సాక్షి, కాకినాడ :
బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు- తెలంగాణ ఇచ్చేయండంటూ ఎడాపెడా లేఖలిచ్చిన తెలుగుదేశం పార్టీ మహోధృతంగా ఎగసిన సమైక్య ఉద్యమంతో చతికిలపడింది. అధినేత చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం కారణంగా అడుగడుగునా సమైక్యసెగలు తగులుతుండడంతో పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అగ్రనేతలు సైతం ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం లేదు. నాలుగు డబ్బులు ఖర్చుపెట్టి ఏదైనా ఆందోళనా కార్యక్రమం చేద్దామన్నా దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఒనగూరే పరిస్థితి లేదనే ఆవేదనతో సమైక్య ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకొని మోసేందుకు సాహసించలేకపోతున్నారు. దీంతో నాయకులంతా దాదాపుగా ఉద్యమకారులకు సంఘీభావం తెలిపేందుకే పరిమితమవుతున్నారు. జిల్లాలో పార్టీపరంగా అడపాదడపా కార్యక్రమాలు చేస్తున్నా అవి కూడా మొక్కుబడిగానే సాగుతున్నాయి. బాబు ఇచ్చిన లేఖల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందన్న అభిప్రాయం ఉద్యమకారుల్లోనే కాక సామాన్యుల్లో సైతం బలంగా నాటుకు పోవడంతో ఎక్కడకెళ్లినాటీడీపీ నేతలకు సమైక్యసెగలు తప్పడంలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప ఇటీవల ముమ్మిడివరంలో సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కాగా పోలీసుల సహాయంతో బయట పడాల్సి వచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలకూ తరచూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో కొద్దిమంది నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకు సెగ తగలని జేఏసీ శిబిరాలకు వెళ్లి మొక్కుబడిగా సంఘీభావం తెలుపుతుంటే మరికొంతమంది ఉద్యమ ఛాయలకే రావడం లేదు. ఈ పరిస్థితి పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోను చేస్తోంది.
పత్తా లేని యనమల
ఉద్యమం మొదలైన నెల రోజుల వరకు జిల్లా ముఖం చూడని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు చివరకు ఉత్తుత్తి రాజీనామాతో జిల్లాలో అడుగు పెట్టినా ఒకటి రెండు కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇక పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్‌మీట్‌లకు పరిమితమవడం తప్ప పార్టీ పరంగా ఇప్పటి వరకు ఒక్క ఆందోళనా కార్యక్రమం చేపట్టిన దాఖలా లేదు. గత పది రోజులుగా జేఏసీ శిబిరాల వైపు కూడా కన్నెత్తి చూడలేదు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ కూడా ఉద్యమంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. గత పది రోజులుగా ఆయన కూడా ఉద్యమ ఛాయలకు రాలేదు. పార్టీ ఎమ్మెల్యేలు చందన రమేష్, పెందుర్తి వెంకటేష్, పర్వత చిట్టిబాబు ఎవరైనా పిలిస్తే వెళ్లి ఫొటోలకు ఫోజులివ్వడమే తప్ప పార్టీపరంగా చెప్పుకోతగ్గ ఆందోళన కార్యక్రమాలు చేపట్టలేదనే చెప్పాలి.
మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు స్థానికంగా పొలిటికల్ జేఏసీలో క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నా ఆ ఘనత అంతా జేఏసీ ఖాతాలోకి వెళ్లిపోతుందనే భావన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పాటు ఇతర ముఖ్యనేతలంతా ఈ ఉద్యమం వల్ల తమ పార్టీకి అనుకున్నంత కలిసి రావడం లేదనే సాకుతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆవేదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఒకపక్క ప్రారంభం నుంచీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌పై బయటకు రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాన్ని పూర్తిగా తమ భుజస్కంధాలపై వేసుకొని ముందుకెళ్లేందుకు సిద్ధమవుతుండడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఏదేమైనా ఈ ఉద్యమం జిల్లాలో టీడీపీ ఉనికినే ప్రశ్నార్థకం చే స్తుందనే దిగులు ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది
టీడీపీకి సమైక్య సెగ
Published Fri, Sep 27 2013 11:59 PM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement