ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిపై ఇప్పుడు కొత్తగా ఎలాంటి అధ్యయనం చేపట్టటంలేదని కేంద్ర హోంశాఖ వర్గాలు స్పష్టంచేశాయి.
* విభజనపై కేంద్ర హోంశాఖ వర్గాల స్పష్టీకరణ
* శ్రీకృష్ణ కమిటీ నివేదికనే సమర్పిస్తామని వెల్లడి
* విభజన అనివార్యమైతే నీటి పంపిణీ వంటి అంశాలపై నిపుణుల కమిటీలు వేయాలన్న శ్రీకృష్ణ కమిటీ
* ఎలాంటి నిపుణుల కమిటీలూ ఏర్పాటు చేయని సర్కారు
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిపై ఇప్పుడు కొత్తగా ఎలాంటి అధ్యయనం చేపట్టటంలేదని కేంద్ర హోంశాఖ వర్గాలు స్పష్టంచేశాయి. ఈ అంశంపై అధ్యయనం మొత్తం పూర్తయిందని.. ఆర్థికమంత్రి చిదంబరం సోమవారం రాజ్యసభలో వివరించినట్లు తమ నివేదిక సిద్ధంగా ఉందని పేర్కొన్నాయి. అదే శ్రీకృష్ణ కమిటీ నివేదిక అని.. ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు దానిని సమర్పిస్తామని చెప్పాయి. అలాగే.. చిదంబరం రాజ్యసభలో ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలచుకున్నట్లు ప్రకటించినందున.. దీనిపై ప్రభుత్వ ప్రకటనకు సంబంధించిన ఊహాగానాలకు తెరపడినట్లేనని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి.
నిపుణుల కమిటీలకు శ్రీకృష్ణ సూచన...
మొత్తం 460 పేజీలకు పైగా ఉన్న శ్రీకృష్ణ కమిటీ అనేక కోణాల నుంచి ఈ అంశాన్ని అధ్యయనం చేసింది. విభిన్న ప్రామాణిక కోణాల నుంచి విశ్లేషించింది. విభజన జరిగితే ఎవరికి ఏం చెందాలి అనే దానిని అంచనా వేసేందుకు వివిధ సాంకేతిక కమిటీలను నియమించాలని సూచించింది. హైదరాబాద్ అంశంతో సహా పలు అంశాలను అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించటమే ఉత్తమ మార్గమని అభిప్రాయపడింది. విభజన అనివార్యమైన పక్షంలో.. నదీ జలాల నిర్వహణ, సాగునీటి వనరులను సమానంగా పంపిణీ చేసే అంశంపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించాలని సూచించింది.
అయితే.. విభజన అంశంపై తమ అధ్యయనం పూర్తయిందని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇంతవరకూ అలాంటి కమిటీని కానీ, మరే ఇతర జల నిర్వహణ బోర్డు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ వంటి వ్యవస్థను కానీ ఏర్పాటు చేయలేదు. ఈ అంశంపై హోంశాఖ వర్గాలు స్పందిస్తూ.. ‘విభజన, ఆస్తులు, అప్పులు, వనరుల పంపిణీపై రోడ్‌మ్యాప్‌ను రూపొందించటానికి నిపుణుల వ్యవస్థలను ఏర్పాటు చేస్తే.. అవి తన పని పూర్తి చేయటానికి కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది’ అని పేర్కొన్నాయి. రోడ్‌మ్యాప్ లేనిదే విభజన లక్ష్యం చేరుకోవటం చాలా కష్టతరమవుతుందని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి.
ఇప్పటికే పరిష్కరించి ఉండాల్సింది...
‘‘విభజనకు సంబంధించిన దాదాపు అన్ని అంశాలపైనా మేం విస్తృతంగా అధ్యయనం చేసి.. మా సూత్రీకరణలు తెలియజేశాం. అభివృద్ధి సూచీలపై ఏం చేయాలో కూడా చెప్పాం. విభజన నిర్ణయంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సహజంగానే పెల్లుబుకుతాయని హెచ్చరించాం. అక్కడి ప్రజలకు తమ పెట్టుబడులు, ఆస్తులు, ఉపాధి, ఉద్యోగాలపై సందేహాలు ఉంటాయి. ఈ అంశాలన్నిటినీ పరిష్కరించి.. భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ వారిలో విశ్వాసం నింపాలి. అనివార్యమైన పరిస్థితుల్లో మాత్రమే.. అదికూడా మూడు ప్రాంతాల మధ్యా సామరస్యపూర్వకంగా ఆమోదం లభించేట్లయితేనే విభజనకు వెళ్లాలని సిఫారసు చేశాం’’ అని శ్రీకృష్ణ కమిటీ మాజీ సభ్యుడొకరు స్పష్టంచేశారు.
‘‘ఫ్రభుత్వం విభజన విషయంలో సీరియస్‌గా ఉన్నట్లయితే.. అది ఇప్పటికే అన్ని ఆందోళనలనూ పరిష్కరించి ఉండాల్సింది. లేదంటే.. సుదీర్ఘ కాలం అశాంతి, అలజడి నెలకొంటాయి. అది మూడు ప్రాంతాల మీదే కాదు, దేశంపైనా ప్రభావం చూపుతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.


