బాబు పాలనలో అభివృద్ధి శూన్యం
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
కోటపాడు ( శిరివెళ్ల ) : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధి శూన్యంగా మారిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. బుధవారం మండలంలోని కోటపాడులో రూ. 12 లక్షల పంచాయతీ నిధులతో వేసిన సీసీ రోడ్లు, రూ. 9 లక్షలతో నిర్మించిన సబ్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాబు పాలనలో ఈ ఏడాది అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. ఎమ్మెల్యే నిధులు లేక నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. పంచాయతీ నిధులతో మాత్రమే పనులు జరుగుతున్నాయన్నారు. వర్షాలు లేక కరువుతో ప్రజలు అల్లాడుతుంటే .. మరో వైపు సీఎం విదేశీ పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేక యువత నిరాశ చెందుతున్నారని, ఇంటికొక ఉద్యోగం హామీ ఏమైంది బాబూ అంటూ ప్రశ్నించారు. అనంతరం ఎస్సీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఆలయాలను పరిశీలించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, గ్రామ నాయకులు జి. పరమేశ్వరరెడ్డి, తిరుపాలరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీరెడ్డి, సర్పంచులు శకుంతలమ్మ, రత్నమ్మ, రామభూపాల్‌రెడ్డి, రామనాగిరెడ్డి, ఉప సర్పంచులు లీలావతి, అజీజ్, వైఎస్సార్సిపీ మైనారిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీ. రఫీ పాల్గొన్నారు.