బషీరాబాద్, న్యూస్‌లైన్: ఎదురెదురుగా రైళ్లు ప్రయాణించినా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చేపట్టిన టికాస్ (ట్రెయిన్ కొలిజన్ అవైండింగ్ సిస్టం) ప్రయోగం విజయవంతమైందని దక్షిణ మధ్య రైల్వే డివిజినల్ మేనేజర్ ఎస్‌కే. మిశ్రా తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలోని మంతట్టి- నవాంద్గి రైల్వే స్టేషన్‌లలో మేధా, కర్నెక్స్ కంపెనీలు నిర్వహిస్తున్న టికాస్ పయోగాన్ని ఆర్డీఎస్‌ఓ డైరక్టర్ జనరల్ రామచంద్రన్, సీనియర్ ఈడీ మహేష్ మంగల్, రైల్వే బోర్డు అడిషనల్ మెంబర్ (సిగ్నలింగ్) సురేష్ సక్సెనాలతోపాటు డీఆర్‌ఎం ఎస్‌కే మిశ్రాలు టికాస్ ప్రయోగాన్ని పరిశీలించారు.
అనంతరం తాండూరు, మంతట్టి, నవాంద్గి, కురుగుంట రైల్వే స్టేషన్‌ల మధ్య ఎలక్ట్రికల్ లోకో ఇంజిన్- డీజిల్ ఇంజిన్‌లతో రైళ్లను నడిపించి పరిశీలించారు. మేధా కంపెనీకి చెందిన టికాస్ సాంకేతిక పరికరాలను రైళ్లకు అమర్చి తాడూరు- నవాంద్గి స్టేషన్‌ల మధ్య జరిగిన ప్రయోగాన్ని అధికారులు వీక్షించారు. అక్కడి నుంచి కర్నెక్స్ కంపెనీకి చెందిన టికాస్ ప్రయోగాలను పరిశీలించారు. తర్వాత రెండు భిన్న కంపెనీలకు చెందిన సాంకేతిక పరికరాలతో ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. అనంతరం నవాం ద్గి, మంతట్టి రైల్వే స్టేషన్‌లలో టీకాస్‌కు సంభందించిన సాంకేతిక పరికరాలను పరిశీలించారు.
రైల్వే స్టేషన్‌లను పరిశీలించిన డీఆర్‌ఎం
మండల పరిధిలోని మంతట్టి, నవాంద్గి రైల్వే స్టేషన్‌లను డీఆర్‌ఎం ఎస్‌కే మిశ్రా పరిశీలించారు. మంతట్టి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంతో డీఆర్‌ఎం సిబ్బందిపై మండిపడ్డారు. రైళ్ల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన బోర్డు సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో ఎస్‌కే మిశ్రా మాట్లాడుతూ.. రైలు ప్రమాదాల నివారణ కోసం చేసిన టికాస్ ప్రయోగం విజయవంతమైందన్నారు.
సుమారు రూ. 35 కోట్లతో ఈ ప్రయోగానికి నిధులు మంజురయ్యాయన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు 3 భిన్న కంపెనీలతో ఈ ప్రయోగం 15 నెలలుగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రయోగం విజయవంతమైనప్పటికి పలుమార్లు క్షేత్ర స్థాయిలో పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు. రైలులో అగ్ని ప్రమాదాలు నివారణ కోసం ఆర్డీఎస్‌ఓ సంస్థకు అప్పగించామన్నారు.
‘టికాస్’ ప్రయోగం విజయవంతం
Published Sun, Jan 12 2014 1:06 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement