ఉద్యమంలో కొత్త మలుపు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జిల్లాలోని సర్పంచులు, వార్డుమెంబర్లతో పాటు వేలాదిమంది ఉద్యోగులు నిరాహారదీక్ష చేపట్టారు...రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అన్ని పంచాయతీలు తీర్మానం చేశాయి. తీర్మాన ప్రతులను రాష్ట్రపతికి, గవర్నర్‌కు పంపారు. ఉద్యమాన్ని ఉద్యోగులే చేస్తున్నారని ప్రజలకు పట్టడంలేదని మాట్లాడుతున్న కొందరు ప్రజాప్రతినిధులు, తెలంగాణ నేతలకు కనువిప్పు కలిగేలా గ్రామస్థాయి నేతలు తరలివచ్చారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే లక్ష్యం కోసం...జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు నిరాటంకంగా నిష్కల్మషమైన పోరుసాగిస్తున్నారు. ఉద్యమ ప్రభావంతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. పిల్లల చదువులు ఆగిపోయాయి...ఉద్యోగుల జీతాలు నిలిచిపోయాయి. అయినా అటెండర్ నుంచి అధికారి వరకూ. దినకూలీ నుంచి బడాపారిశ్రామిక వేత్త వరకూ అందరూ కష్టాలను ఇష్టాలుగా స్వీకరిస్తున్నారు. విడిపోతే తలెత్తే కష్టాల కంటే ఇవేవీ పెద్దవి కాదనే రీతిలో పోరు సాగిస్తున్నారు.
కడపసిటీ, న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమం గ్రామ స్థాయి నుంచి తీవ్రమైంది. నగరంలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ‘పంచాయతీల గుండెచప్పుడు’ విజయవంతమైంది. సమైక్యమే కావాలని గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఆయా పంచాయతీలలో తీర్మానాలు చేసి ప్రతులను రాష్ట్రపతి, గవర్నర్‌లకు పంపుతున్నట్లు వెల్లడించారు. పల్లెసీమల నుంచి ప్రజాప్రతినిధులతో పాటు సాధారణ ప్రజలు కూడా కలిసి రావడంతో జెడ్పీ ప్రాంగణం నిండిపోయి కళకళలాడింది. కార్యక్రమం సాగినంత సేపు నినాదాలు మార్మోగాయి.
సమైక్య రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి సమైక్యాంధ్ర ఆవశ్యకతను తెలుపుతూ బీజేపీ వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. జెడ్పీ సీఈఓ మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకుని సమైక్య రాష్ట్ర ప్రకటన చేయాలన్నారు. సీమ ఇంజినీర్ల జేఏసీ కన్వీనర్ సుధాకర్‌బాబు, అనంతపురం కన్వీనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సాగు, తాగునీటి కష్టాల గురించి వివరించారు. సర్పంచులు సమైక్య రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధమని చెప్పుకొచ్చారు. సిటీ కేబుల్ అధినేత సూర్యనారాయణ ఆధ్వర్యంలో రూపొందించిన ‘పల్లెపల్లెలో సమైక్యవాదం’ అనే డీవీడీలను ఆవిష్కరించారు. వైవీయూ తెలుగు విభాగాధిపతి ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన జై సమైక్యాంధ్ర గీతాల సీడీని విడుదల చేశారు. సాయంత్రం వరకు సర్పంచుల దీక్షలు కొనసాగాయి. సాయంత్రం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సర్పంచు, వార్డు సభ్యులకు శీతల పానీయాలు అందించి దీక్షను విరమింపజేశారు.
సమైక్యంగా ఉంచాల్సిందే
Published Sat, Sep 28 2013 1:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement