కడప సెవెన్‌రోడ్స్ : కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ఇన్సాఫ్ సంఘాలు సోమవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని ఏఐఎస్‌ఎఫ్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వచ్చిన విద్యార్థులు, కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీ సులకు, విద్యార్థి సంఘ నాయకులకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం సాగింది. కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ఒక దశలో లాఠీలు ఝుళిపించారు. ఈ సంఘటనలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి ఏఐఎస్‌ఎఫ్ నాయకులు గంగా సురేష్, కొమ్మద్ది ఈశ్వరయ్య, అకుంశం తదితరులను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించా రు. కార్యక్రమానికి హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న కార్యకర్తలను పోలీసులు దౌర్జన్యపూరితంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. కడపలో ఉర్దూ వర్శిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా శాసనసభలో ప్రకటించి ఇప్పుడు కర్నూలులో ఏర్పాటు చేస్తామంటూ మాట మార్చడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ముని నాయుడు, వీరయ్య, శ్రీశైలం, ఇన్సాఫ్ నాయకులు గౌస్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న రిలే దీక్షలు
యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ యూనివర్సిటీ కోసం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నాటికి 16వ రోజుకు చేరాయి. జెమ్స్ పాఠశాల విద్యార్థులు ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఈ దీక్షల్లో వర్సిటీ యాక్షన్ కమిటీ చైర్మన్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కడపలోనే ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
Published Tue, Mar 17 2015 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM
Advertisement