ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : పర్యాటకశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, రోజువారీ వేతన ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పర్యాటకాభివృద్ధికి కాంట్రాక్ట్ ఉద్యోగులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
గతంలో చేసుకున్న ఒప్పందాలు అమలుచేయకుండా వీరిని చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పందం మేరకు ఎరియర్స్, డీఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్యాటక శాఖ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి మాట్లాడుతూ లక్నవరంలో బోట్లు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరంగల్ కోటలో లైట్ షో ఏర్పాటు పనులు త్వరగా పూర్తిచేయాలని, వడ్డెపల్లి చెరువుకట్టను హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, కార్యదర్శివర్గ సభ్యుడు మోతె లింగారెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పాషా, మల్లేశ్, రాజ్‌కుమార్, కుమారస్వామి, తిరుపతి, రవి పాల్గొన్నారు.
విద్వేషాలు పెంచొద్దు
నయీంనగర్ :ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధానాలను కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. బాలసముద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాయంలో జిల్లా అధ్యక్షుడు రేగుల రాకేష్ అధ్యక్షతన ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యవర్గసమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జాప్యం కావడం వల్లే అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. సీమాంధ్రకు రాజధానిని, ప్యాకేజీని కేంద్రం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ, జిల్లా కార్యదర్శి హకీంనవీద్, నాయకులు అశోక్ స్టాలిన్, మహేందర్, హిమావంత్, రహ్మతుల్లా, ఖాదిర్‌అలీ, యాకాంబ్రం, శరత్, రోహిత్, జానీ, శ్రీకాంత్ పాల్గొన్నారు.