భార్గవ్‌ను బతికించే ప్రయత్నం చేస్తున్న రంగనాథ్
వేర్వేరు చోట్ల సముద్రంలో మునిగి ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. మూడు కుటుంబాల్లో విధి విషాదం చిమ్మింది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు కడలి కెరటాలకు బలయ్యారు. ఒకరు ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. ఆడుతూ పాడుతూ సరదాగా తీరంలో గడిపేందుకు వెళ్లిన బంధువులు కన్నీటిపర్యంతం కావాల్సి వచ్చింది. ఆదివారం ఒక్క రోజే చీరాల వాడరేవు, రామాపురం సముద్ర తీరంలో మూడు విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి.
ప్రకాశం, చీరాల: మండలంలోని ఈపూరుపాలెం సీతారాంపేటకు చెందిన చెందిన కొర్నిపాటి నరేష్ (34) కుటుంబ సభ్యులతో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రామాపురం సముద్ర తీరానికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గురై సముద్రంలోకి కొట్టుకుపోయి అరగంట తర్వాత విగత జీవై నరేష్ బయటకు కొట్టుకొచ్చాడు. ఈపూరుపాలెం పద్మనాభునిపేటకు చెందిన గోలి భార్గవ్ (17) పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. స్నేహితులతో సరదాగా వాడరేవులో స్నానం చేసేందుకు కొల్లా గణేష్‌తో పాటు మరో మిత్రుడితో కలిసి స్నానం చేసేందుకు వాడరేవుకు వచ్చాడు. అలల తాకిడికి గురై గణేష్, భార్గవ్‌లు కొట్టుకుపోయారు. కొద్ది సేపటికి తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్న భార్గవ్‌ను సముద్రంలో స్నానాలు చేస్తున్న కొందరు ఒడ్డుకు తీసుకొచ్చి ఆటోలో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే భార్గవ్ మృతి చెందాడు. సముద్రంలో గల్లంతైన గణేష్ ఆచూకీ మాత్రం లభించకపోవడంతో గజ ఈతగాళ్లు, మత్య్సకారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. చేతికి అందికి వచ్చిన కొడుకులను ఒక్కసారిగా కడలి కాటేయడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాలను చూసి బంధువులు నిర్ఘాంతపోయారు. తమ కుటుంబానికి అండగా నిలుస్తారని ఆశించిన కుటుంబ సభ్యులు.. కుమారుల విగజీవాలను చూసి గుండెలవిసేలా విలపించారు.
ఒక్కొక్కరిది ఒకో గాథ
ఈపూరుపాలెం సీతారంపేటకు చెందిన కొర్నిపాటి నరేష్ చేనేత కుటుంబానికి చెందిన యువకుడు. తల్లిదండ్రులు మాస్టర్ వీవర్లుగా పని చేస్తున్నారు. కుటుంబంలో తండ్రి తర్వాత కుటుంబ బాధ్యతలను నిర్వహించే నరేష్ వ్యాపార వ్యవహారాలూ చూసుకుంటున్నాడు. కార్తీక మాసం సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లిన నరేష్ కుటుంబంపై విధి చిన్న చూపు చూసింది. తండ్రి కృష్ణయ్య, ఇతర కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. పద్మనాభునిపేటకు చెందిన గోలి భార్గవ్ తల్లిదండ్రులు చేనేత కూలీలుగా పనిచేసుకుంటూ కుమారుడిని ఇంటర్ చదివించుకుంటున్నారు. కొడుకు ఉన్నత చదువులు చదివి తమకు అండగా నిలుస్తాడని ఆశించిన ఆ కుంటుంబంపై విధి విషం చిమ్మడంతో భోరున విలపిస్తున్నారు.
ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు
సముద్ర స్నానానికి వెళ్లి మృతి చెందిన నరేష్, భార్గవ్ మృతదేహాలను శవ పంచనామా కోసం చీరాల ఏరియా వైదశాలకు తీసుకొచ్చారు. మృతదేహాలను చూసేందుకు ఈపూరుపాలేనికి చెందిన మాస్టర్ వీవర్లు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో వచ్చారు. వైద్యశాల మార్చురీ వద్దకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. మృతుడి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
దొరకని గణేష్ ఆచూకీ
వాడరేవులో సముద్ర స్నానం చేస్తూ గల్లంతైన కొల్లా గణేష్ ఆచూకీ రాత్రి పొద్దుపోయే వరకూ లభించలేదు. మృతదేహం కోసం మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీరం ఒడ్డున ఉన్నారు.
అక్కరకు రాని 108 అంబులెన్స్
ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడాల్సిన 108 వాహనం సకాలంలో సంఘటన స్థలానికి రాకపోవడంతో క్షతగాత్రులు ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆదివారం తీవ్ర అపస్మారకంగా ఉన్న గోలి భార్గవ్‌ను సకాలంలో వైదశాలకు తీసుకెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. వాడరేవు, రామాపురం తీరంలో సముద్ర స్నానానికి వెళ్లి మృతి చెందిన ఘటనలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాలను ఎస్‌ఐలు అనూక్, వెంకటకృష్ణ పరిశీలించి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment