హైటెన్షన్
Published Fri, Dec 6 2013 4:33 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయటంతో జిల్లా వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం.. కీలక ప్రాంతాలు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాల వద్ద కేంద్ర బలగాలతోపాటు స్థానిక పోలీసులను మోహరించింది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం గురించి గురువారం రాత్రి టీవీ చానెళ్లలో వార్తలు ప్రసారమవగానే జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు మళ్లీ పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించాలని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక, జిల్లాలోని విద్యా సంస్థలను శుక్రవారం మూసివేయాలని విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, ఉద్యోగుల జేఏసీ నాయకులు, వివిధ వర్గాల ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్ :రాష్ర్ట విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉప్పెనలా వెల్లువెత్తే పరిస్థితులు నెలకొనటంతో కేంద్ర బలగాలు భారీగా జిల్లాకు తరలివచ్చాయి. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని కీలక ప్రాంతాలు.. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు, క్యాంపు కార్యాలయాల వద్ద మోహరించాయి. బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పోలీసు విభాగాలకు చెందిన సుమారు వెయ్యి మంది సిబ్బంది జిల్లాకు వచ్చినట్టు సమాచారం. పోలీసు ఉన్నాతాధికారులు మాత్రం ఎంతమంది వచ్చారనేది వెల్లడించటం లేదు. సుమారు 600 మంది వచ్చారని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. కేంద్ర బలగాలతోపాటు జిల్లా పోలీసులు కూడా బందోబస్తులో ఉన్నారు. వీరు స్థానిక పరిస్థితులపై కేంద్ర బలగాలకు సమాచారమిస్తున్నారు.
శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయం వద్ద సుమారు 10 మంది, టెక్కలిలోని ఆమె నివాసం వద్ద సుమారు 15 మంది గస్తీ కాస్తున్నారు. పాతపట్నంలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు క్యాంపు కార్యాలయం వద్ద ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లు ఆరుగురు, ఒక ఎసై్స, ఒక ఏఎసై్స, ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు బందోబస్తు కాస్తున్నారు. రాజాంలో మంత్రి కోండ్రు మురళి క్యాంపు కార్యాలయం, శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు సమీపంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను నియమించారు. కాశీబుగ్గలో టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి నివాసం వద్ద 10 మంది సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు, మందస మండలం హరిపురంలో పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు నివాసం వద్ద 10 మంది బందోబస్తులో ఉన్నారు. అమదాలవలసలో ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి నివాసం వద్ద కూడా భారీగా పోలీసులను నియోగించారు. ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీ వద్ద కూడా కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి.
విగ్రహాల వద్ద భారీ బందోబస్తు
శ్రీకాకుళం రిమ్స్ ఆవరణలోని రాజీవ్‌గాంధీ విగ్రహం, డీసీసీ కార్యాలయం ఇందిరా విజ్ఞాన భవన్‌లోని ఇందిరా గాంధీ విగ్రహంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజీవ్, ఇందిరాగాంధీ విగ్రహాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉద్యమకారులపై పోలీసుల డేగకన్ను
పది జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినేట్ గురువారం రాత్రి అమోదం తెలపటంతో జిల్లాలోని సమైక్యాంధ్ర ఉద్యమకారులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రధానంగా సమైక్యాంధ్ర జేఏసీ నాయకుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. గురువారం ఉదయం శ్రీకాకుళం వైఎస్‌ఆర్ కూడలి వద్ద సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు చేపట్టిన రిలే దీక్షా శిబిరం వద్ద కేంద్ర బలగాలు గస్తీ కాశాయి. శుక్రవారం నుంచి ఉద్యమం తీవ్రతరమయ్యే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో పరిణామాలను ఎస్పీ నవీన్ గులాఠీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సిబ్బందికి సూచనలిస్తున్నారు.
Advertisement