విజయనగరం కలెక్టర్ గిరీపై వుడా వీసీ ఆశలు
మొదట లూప్‌లైనులోకి.. అక్కడి నుంచి ఆ పోస్టుకు!
విశాఖపట్నం : ఎన్‌ఎండీసీ భూ వివాదం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం వుడా వైస్ చైర్మన్ టి.బాబూరావునాయుడుపై వ్యూహాత్మంగా వేటు వేస్తుందా?.. లేక చినబాబు ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేసినందుకు బహుమానంగా పదోన్నతి కల్పిస్తుందా??... వుడా, రెవెన్యూ అధికార వర్గాల్లో ఇప్పుడు ఇదే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. ఎన్‌ఎండీసీ భూమిని వెనక్కి తీసుకుంటూ అడ్డగోలుగా ఉత్తర్వులు జారీ చేసి.. ఖనిజాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారుల నుంచి అవమానాలను సైతం ఎదుర్కొన్నందుకు ప్రతిఫలంగా బాబూరావునాయుడు చిరకాల కోరికను ప్రభుత్వ పెద్దలు నెరవేరుస్తారన్న అభిప్రాయమే గట్టిగా వినిపిస్తోంది. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పని చేయాలన్నది ఆయన ఆశ అని.. ఇటీవల ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో ఆగిందని తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్‌గా నియమిస్తారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో మంచి పోస్టింగ్ ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని, అందువల్ల కొన్నాళ్లు లూప్‌లైన్‌లో పెట్టే యోచనలోనే సర్కారు ఉందన్న వాదనలూ ఉన్నాయి. మొత్తంగా బాబూరావునాయుడును వుడా వీసీ పోస్టు నుంచి తప్పిస్తారన్న ప్రచారం మాత్రం జోరందుకుంది.