చిత్తుగా తాగి స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్
రౌతులపూడి : తప్పతాగిన ఓ స్కూలు బస్సు డ్రైవర్ ఆ మత్తులో బస్సు నడుపుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నాడు. ఆ తాకిడికి స్తంభం విరిగి పోయినా, బస్సులోని విద్యార్థులు ముప్పు నుం చి తప్పించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తునిలోని ఓ విద్యాసంస్థకు చెందిన బస్సు బల రామపురం నుంచి బుధవారం ఉదయం విద్యార్థులను తీసుకుని బయలుదేరింది. డ్రైవర్ నరసింహమూర్తి పూటుగా తాగిన మత్తులో బస్సు నడపడంతో, అదుపు తప్పి లచ్చిరెడ్డిపాలెం శివార్లలో 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. స్తంభం మధ్యకు విరిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముప్పు తప్పిం ది. బస్సును ఆపకుండా డ్రైవర్ అడ్డది డ్డంగా నడుపుకొంటూ పోవడంతో ఫణికుమార్ అనే డిగ్రీ విద్యార్థి చొరవ చేసి, నరసింహమూర్తితో బలవంతంగా బస్సు ను ఆపు చేయించాడు.
విద్యార్థులంతా దిగిపోయాక నరసింహమూర్తి బస్సుతో అక్కడి నుంచి ఉడాయించాడు. తర్వాత అతడిని వెంటబెట్టుకుని వచ్చిన విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులను స్థానికులు నిలదీశారు. గతంలోనూ మూడుసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, స్థానికులకు నచ్చజెప్పిన యాజమాన్య ప్రతినిధులు ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తామని హామీ ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఈపీడీసీఎల్ ఏఈ ప్రసాద్ మాట్లాడుతూ పరిహారం చెల్లించకపోతే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదూ అందలేదని కోటనందూరు ఎస్సై ఎం.అప్పలనాయుడు చెప్పారు.