
వైద్యశాఖ వింత వైఖరి
నాయుడుపేట: మండల పరిధిలోని పుదూరు పంచాయతీ కుప్పరగుంట గిరిజన మహిళ మాధవి సరైన పౌష్టికాహారం, వైద్యం అందక మృతి చెందిన ఘటనలో చిరుద్యోగిపై వైద్యశాఖ బుధవారం వేటు వేసింది. అయితే అసలు బాధ్యులపై ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భిణి అయిన మాధవి మృతి చెందడంపై ‘హంతకులెవరు’ శీర్షికన కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఈ కథనంపై స్పందించిన జిల్లా వైద్యాశాఖాధికారి కోటేశ్వరమ్మ నాయుడుపేట ప్రభుత్వాస్పత్రి తోటిని విధుల నుంచి తొలగించాలని సంబంధిత క్లస్టర్ అధికారి డాక్టర్ సాయిబాబాను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఆస్పత్రి అధికారులకు నివేదించాలని సూచించారు. నివేదిక అనంతరం పూర్తి విచారణ చేపడతామని ఆమె వివరించారని తెలిసింది. స్థానిక వైద్యారోగ్యశాఖాధికారులు చేసిన తప్పిదాలతో పాటు ప్రభుత్వాస్పత్రుల్లో నిర్లక్షంగా వ్యవహరించిన తీరుపై ఆమె చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.గర్భిణికి రక్తం లేకపోవడం వల్లే మృతి చెంది ఉంటుందని డాక్టర్ కోటేశ్వరమ్మ అన్నారు. గర్భిణి మృతికి అసలు కారకులను విడిచి చిరుద్యోగిపై చర్యలు తీసుకోవడం వింతగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు.
కుప్పరగుంటలో విచారణ..
మండలంలోని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఉమాదేవి బుధవారం కుప్పరగుంట గిరిజన కాలనీలో విచారణ చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సరుకులను పరిశీలించారు. సక్రమంగా అందరికీ పౌష్టికాహారం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను విచారించారు. అలాగే వైద్యశాఖ సిబ్బంది తూతూ మంత్రంగా విచారణ చేపట్టింది.