అక్షరాలా అరకోటి హాంఫట్
Published Tue, Jan 28 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
రౌతులపూడి, న్యూస్‌లైన్ : ‘కంచే చేను మేసిన’ రీతిలో మహిళా సంఘాల అభ్యున్నతికి పాటుపడాల్సిన కమ్యూనిటీ ఫెసిలిటేటర్లే (సీఎఫ్‌లు) వారిని దగా చేశారు. మహిళలు ఆర్థికం నిలదొక్కుకోవడానికి దోహదపడాల్సిన సొమ్మును దర్జాగా నొక్కేశారు. ‘కల్లు దొంగిలించి తాగేవాడి మోచేతి జాలును జుర్రుకున్నట్టు’ అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆ తప్పుడు సంపాదనలో వాటాలు తీసుకున్నారు. ఆ పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్సీ ఆ అవినీతిపరులకు అండగా నిలుస్తున్నారు. రౌతులపూడి మండలంలో చోటు చేసుకున్న ఈ అవినీతిపర్వం వివరాలిలా ఉన్నాయి. మహిళలకు వ్యక్తిగతంగా రుణాలివ్వడానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం ‘స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్’ పేరుతో మండలానికి కోటి రూపాయల చొప్పున మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇందిరా క్రాంతిపథం కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు మహిళా సంఘాల సభ్యులకు ఈ పథకంలో రుణాలిప్పిస్తామని రూ.660 చొప్పున షేర్ క్యాపిటల్‌గా వసూలు చేశారు. ఆ సొమ్ముకు ఎలాంటి రశీదూ ఇవ్వలేదు. మండలంలో ఇలా వసూలు చేసిన మొత్తం రూ.20 లక్షలకు పైగా ఉంటుంది.
రికార్డుల్లోనే రుణం..
ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా 2012-13 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని ఎ.మల్లవరం, బీబీ పట్నం, బలరామపురం, గంగవరం, గిడజాం, గుమ్మరేగుల, లచ్చిరెడ్డిపాలెం, మల్లంపేట, రాజవరం, రౌతులపూడి, ఎస్.పైడిపాల, ఉప్పంపాలెం గ్రామాల్లోని 158 మహిళా సంఘాలకు చెందిన 667మందికి రూ.93,82,300 రుణాలుగా మంజూరుచేసింది. అయితే ఈ సొమ్మంతటినీ మంజూరైన సభ్యులకు విడుదల చేయకుండా రూ.30 లక్షలకు పైగా పక్కదారి పట్టించినట్టు క్షేత్రస్థాయిలో ‘న్యూస్‌లైన్’ జరిపిన పరిశీలనలో తేలింది. బలరామపురంలో మణికంఠ మహిళా సంఘంలో 14 మంది సభ్యులుండగా రూ.660 చొప్పున అందరితో షేర్‌ధనం కట్టించుకొన్నారు. వీరిలో అయిదుగురిపేరు మీద రూ.70 వేలు స్త్రీ నిధి రుణం విడుదలైంది. అయితే ఆ సంఘం సభ్యులు తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మొత్తుకుంటున్నారు. అదే గ్రామంలో కరుణామయుడు గ్రూప్‌లో నలుగురు సభ్యుల పేరు మీద రూ.52 వేలు రుణం ఇచ్చినట్లు రికార్డులు చూపుతుండగా, ఇద్దరికి మాత్రమే అదీ రూ.10 వేల చొప్పున ఇచ్చినట్టు తేలింది.
రాజవరంలో గంగాభవాని గ్రూపునకు అయిదుగురి పేరుమీద రూ.80,000 రుణం ఇచ్చినట్టు రికార్డుల్లో ఉన్నా ఒక్కరికీ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. భవానీ గ్రూపునకు ముగ్గురి పేరు మీద రూ.50 వేలు ఇచ్చినట్టు రికార్డులు చెపుతుండగా వాస్తవానికి ఇద్దరికి రూ.20 వేలే ఇచ్చారు. లచ్చిరెడ్డిపాలెం దుర్గా గ్రూపులో ఆరుగురి పేరు మీద రూ.90 వేలు ఇచ్చినట్టుండగా ఆ సంఘానికి ఇచ్చింది రూ.60 వేలు మాత్రమే. సాయి గ్రూపులో ఆరుగురికి రూ. 90 వేలు రుణం ఇచినట్లు రికార్డుల్లో ఉండగా, వారికిచ్చింది రూ.60 వేలు మాత్రమే. గిడజాం గంగోత్రి గ్రూపులో నలుగురు సభ్యులకు రూ.40 వేలు రుణం ఇచ్చినట్టు రికార్డుల్లో ఉండగా, తమ పేరున రుణం విడుదలైనట్టే తెలియదని వారంటున్నారు. మొత్తం మీద అన్ని గ్రూపులకూ కలిపి రూ.30 లక్షలకు పైగా పక్కదారి పట్టినట్టు అంచనా.
అండగా నిలిచిన వారిపై తప్పుడు కేసులు
కొందరు సీఎఫ్‌లు కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ, పలువురు నాయకులు వారి నుంచి తామూ ముడుపులు పొంది అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా తమ పేరిట విడుదలైన రుణాలు తమకు దక్కకుండా కాజేసిన వ్యవహారంపై ఇటీవల గిడజాంలో మహిళలు ఆందోళన చేశారు. ఆ సందర్భంగా వారికి అండగా నిలిచిన వారిపై అధికార పార్టీ నేతల ప్రమేయంతో అన్నవరం పోలీసుస్టేషన్‌లో తప్పుడు కేసులు బనాయించారు. దీన్నిబట్టే సీఎఫ్‌ల అవినీతికి అధికార పార్టీ వారు కొమ్ము కాసిన నిజం తేటతెల్లమైందని మహిళలు అంటున్నారు. జిల్లాలో ఈ పథకం దివ్యంగా అమలు జరుగుతోందని పథకం ఎండీ విద్యాసాగర్‌రెడ్డి ఇటీవల కాకినాడలో కితాబునివ్వడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు..రౌతులపూడి మండలంలో జరిగిన అవినీతి బాగోతాన్ని గుర్తించి, లక్షలు స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, పథకం లక్ష్యం నెరవేరేలా చూడాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.
బహిరంగ విచారణ జరుపుతాం..
కాగా రౌతులపూడి మండలంలో స్త్రీ నిధి రుణాలపై అన్నిగ్రామాల్లో బహిరంగ విచారణ జరుపుతామని ఇందిరాక్రాంతిపథం తుని ఏరియా కో ఆర్డినేటర్ పద్మావతి చెప్పారు. నిధులు దుర్వినియోగం అయినట్లు రుజువైతే ఆ సొమ్ములను వెనక్కి కట్టిస్తామని, బాధ్యులపై డీఆర్‌డీఏ పీడీ ఆదేశాలమేరకు చర్యలు చేపడతామని తెలిపారు.
Advertisement