అడ్డగోలు జీవోలు రద్దు చేయండి
కొత్తపేట(గుంటూరు) : వ్యాపారుల నడ్డివిరిచేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడ్డగోలు జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన జిల్లా వ్యాప్త వ్యాపార సంస్థల బంద్ విజయవంతమైంది. నగరంలో ఉన్న అన్ని వ్యాపార సంస్ధలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. దీంతో క్లాత్, కిరాణా, ఫ్యాన్సీ, బంగారం తదితర సంస్ధలకు చెందిన దుకాణాలు బంద్ పాటించాయి. నిత్యం వ్యాపారాలతో కిటకిటలాడే నగర ప్రధాన వీధుల బోసిపోయాయి.
రేపు రాజమండ్రిలో మహాసభ
రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలను ఇరుకున పెట్టే ఇబ్బందికర జీవోలను వెంటనే రద్దు పరిచేలా తగు నిర్ణయం తీసుకోవాలని గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్టాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆంక్షలను సడలించి, పునఃపరిశీలించుకోవాలన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యాపార సంస్ధలకు సంబంధించిన ప్రతినిధులతో ఈ నెల 14 న రాజమండ్రిలో మహాసభను ఏర్పాటు చేస్తునున్నట్టు ఆయన వెల్లండించారు.ఈ మహాసభలో రాష్ట్ర వ్యాప్త బంద్ కు తేదీ ఖరారు, కార్యచరణ ప్రకటన వంటి వాటిపై సరైన నిర్ణయాలు తీసుకొని ప్రకటించనున్నట్టు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమలులో ఉన్న ఆ మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.