సాక్షి, కడప: రాష్ట్రవిభజనను నిరసిస్తూ జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమం మంగళవారంతో 70రోజులు పూర్తి చేసుకుంది. తెలంగాణబిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించడంతో ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి దిగడంతో జిల్లాలో ప్రజాజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, టెలికాం కార్యాలయాలు మూసేశారు. చివరకు ఏటీఎంలు కూడా ఎక్కడా తెరుచుకోలేదు.
ఎస్వీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వద్ద శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు రిలేదీక్షలకు కూర్చున్నారు. రాయచోటిలో జీతాలు పణంగా పెట్టి ఉద్యమం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సర్పంచ్ నాగేశ్వరరావు, ఫార్మాసిస్టు సిద్ధయ్యనాయుడు అండగా నిలిచారు. 80మందికి 25 కిలోల బియ్యం పాకెట్లను పంపిణీ చేశారు.
వీటిని టీడీపీ నేత రెడ్డి నారాయణ అందించారు. అలాగే ప్రొద్దుటూరులో నీటి ట్యాంకుపై నుంచి దూకి మృతిచెందిన ఆర్టీసీ కార్మికుడు మునెయ్య కుటుంబానికి రాయచోటి ఆర్టీసీ కార్మికులు 13,500 రూపాయలు అందజేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అర్చనపాఠశాల విద్యార్థులు దీక్షలు చేపట్టారు. ఆర్టీపీపీలో ఉద్యోగులు నాలుగురోజులుగా విధులు బహిష్కరించారు. దీంతో అక్కడ 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. బద్వేలులో ఆరు మండలాలకు చెందిన వ్యవసాయశాఖ ఉద్యోగులు రిలేదీక్షలో కూర్చున్నారు. తెలంగాణనోట్ ఆమోదాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జేఏసీ నేతలు పట్టణంలో వెనక్కు నడుస్తూ నిరసన తెలిపారు.
పొద్దుటూరులో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతబడ్డాయి. సమైక్యాంధ్ర కోసం 21మంది మునిసిపల్ ఉద్యోగులు చేపట్టిన ఆమరణదీక్షలు మంగళవారం రెండోరోజుకు చేరాయి. సోమవారం రాత్రి భారీ వర్షానికి దీక్షాశిబిరం కారింది. దీంతో మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పక్కాగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. మైదుకూరులో ఇంజనీరింగ్‌కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసేశారు. నాలుగురోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు.
రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసేశారు. ఏఐటీఎస్ అధ్యాపకులు, విద్యార్థులు రిలేదీక్షలకు కూర్చున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ యల్లారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత ఆకేపాటి అనిల్‌రెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. జమ్మలమడుగులో జేఏసీ మహిళా నేతలు వెటర్నరీ ఏడీ విజయమ్మ, ఐసీడీఎస్ పీఓ ముంతాజ్‌బేగం, లాయర్ లక్ష్మిదేవి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూయించారు. పులివెందులలో ఉపాధ్యాయులు, ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించారు.
విద్యుత్ ఉద్యోగులు సబ్‌స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టుకు విద్యుత్ నిలిపేశారు. రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వీరికి సంఘీభావంగా హెచ్‌ఎంఎం హైస్కూలు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ‘రాష్ట్రవిభజన-నష్టాలు’ అనే అంశంపై విద్యార్థులకు రోడ్డుపైనే పరీక్ష నిర్వహించారు. సబ్‌స్టేషన్ల వద్దకు వెళ్లి విద్యుత్ కార్మికులకు మద్దతు ప్రకటించారు.
పోరు @ 70
Published Wed, Oct 9 2013 1:34 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement