సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర కోసం ఎన్‌జీఓల పిలుపు మేరకు మంగళవారం జిల్లాలో బంద్ విజయవంతమైంది. రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. విద్యా సంస్థలు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. జేఏసీ నేతలు ఉదయం నుంచే రోడ్లమీదకు వచ్చి బంద్‌ను పర్యవేక్షించారు. జాతీయ రహదారిపై రాస్తారోకోలు నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. నగరంలో బైక్ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. సాధారణ జన జీవనం స్తంభించింది. సమైక్యాంధ్ర జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో 56వ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగింది. బంద్‌కు రెవెన్యూ అసోసియేషన్ నాయకులు సంఘీభావం తెలుపుతూ కలెక్టరేట్ నుంచి బైపాస్ రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
నూర్‌బాషా దూదేకుల సంఘం వారు గాంధీబొమ్మ సెంటర్లో దూది ఏకుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కొండాయపాళెం గేటు నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర నిర్వహించనున్నట్టు ఏజేసీ పెంచలరెడ్డి తెలిపారు. నగరంలో ఎన్‌జీఓల ఆధ్వర్యంలో అయ్యప్పగుడి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. వెంకటగిరి నియోజక వర్గంలోని డక్కిలి, సైదాపురం మండలాల్లో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సైదాపురంలో మంగళవాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు.
ఆత్మకూరులో జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎన్‌జీఓ, ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఎన్‌జీఓ ఆధ్వర్యంలో పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి నెల్లూరుపాళెం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
కలిగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దుత్తలూరులో బంద్ నిర్వహించి ప్రైవేటు వాహనాలను నిలిపివేసి రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. సీతారామపురంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలో చిన్నారులు పాల్గొన్నారు. గూడూరులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దుకాణదారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. జేఏసీ నాయకులు బ్యాం కులను మూయించారు. మోటారు సైకిళ్లపై తిరుగుతూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అర్ధనగ్నం గా మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కోటలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. వంటావార్పు నిర్వహించి సామూహిక భోజనాలు చేశారు.
పొదలకూరులో సమైక్యవాదులు తలపెట్టిన బంద్ విజయవంతం అయ్యింది. నాయీబ్రాహ్మణులు ప్రదర్శన నిర్వహించారు. తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓలు సంఘీభావం తెలి పారు. మనుబోలులో బంద్ పాటిం చారు. సమైక్య విద్యార్థి జేఏసీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు.
సూళ్లూరుపేటలో 46వ రోజు రిలే నిరాహాదీక్షలు కొనసాగాయి. శ్రీహరికోటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధాయులు దీక్షలో పాల్గొన్నారు. పట్టణంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూళ్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పట్టణంలోని మోటార్ మెకానిక్‌లు మోటార్‌సైకిళ్లతో, డ్రైవర్ సంఘం ఆధ్యర్యంలో కార్లతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తడ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణతో పాటు బంద్ పాటించి జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. అన్ని వ్యాపార సంఘాలు సంఘీభావంగా ప్రదర్శన నిర్వహించాయి. బుచ్చిరెడ్డిపాళెంలో వైఎస్సార్ విగ్రహ కూడలి వద్ద జేఏసీ నాయకులు వంటావార్పు నిర్వహించారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోవూరు ఎన్‌జీఓ హోంలో ఎమ్మార్పీఎస్ నాయకుల దీక్షలు సాగుతున్నాయి. లేగుంటపాడులో యువకుల నిరాహార దీక్ష చేపట్టారు. కావలిలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీల ఆధ్వర్యంలో బంద్‌ను పర్యవేక్షించారు. నియోజకవర్గంలోని బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో కూడా బంద్ ప్రభావం కనిపించింది.
సకలం బంద్
Published Wed, Sep 25 2013 4:42 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement