గిరిజనులకు ప్రాణ సంకటం | Tribals Fear On Maoists Encounter in AOB | Sakshi
Sakshi News home page

గిరిజనులకు ప్రాణ సంకటం

Published Tue, Nov 6 2018 6:37 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

Tribals Fear On Maoists Encounter in AOB - Sakshi

మావోయిస్టుల మృతదేహాలు

విశాఖ సిటీ, సీలేరు: ఏవోబీలో యుద్ధ వాతావరణం నెలకొంది. తూటాల శబ్దాలతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఆధిపత్యం కోసం ఓవైపు మావోయిస్టులు చెలరేగుతుండగా.. మరోవైపు వరుస ఎన్‌కౌంటర్‌లతో పోలీసులు వేటాడుతున్నారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను లివిటిపుట్టులో మావోయిస్టులు మట్టుబెట్టినప్పటి నుంచి సరిహద్దు ప్రాంతం రావణ కాష్టంలా మారిపోయింది. ఖాకీల బూట్ల చప్పుళ్లతో, తుపాకీ మోతలతో ఏజెన్సీ ప్రాంతం రణరంగాన్ని తలపిస్తోంది. ఖాకీల నీడలోనే ఏవోబీ పరిధిలో ఉన్న గ్రామాలున్నాయి. లివిటిపుట్టు ఘటన తర్వాత.. దెబ్బకు దెబ్బ తీసేందుకు పోలీసులు సరిహద్దుల్లోనే మాటువేసి ఉన్నారు.

గత నెల 12వ తేదీన ఏవోబీ కటాఫ్‌ ఏరియాలోని ఆండ్రవల్లి పంచాయితీ కేంద్ర అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత ఉదయ్‌ భార్య నిడిగొండ ప్రమీల అలియాస్‌ మీనాను హతమార్చిన పోలీసులు.. మరో ముగ్గురు మహిళా దళసభ్యుల్ని, ఓ మిలీషియా సభ్యుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సోమవారం ఉదయం ఏడు గంటలకే తుపాకీ మోతలతో చెంద్రుపల్లి అటవీ ప్రాంతం దద్దరిల్లింది. చంద్రుపల్లిలో మావోయిస్టులున్నారన్న సమాచారం తెలుసుకున్న ఒడిశా రాష్ట్ర సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఓజీ బలగాలు సంయుక్తంగా చుట్టుముట్టి కాల్పులు జరపడంతో.. ముగ్గురు మావోయిస్టులతోపాటు ఇద్దరు గిరిజనులు మరణించారు. ప్రజాప్రతినిధుల్ని మావోయిస్టులు హతమార్చిన తర్వాత.. పోలీసు యంత్రాంగం ఏవోబీలో పట్టుకోల్పోయిందనే అంతా అనుకున్న నేపథ్యంలో.. తమ ఆధిపత్యం చాటుకునేందుకు బలగాలు కూంబింగ్‌ ముమ్మరం చేసి వరుస ఎన్‌కౌంటర్లతో చెలరేగుతోంది. తాజా ఎన్‌కౌంటర్‌తో సరిహద్దుల్లో తమ ఆధిపత్యం ఇంకా కొనసాగుతోందనే సంకేతాల్ని పోలీస్‌ బలగాలు మావోయిస్టులకు పంపించినట్లయింది. అయితే మావోయిస్టులు కూడా.. అదను చూసి ఎదురు దాడి చేసేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా సరిహద్దు వాతావరణం కనిపిస్తోంది.

నలిగిపోతున్న ఆదివాసీలు
లివిటిపుట్టు ఘటన జరిగినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందా అనే భయంతో.. ఆదివాసీలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. మావోయిస్టులు ఓవైపు.. పోలీసు బలగాలు మరోవైపు.. గిరిపుత్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎవరికి సహాయం చేసినా.. రెండో వర్గం విరుచుకుపడుతుండటంతో.. నోరు మెదపలేని పరిస్థితి, కాలు కదపని దుస్థితిలో భయం భయంగా గడుపుతున్నారు. ఎదురు కాల్పులు జరిగినప్పుడు పోలీసులు చనిపోయినా, మావోలు చనిపోయినా.. ఇరువర్గాలూ గిరిజనుల్నే టార్గెట్‌ చేస్తున్నారు. ఏజెన్సీలో ఏ చిన్న హడావిడి జరిగినా.. బలవుతున్నది గిరిజనులేనన్నది తాజా ఘటనతో మరోమారు స్పష్టమైంది. దీనికి చంద్రుపల్లి ఘటనే ఉదాహరణ. సోమవారం ఉదయం అటవీ ప్రాంతానికి వచ్చిన కలిమెల దళం సభ్యులు.. తమకు అల్పాహారం కోసం కావాల్సిన నీటిని, సామగ్రిని పంపించాలంటూ గ్రామస్థులకు కబురు పెట్టారు. ప్రతి ఇంటిలోని ఓ మగ మనిషి రావాలని మావోయిస్టులు ఆదేశించారు. దీంతో చేసేది లేక ఏడుగురు గిరిజనులు వారికి కావాల్సిన పదార్థాలు తీసుకొని వెళ్లగా.. ఇంతలో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు అమాయక గిరిజనులు బలయ్యారు.

ఉలిక్కిపడ్డ ఏవోబీ
సీలేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మల్కన్‌గిరి జిల్లా పప్పులూరు పంచాయతీ చంద్రుపల్లి గ్రామ సమీపంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొద్దికాలంగా ఆంధ్రా–ఒడిశా సరి హద్దులో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌తో రెండు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. చంద్రుపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను జిల్లా ఎస్పీ జగన్‌మోహన్‌ మీరా ఆధ్వర్యంలో సంఘటన స్థలం నుంచి 3 కిలోమీటర్ల వరకు కొండమార్గంలో మోసుకుని రోడ్డుమార్గానికి తీసుకువచ్చి అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ట్రాక్టర్‌లో తీసుకువచ్చారు. పప్పులూరు పంచాయ తీ వద్ద పోలీసు వాహనంలో భద్రతా బలగాలతో మల్కన్‌గిరి జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు గిరిజన యువకులు మృతి చెందడంతో వారిని గిరిజన గ్రామాల మధ్య తరలిస్తే ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో అడవిమార్గంలో తీసుకువచ్చారని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపించారు. మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ జగన్‌మోహన్‌ మీరా ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలాన్ని పరిశీలించారు. సోమవారం తెల్లవారుజాము 7 గంటలకు ఈ కాల్పులు జరగ్గా వైర్‌లెస్‌ సెట్‌ ద్వారా ఎస్పీకి తెలియజేశారు. దీంతో ఎస్పీ, ఇద్దరు ఎస్‌ఐలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని సాయంత్రం 4.30 గంటల వరకు ఎస్పీ నిఘా పెట్టి అనంతరం మృతదేహాలను తరలించారు.  

తప్పించుకున్న అగ్రనేత రణదేవ్‌
మల్కన్‌గిరి జిల్లా కలిమెల దళం గత కొంత కాలంగా మల్క న్‌గిరి ప్రాంతంలో సంచరిస్తుంది. అగ్రనేత రణదేవ్‌(డిసిఎం) అసిస్టెంట్‌ కమాండెంట్‌తోపాటు మరో ఆరుగురు దళంగా ఉన్నారు. చంద్రుపల్లి గ్రామంలో వచ్చిన ఏడుగురు గుంపుగా ఒకే దగ్గర ఉండి టిఫిన్‌ వండుతున్న సమయంలో కాల్పుల జరిపారు. ఈ సమయంలో అగ్రనేత రణదేవ్‌ త్రుటిలో తప్పించుకుని సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రణదేవ్‌ను పట్టుకునేందుకు అయిదేళ్లుగా మావోయిస్టు ప్రభా విత ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నారు. రణదేవ్‌ మీద లక్ష రివార్డు ఉంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పప్పులూరు పంచాయతీ మూడు కొండల మధ్య నివాసం ఉంటున్న చంద్రుపల్లి గ్రామస్తులు ఎన్‌కౌంటర్‌ జరగడంతో భయాందోళనలో పక్క గ్రామాలకు వెళ్లిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement