గజ్వేల్ కే ంద్రంగా ఏర్పాట్లు
4న విమలక్క ‘బహుజన బతుకమ్మ’
9న ఎంపీ విజయశాంతి సంబురాలు
11న జాగృతి ‘బంగారు బతుకమ్మ’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ ఉత్సవాలు గజ్వేల్ కేంద్రంగా బల ప్రదర్శనకు వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల నాలుగో తేదీ మొదలుకుని 11వ తేదీ వరకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎవరికి వారుగా బతుకమ్మ వేడుకలు జరిపేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ నెల 11న ‘బంగారు బతుకమ్మ’ ఉత్సవాలు నిర్విహ స్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. గతంలో సిద్దిపేట, సంగారెడ్డి, దుబ్బాకలో సంబురాలు నిర్వహించిన కవిత ఈ యేడాది గజ్వేల్‌ను వేదికగా ఎంచుకున్నారు.
తెలంగాణ జాగృతి ఏర్పాట్ల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కూడా గజ్వేల్‌లో ఈ నెల 9న బతుకమ్మ వేడుకలు భారీగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో గజ్వేల్ నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్న టీఆర్‌ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్టు తెలిసింది. తెలంగాణ జాగృతి బంగారు బతుకమ్మ ఏర్పాట్లతో తమ ప్రణాళిక ఎంతమాత్రం పోటీ కాదని పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గం పరిధిలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లిలో ‘గ్రాండ్ లెజెండ్ యూత్ అసోసియేషన్’ తొలిసారిగా ఈ నెల 4న బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తోంది. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ వేడుకలకు ‘బహుజన బతుకమ్మ’గా పేరు పెట్టారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఇదే గ్రామ పరిధిలో వుండటం బహుజన బతుకమ్మపై ఆసక్తి నెలకొంది.
అధికారిక ఏర్పాట్లు అంతేనా?
బతుకమ్మ పండుగ సందర్భంగా ‘సద్దుల బతుకమ్మ’ను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రెండేళ్లుగా లక్ష రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తోంది. బతుకమ్మ నిమజ్జన వేదికల వద్ద ఫ్లెక్సీల ఏర్పాటుకు మాత్రమే అధికారులు పరిమితమవుతున్నారు. ఈ యేడాది పండుగ నిర్వహణకు జిల్లాకు రూ.5 లక్షల చొప్పున కేటాయించాలంటూ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పండుగ ఘనంగా జరిగే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, జోగిపేట ప్రాంతాల్లో ఈ నిధులను ఖర్చు చేయాలనే డిమాండు వినిపిస్తోంది.
బతుకమ్మల సాక్షిగా బల ప్రదర్శన!
Published Thu, Oct 3 2013 12:08 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement
Advertisement