సప్తగిరి సర్కిల్‌లో పనిచేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్
అనంతపురం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆపడం.. ఎటువైపు పడితే అటువైపు రయ్‌మంటూ దూసుకెళ్లడం.. రోడ్ బ్లాక్ అయితే చాలాసేపు రాకపోకలు స్తంభించిపోవడం.. వెరసి వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఏర్పడేవి. సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం, తక్కువ సిబ్బందితో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం కష్టమయ్యేది. వీటన్నింటినీ పరిశీలించిన ఎస్పీ అశోక్‌కుమార్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.
అనంతపురం సెంట్రల్: నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోయే పరిస్థితి. పండుగ వేళల్లో పాతూరు రోడ్లలో ప్రయాణించారంటే ‘వద్దురా బాబోయ్’ అనాల్సిందే. దీనంతటికీ కారణం పెరుగుతున్న జనాభా, వాహనాలకు తగ్గట్టుగా రోడ్లు లేకపోవడమే. రోడ్లు ఆక్రమణలకు గురికావడం, ముఖ్యంగా ఎక్కడా పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లు ఇరుకుగా తయారయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం ముందుకుపోయే పరిస్థితి కనిపించడం లేదు.
ట్రాఫిక్ సిబ్బంది పెంపు
ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు వీలైనంత ఎక్కువ మంది సిబ్బందిని కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఒక డీఎస్పీ, 59 మంది సిబ్బంది, అప్పుడప్పుడు తాత్కాలిక విధులకు 30 మంది ఏఆర్ విభాగం నుంచి సిబ్బందిని కేటాయించారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు సిబ్బందిని కేటాయించిన దాఖలాలు లేవు.
వినియోగంలోకి సిగ్నలింగ్ వ్యవస్థ
కొన్నేళ్ల కిందట ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థ అధికారుల అలసత్వం కారణంగా మనుగడ కోల్పోయాయి. సిబ్బంది చెమటోడ్చి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేవారు. ఈ విషయం ఎస్పీ అశోక్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో సిగ్నలింగ్ వ్యవస్థను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. వారం రోజుల్లో నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ పనిచేస్తున్నాయి. దీని వలన ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టంగా అమలవుతున్నాయి. ప్రతి కూడలికి ఒక ఎస్‌ఐ స్థాయి అధికారితో పాటు ఏఎస్‌ఐ, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ ఉంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా పనిచేస్తుండటంతో ఎక్కడైనా సమస్య తలెత్తినపుడు వెంటనే పరిష్కరిస్తున్నారు.
ఫ్లై ఓవర్‌పై స్పీడ్ కంట్రోల్
నగరంలో ప్రధానంగా ప్రమాదాలు జరిగే పీటీసీ ఫ్‌లైఓవర్‌పై స్పీడ్ నియంత్రణ కోసం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వర కూ ఒక ఎస్‌ఐ, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌లతో విధులు నిర్వహిస్తున్నారు. హెచ్చరికలు చేస్తూ స్పీడ్ కంట్రోల్‌కు చర్యలు తీసుకున్నారు.
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తాం
నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించారు. దీంతో పాటు నగరంలో సిగ్నల్స్ మొత్తం పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. ముఖ్యమైన అపార్ట్స్‌మెంట్, వ్యాపార సముదాయాలు, హోటల్స్, లాడ్జీల వద్ద పార్కింగ్‌కు స్థలాలు చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని సర్కులర్ జారీ చేశాం. రాత్రి సమయాల్లో జరుగుతున్న ప్రమాదాలు నివారించేందుకు దృష్టి పెట్టాం. ముఖ్యంగా పీటీసీ ఫ్‌లైఓవర్‌పై ప్రమాదాలు నివారించేందుకు ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటాం.
– రామకృష్ణయ్య, ట్రాఫిక్ డీఎస్పీ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment