎప్పుడో కాలం చెల్లింది. రూపాయి, 2 రూపాయల నాణా లు ఉన్నా.. వాటికి టీ నీళ్లు కూడా లభించని రోజులు దాపురించాయి. ఇక కూరగాయల పరిస్థితి చెప్పనక్కర్లేదు. మార్కెట్‌కు వెళితే పర్సు ఖాళీ కావడమే తప్ప.. బ్యాగు నిండని పరిస్థితి. రూ.5 ఇస్తే గానీ చివరికి కరివేపాకు, కొత్తమీర కట్ట కూడా లభించని పరిస్థితుల్లో ఏ కాయగూరైనా కిలో రూ.1.50కే లభిస్తుందంటే నమ్మగలమా!.. కానీ ఇది పచ్చి నిజం.. కొత్తూరు మార్కెట్‌లో టమాటా ధర అంతలా పడిపోయింది. నిల్వ ఉంచుదామంటే కుళ్లి పోతుంది. అం దుకే రైతులు వచ్చినకాడికి తెగనమ్ముకుంటున్నారు. ఇంకా మిగిలిన సరుకును రోడ్డు పక్కన పారబోస్తున్నారు. కొద్ది రోజు ల క్రితం వరకు రూ.20 నుంచి రూ.30 వరకు అమ్ముడుపోయిన టమాటా రెండు రోజు ల్లోనే అమాంతం పడిపోయి, రైతును బొక్కబోర్లాపడేసింది.
జిల్లాలోని శ్రీకాకుళం వంటి పట్టణ ప్రాంతాల్లో దీని రేటు రూ.10 వరకు ఉండగా.. ఇక్కడ మాత్రమే పడిపోవడానికి నిల్వ సౌకర్యం లేకపోవడమే కారణమని రైతులు చెబుతున్నారు. స్థానిక మార్కెట్‌కు కొత్తూరు, భామిని, సీతంపేట మండలాల నుంచి సీజనులో రోజుకు సుమారు పది టన్నుల టమాటాలను రైతులు విక్రయానికి తీసుకొస్తారు. ఇది కాకుండా పొలాల నుంచే నేరుగా మరో 5 టన్నుల సరుకు బరంపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. స్థానిక మార్కెట్‌కు రైతులు తెచ్చే సరుకును ఏరోజు కారోజు అమ్ముకోవలసిందే.
కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం వల్ల ఒక్క రోజు దాటితే చాలు టమాటాలు కుళ్లిపోతాయి. నిల్వ సౌకర్యం లేక.. చాలా సందర్భాల్లో తెచ్చిన సరుకును కొనేవారు లేక ఎంతో కొంత ధరకు అమ్ముకునేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. దళారులు దీన్ని అవకాశంగా తీసుకొని సరుకును అతి తక్కువ ధరకు గంపగుత్తగా కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏజెన్సీలో టమాటా మార్కెట్‌కు కేంద్రంగా ఉన్న కొత్తూరులో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి రైతులు కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో అప్పుల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు శనివారం మిగిలిన టమాటాలను పశువులకు, చెత్త బళ్లకు ధారాదత్తం చేశారు.
Advertisement