విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడి కుమార్తె మృతి
ఆ ఘటనను చూసి గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలిడిచిన తల్లి
గృహ ప్రవేశం జరగాల్సిన ఇంట్లో తల్లీకుమార్తె మృతదేహాలు
కొత్తపట్నం మండలం అల్లూరు ఎస్సీ కాలనీలో ఘటన..
అల్లూరు (కొత్తపట్నం) : విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడిన కుమార్తె చనిపోవడంతో ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన తల్లి తీవ్ర గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన అల్లూరు ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి జరగగా గురువారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన కుంచాల సరోజనమ్మ (65)కు కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె కంకణాల తిరుమల (36)తో పాటు మరో కుమార్తె ఉంది. శ్రీనివాసరావు ఒంగోలులో కానిస్టేబుల్. ఇటీవల స్వగ్రామంలో ఇల్లు కట్టించుకున్నాడు. ఆ ఇంట్లో శనివారం చేరాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో కొత్త ఇంట్లో సరోజనమ్మ, ఆమె కుమార్తె తిరుమల ఉన్నారు. నీటి కోసం తిరుమల మోటార్ వేయగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కొంచెం దూరంలో ఉండి గమనించిన తల్లి సరోజనమ్మ బిగ్గరగా కేకలేస్తూ కుమార్తె వద్దకు వస్తుండగా తీవ్ర గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికులను కలచి వేసింది. తిరుమల మృతదేహాన్ని ఆమె మెట్టినిల్లు పేర్నమిట్ట తరలించారు.
బంధువులను ఆహ్వానించేందుకు శ్రీనివాసరావు ఒంగోలు వెళ్లారు. రాత్రి 8.30 గంటల సమయంలో పంచాయతీ నీరు రావడం లేదని కుమారుడు శ్రీనివాసరావుకు తల్లి సరోజనమ్మ ఫోన్ చేసింది. మోటార్ బాగాలేదని, దాని జోలికి వెళ్లొద్దని తల్లితో శ్రీనివాసరావు ఫోన్‌లో చెప్పాడు. ఏదో ఒక రకంగా మోటార్‌తో ట్యాంకులో నీరు నింపుకోవాలన్న ఉద్దేశంతో తిరుమల వైరు తీసి ప్లగ్‌లో పెట్టి స్వీచ్ వేసింది. ఇంతలో విద్యుదాఘాతానికి గురై పెద్దగా కేకలేసి ప్రాణాలు కోల్పోయింది.
భర్త మృతితో పుట్టింటికి వచ్చి..
తిరుమలకు పేర్నమిట్ట గ్రామానికి చెందిన కంకణాల యల్లమందయ్యతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. అతను పెయింట్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వారికి శాంతి, సాయి అనే ఇద్దరు పిల్లలున్నారు. 5 ఏళ్ల క్రితం యల్లమందయ్య గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి సరోజనమ్మ వద్దకు వచ్చి పిల్లలతో కలిసి అక్కడే ఉంటోంది. కుమార్తె శాంతి ఇంటర్మీడియెట్ చదువుతోంది. కుమారుడు కరెంట్ పనికి వెళ్తూ ఉంటాడు.
అప్పుడు తండ్రి.. ఇప్పుడు తల్లి దూరం కావడంతో పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. అల్లూరులో ఒకే ఇంట్లో ఒకేసారి ఇద్దరు మృతి చెందటం ఇదే మొదటి సారి..అని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై బి.ఫణిభూషణ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామస్తులు, మృతుల బంధువులతో మాట్లాడారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
అల్లూరులో విషాదం
Published Fri, Jul 31 2015 1:39 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
Advertisement
Advertisement