అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని జిల్లా వాసులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కుగ్రామం మొదలు నగరం వరకూ ఆందోళనలు మిన్నంటాయి. 13వ రోజైన సోమవారం కూడా జిల్లాలో ఉద్యమం జోరుగా కొనసాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ రెండో రోజూ విజయవంతమైంది. అనంతపురం నగరంతో పాటు పట్టణాలు, పల్లెల్లో సైతం పార్టీ శ్రేణులు బంద్ చేపట్టాయి. వివిధ పార్టీలు, ప్రజా, కుల సంఘాలు, నాన్‌పొలిటికల్ జేఏసీ, జాక్టో, విద్యార్థి, యువజన, ఉద్యోగ, కార్మిక, కర్షక, కళాకారుల సంఘాల నాయకులతో పాటు దాదాపు అన్ని వర్గాల ప్రజలు అనంత కుతకుత
సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, అర్ధనగ్న ప్రదర్శనలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. విభజనకు కారకులంటూ సోనియాగాంధీ, కేసీఆర్, దిగ్విజయ్ తదితర నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. విభజనను జీర్ణించుకోలేక సోమందేపల్లికి చెందిన బాదయ్యపల్లి వెంకటేశ్వర్లు (58) గుండెపోటుతో మృతి చెందారు. ఎస్కేయూ విద్యార్థులు వర్సిటీ ముఖద్వారం ఎదుట రోడ్డుపైనే కుర్చీలు వేసుకుని చదువుకుంటూ దాదాపు రెండు గంటల పాటు నిరసన తెలిపారు. ఇక్కడే విద్యార్థి జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. అనంతపురం నగరంలో వైఎస్సార్‌సీపీ నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి నేతృత్వంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు.
స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాక్టో, టవర్‌క్లాక్ సర్కిల్‌లో నాన్‌పొలిటికల్ జేఏసీ నేతల దీక్షలకు వైఎస్సార్‌సీపీతో పాటు వివిధ సంఘాల నాయకులు, సమైక్యవాదులు సంఘీభావం ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులు నోటికి నల్లగుడ్డ కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు. ఎంఐఎం, ఏపీ ఎన్జీఓ, దంత వైద్యులు, వివిధ విద్యాసంస్థలు, కుల, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమైక్యవాదులు నగరంలో ర్యాలీలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా స్థానిక సప్తగిరి సర్కిల్‌లో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ధర్మవరంలో సమైక్యవాదులు, జేఏసీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. బత్తలపల్లి మండలం పోట్లమర్రిలో గ్రామస్తులు రోడ్డుపై వంటా వార్పు చేపట్టారు. ముదిగుబ్బలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేశారు. గుంతకల్లు పట్టణం నిరసన ర్యాలీలతో హోరెత్తింది. నక్కనదొడ్డి దగ్గర జాతీయ రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. పామిడిలో సమైక్యవాదులు గాడిదలను ఊరేగించారు. హిందూపురం పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతలు బంద్ నిర్వహించారు.
పార్టీకి చెందిన 28 మంది నాయకులు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. జేఏసీ నేతలు రోడ్డుపైనే స్నానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు, విద్యాసంస్థల నిర్వాహకులు, కూరగాయల వ్యాపారులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీలు చేపట్టారు. చిలమత్తూరు, లేపాక్షిలో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. కదిరి అంబేద్కర్ సర్కిల్‌లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతలు వేర్వేరుగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. గాండ్లపెంట, నల్లచెరువు, తలుపుల, తనకల్లు మండలాల్లో ర్యాలీలు కొనసాగాయి. కళ్యాణదుర్గంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించారు. జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మడకశిరలో బంద్ విజయవంతమైంది. ఎంఆర్‌పీఎస్ నేతలు ర్యాలీ చేశారు. అమరాపురం మండలం మద్దనకుంటలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ్మేడుకుంటలో ముగ్గురు యువకులు రిలే దీక్షలకు దిగారు. రొళ్లలో సమైక్యవాదులు భారీ మానవహారం నిర్మించారు. రొళ్ల మండలం అగ్రహారంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. గుడిబండ మండలం మోదుగులకుంట గ్రామస్తులు రాస్తారోకో చేశారు. పుట్టపర్తిలో మహిళలు భారీ ర్యాలీ చేశారు. చిన్నారులు రోడ్డుపైనే చదువుకొని నిరసన తెలిపారు.
ఓడీసీలో రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. నల్లమాడలో ముగ్గుల పోటీ నిర్వహించారు. అమడగూరు, గోరంట్ల, బుక్కపట్నం, కొత్తచెరువు, రొద్దం మండలాల్లో సమైక్య నినాదాలు మార్మోగాయి. రాయదుర్గంలో జేఏసీ నేతల దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు మౌనప్రదర్శన నిర్వహించారు. జ్యువెలరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. గుమ్మఘట్టలో కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. కణేకల్లులో ర్యాలీలు జోరుగా సాగాయి. కనగానపల్లిలో కురుబ సంఘం, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. చెన్నేకొత్తపల్లిలో 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రామగిరి మండలం చెర్లోపల్లి, శ్రీహరిపురంలో నిరసనలు చేపట్టారు. శింగనమలలో ఆర్యవైశ్యులు, ఉద్యోగులు ర్యాలీలు చేశారు. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో సమైక్య నినాదాలు హోరెత్తాయి. తాడిపత్రిలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. పట్టణంలోని శ్రీనివాసపురం, సీబీరోడ్డులో వంటా వార్పు చేపట్టారు. తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని చీమలవాగుపల్లి, పెరన్నపల్లి, సజ్జలదిన్నె, ఎర్రగుంట, కిష్టిపాడు తదితర గ్రామాల్లో సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు తదితర మండలాల్లో నిరసనలు హోరెత్తాయి.
జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతున్న ఉద్యమం
Published Tue, Aug 13 2013 3:49 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement