సరిగ్గా ఎనిమిది నెలల కిందట.. కొత్తపల్లి మండలం వాకతిప్పలో.. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర విస్ఫోటం.. 18మంది ప్రాణాలను బలిగొంది. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఆ సమయంలో మంత్రులు ఆర్భాటంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారులు వారికి కాస్త భూమి కేటాయించారు. కానీ, ఇప్పటివరకూ ఆ భూములు మాత్రం బాధితుల అనుభవంలోకి రాలేదు. అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గ నేత కన్ను ఈ భూములపై పడడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వాకతిప్ప బాణసంచా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తామన్న భూమి అందకుండా నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య నేత అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో గత ఏడాది అక్టోబర్ 20న సంభవించిన భారీ పేలుడులో 18 మంది దుర్మరణం పాలయ్యారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఆ సమయంలో మంత్రులు భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయం, సంక్షేమ ఫలాలు అందిస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. ప్రతి బాధిత కుటుంబానికీ అర ఎకరం భూమి ఇస్తామని చెప్పింది. విస్ఫోటం జరిగిన నెల రోజుల్లోనే కొత్త మూలపేట సమీపాన భూమి గుర్తించి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరికి అర ఎకరం చొప్పున 18 మందికి బాధిత కుటుంబాల యజమానుల పేరుతో పట్టాలు సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయి 8 నెలలైనా ఇంతవరకూ పంపిణీ చేయలేదు. చివరకు తమ పేరుతో వచ్చిన పట్టాలు ఎక్కడున్నాయో కూడా చెప్పడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
అడ్డుకుంటున్న ముఖ్య నేత
తాను చెప్పేవరకూ ఆ పట్టాలు పంపిణీ చేయవద్దంటూ నియోజకవర్గంలోని ఒక ముఖ్యనేత అడ్డం పడడమే ఇందుకు కారణమని తెలిసింది. బాధితులకు కేటాయించిన భూమి కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్‌ఈజెడ్) సమీపంలో ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పా రిశ్రామికీకరణ జరుగుతోంది. పట్టాలిచ్చేందుకు గుర్తిం చిన భూముల వద్ద రోడ్డుకు ఇటువైపు కేఎస్‌ఈజెడ్‌లో తొలిగా చైనాకు చెందిన బొమ్మల పరిశ్రమ ఏర్పాటైంది. మిగిలిన భూముల్లోనూ త్వరలో పరిశ్రమలు రానున్నా యి. ప్రస్తుతం అక్కడ ఎకరా భూమికి రూ.3 లక్షల నుం చి రూ.5 లక్షలు పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ భూములపై ముఖ్య నేత కన్ను పడిందని.. ఆ భూమిని తమ బినామీలకు కట్టబెట్టి సొమ్ము చేసుకోవచ్చన్న దురాలోచనతోనే.. తమకు కేటాయించిన భూములకు పట్టాలు ఇవ్వకుండా అడ్డం పడుతున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఎకరం భూమి ధర సుమారు రూ.కోటికి చేరుతుందన్న ఆశతో.. తమ నోటి దగ్గర కూడు కొట్టేసేందుకు కుట్ర పన్నుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులు, రాష్ట్ర మంత్రులవద్దకు పలుమార్లు తిరిగినా ఫలితం లేదని వారు చెబుతున్నారు.
ఎవరూ పట్టించుకోవడం లేదు..
సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా పట్టాలు ఇవ్వడం లేదు. భూమి ఇస్తామని స్థలం కూడా నిర్ణయించినా సంబంధించిన పట్టాలు ఎక్కడున్నాయో తెలీదు. ఎంతమంది దగ్గరకు తిరిగినా పట్టించుకోవడం లేదు.
- ద్రాక్షారపు రాజు, బాధిత కుటుంబీకుడు, వాకతిప్ప
జాప్యం దేనికో..
సంఘటన జరిగినప్పుడు ఎందరో వచ్చారు. ఎన్నో చేస్తామన్నారు. మాకు కేటాయించిన భూమిని పంపిణీ చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అప్పట్లో భూమి ఇస్తున్నట్లు ప్రకటించిన నాయకులు ఇప్పుడు నోరు మెదపడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు.
- మసకపల్లి సుబ్రహ్మణ్యం,
బాధిత కుటుంబీకుడు, వాకతిప్ప పలు కారణాలతో పంపిణీ ఆగింది..
పట్టాలు ఎప్పుడో తయారు చేసి పంపిణీకి కూడా ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులతో పంపిణీ చేయించాలంటూ అప్పట్లో నిలుపు చేశారు. తరువాత వివిధ కారణాలతో పంపిణీ ఆగింది.
- ప్రసాద్, ఇన్‌చార్జితహశీల్దార్, కొత్తపలి
వాకతిప్ప భూములపై.. రాజకీయ రాబందు!
Published Thu, Jun 25 2015 2:30 AM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM
Advertisement
Advertisement