బతుకులు.. కష్టాల అతుకులు | Vamsadhara Displaced People Problems In Srikakulam | Sakshi
Sakshi News home page

బతుకులు.. కష్టాల అతుకులు

Published Wed, Jul 24 2019 9:04 AM | Last Updated on Wed, Jul 24 2019 9:04 AM

Vamsadhara Displaced People Problems In Srikakulam - Sakshi

కనీస సదుపాయాల్లేని పునరావాస కాలనీ, పాడలి పునరావాస కాలనీలో రేకులషెడ్లే నిర్వాసితుల ఇళ్లు

ఇల్లు వదిలారు, పొలాలు విడిచిపెట్టారు, ఇరుగుపొరుగు అనే మాట ను మర్చిపోయారు, జ్ఞాపకాలను సమాధి చేసి ఊరిని వంశధారకు అప్పగించి వెళ్లిపోయారు. ఇంత చేశాక కాసింత సాయం చేయాలని కోరితే ఒంటిపై లాఠీదెబ్బలు పడ్డాయి. బతకలేకపోతున్నాం న్యాయం చేయాలని అడిగితే జైలు ఊచలు కళ్లకు కనిపించాయి. ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఏటా అంచనాలు పెరిగేవి.. కానీ పరిహారం మాత్రం అంతే ఉండేది. ధరలు అందరికీ పెరుగుతాయి కదా.. అని అడిగితే అదే పాపమైపోయింది. వంశధార నిర్వాసితుల బతుకులు కష్టాల అతుకుల్లా మారాయి. గత టీడీపీ పాలకుల వైఫల్యాల కారణంగా సమస్యలతో సహజీవనం చేయాల్సి వస్తోంది.

సాక్షి, ఎల్‌.ఎన్‌ పేట (శ్రీకాకుళం): భవిష్యత్‌ తరాల బాగు కోసం, జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉన్న ఊరిని, పంట భూములను, ఇరుగు పొరుగు వారిని వదిలి వెళ్లిపోయారు. ఎవరు ఎక్కడకు వెళ్లారో కూడా తెలీని దశకు చేరుకున్నారు. మీరు త్యాగధనులు, మీ త్యాగాలు ఈ జిల్లా ప్రజలు మరచిపోలేరు, సర్వం త్యాగం చేసిన మీకు ఏమిచ్చినా తక్కువే అని ఉపన్యాసాలు ఇచ్చిన గత పాలకులు న్యాయం చేయడంలో మాత్రం పిసినారితనం చూపించారు. అవస్థలు పడుతున్న దశలో సాయం చేయకుండా కాలక్షేపం చేశారు. దీనిపై ఇప్పటికీ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

రిజర్వాయర్‌ పరిస్థితి ఇది
ఏటా వర్షాకాలంలో ఒడిశా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వంశధార నది నుంచి వృధాగా వెళ్లి సముంద్రంలో కలిసి పోతున్న వరద నీటిని ఒడిసి పట్టి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది కుటుంబాలకు తాగునీరు అందించాలన్నదే ఈ ప్రాజెక్టు ఆశయం. వంశధార నదిపై హిరమండలం వద్ద ఉన్న గొట్టాబ్యారేజ్‌ సమీపంలో 10 వేల ఎకరాల విస్తీర్ణంలో 19 టీఎంసీ(శతకోటి ఘనపుటడుగు)ల నీటి నిల్వకోసం 2005 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్‌ రాజశేఖర రెడ్డి రూ.425 కోట్లు ఖర్చుతో వంశధార రిజర్వాయర్‌ పనులు శంకుస్థాపన చేశారు.

2011 నాటికి పనులు పూర్తి చేయాలన్నదే అప్పటి లక్ష్యం. రిజర్వాయర్‌ నిర్మాణంలో 13 గ్రామాలు పూర్తిగా మునిగిపోగా, 21 గ్రామాలకు పాక్షికంగా నష్టం జరుగుతుందని 2004 నుంచి 2006 వరకు నిర్వహించిన సర్వేలో తేల్చి చెప్పారు. ఆయా గ్రామాలకు చెందిన 7,480 కుటుంబాలకు పూర్తి స్థాయి ప్యాకేజీలు చెల్లించి, ఈ కుటంబాల వారికి పునరావాసం కల్పించాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

పట్టించుకోని పాలకులు
రాజన్న మరణం తర్వాత వచ్చిన పాలకులు నిర్వాసితులకు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. 2009 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు అవకాశం వచ్చినప్పుడల్లా వంశధార నిర్వాసితులకు అన్యాయం జరిగిపోతోందని, తనకు ఓట్లేసి గెలిపిస్తే ఉద్ధరిస్తానని ఎన్నో హామీలు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను గాలికి వదిలేశారు. రిజర్వాయర్‌ నిర్మాణంలో కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపించిన చంద్రబాబు నిర్వాసితులను పట్టించుకోవడం మానేశారు. కడుపు మండి ఎదురు తిరిగిన ని ర్వాసితులపై పోలీసులను ఉసిగొలిపి, అక్రమ కేసులు నమోదు చేయించి జైల్లో వేయించారు. 100 రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు చేసినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అప్పటి ఎమ్మెల్యే కలమట వెంకటరమణ దీనిపై దృష్టి సారించలేదు.

రాజన్న హయాంలోనే..
2005 మార్చిలో శంకుస్థాపన చేసిన పనులకు అవసరమైన నిధుల కేటాయింపు కూడా జరిగింది. రిజర్వాయర్‌ నిర్మాణం జరగనున్న గ్రామాల్లో అధికారులు ఒక వైపు సర్వేలు చేస్తుండగానే మరో వైపు పనులు చేపట్టారు. 2009 వరకు పనులు చురుగ్గానే జరిగాయి. అప్పటికే కొన్ని గ్రామాలకు చెందిన నిర్వాసితులను బయటకు పంపించాల్సి వచ్చింది. వారి కోసం ప్రభుత్వమే పునరావాస కాలనీలు ఏర్పాటు చేసేందుకు స్థలం సేకరించడం, సీసీ రోడ్లు, డైనేజీలు, విద్యుత్, తాగునీటితో పాటు మరెన్నో సదుపాయాలను ఏర్పా టు చేసింది. 3800 కుటుంబాలకు పునరావాసం కోసం స్థలాలు కేటాయించడం జరిగింది. కొన్ని కుటుంబాల వారు పాత గ్రామాలను వదిలి వచ్చేసి పునరావాస కాలనీల్లో ఇళ్లు కట్టుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ వైఎస్‌ రాజశేఖరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత జరిగిన ఒక సంఘటనలో ఆయ న మరణించడంతో వంశధార నిర్వాసితులకు కష్టాలు ప్రారంభమయ్యాయి.

శాపంగా మారిన పునరావాసం
ఎన్నికల ముందు రిజర్వాయర్‌లో నీటిని నింపి తామే ఏదో చేశామని జిల్లా ప్రజలను నమ్మించాలనే తపనతో చంద్రబాబు ప్రభుత్వం 2017 ఆగస్టులో రిజర్వాయర్‌ పనులు జరుగుతున్న ప్రదేశంలో వందలాదిగా పోలీసులను మోహరించింది. నిర్వాసితులకు పునరావాసం కోసం ఇళ్ల స్థలం, కట్టుకునేందుకు కాలనీ ఇళ్లు, మి గులు  భూములకు, డీ పట్టా భూములకు పరిహారం, యూత్‌ ప్యాకేజీలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తే తామే స్వచ్ఛం దంగా ఖాళీ చేసి వెళ్లిపోతామని కొందరు నిర్వాసితులు ఎదురు తిరిగారు. ఇలా ఎదురు తిరిగిన నిర్వాసితులపై పోలీసులతో లాఠీ చార్జి చేయించి, తప్పుడు కేసులు బనాయించి జైల్లో వేయించారు.

కనీస గడువు, నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు ఖాళీ చేయించి బయటకు పంపించేశారు. ఇలా వచ్చేసిన నిర్వాసితులు ఎల్‌ఎన్‌ పేట, హిరమండలం, కొత్తూరు, ఆమదాలవలస మండలాల్లో పలు గ్రామాల వద్ద పునరావాసం ఏర్పాటు చేసుకునేందుకు రైతులు వద్ద పొలాలు కొనుగోలు చేసి రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ అనేక కుటుంబాల వారు రేకుల షెడ్లలోనే జీవిస్తున్నారు. వీరు ఏర్పాటు చేసుకున్న పునరావాస కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి కనీస సదుపాయాలు కూడా కరువయ్యాయి.

ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లు రిపేర్లకు గురైతే బాగు చేయించే నాథుడే లేకుండా పోయాడు. విద్యుత్‌ వీధి దీపాలు కాలిపోతే వేయించే దిక్కు లేదని పలువురు నిర్వాసితులు వాపోతున్నారు. ఇంటి స్థలాలు లోతట్టుగా ఉన్నాయని మట్టి వేసి ఎత్తు చేసే బాధ్యత ప్రభుత్వానిదే అయినా గతంలో మట్టి పేరుతో రూ.లక్షలు స్వాహా చేసుకున్నారు. వర్షాకాలం వస్తే పాఠశాల ఆటస్థలాల్లో వరద నీరు చేరిపోతుంది. నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పార్కులు పిచ్చిమొక్కలతో ఉన్నాయి. కొన్ని పునరావాస కాలనీల్లో అక్కడక్కడా మిగిలి ఉన్న ప్రభుత్వ స్థలాలు గతంలో టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నా పట్టించుకోలేదు.

పునరావాసం ఒక శాపం
వంశధార నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలు శాపంగా మారాయి. నిర్వాసితుల పునరావాస కాలనీల్లో ఏవేవో సదుపాయాలు కల్పిస్తామని చెప్పి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించేవారు. వాస్తవానికి వస్తే ఎక్కడా పైసా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. మా పేరుతో నిధులు దుర్వినియోగం జరిగాయి. నిర్వాసితులైన మాకు అన్యాయం జరిగింది.
- ఇప్పిలి చిన్నంనాయుడు, వంశధార నిర్వాసితుడు, చిన్నకొల్లివలస ఆర్‌ఆర్‌ కాలనీ, ఎల్‌.ఎన్‌.పేట

వికలాంగులకు ప్రత్యేక ప్యాకేజీ
నిర్వాసిత గ్రామాలకు చెం దిన వికలాంగులకు ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేయాలని, వికలాంగులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వికలాంగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిం చాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఆదుకోవాలని గత ప్రభుత్వంతో ఎంతో పోరాటం చేశాం. ఇందుకోసం అప్పట్లో ప్రత్యేక సర్వే చేసినా ఫలితం లేకుండా పోయింది. గత పాలకులు మాకు అన్యాయం చేశారు.
– గేదెల సింహాచలం, నిర్వాసిత వికలాంగుడు, వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు, తులగాం ఆర్‌ఆర్‌ కాలనీ, హిరమండలం

పనులకే ప్రాధాన్యం – ప్యాకేజీలకు లేదు
రిజర్వాయర్‌ నిర్మాణం పనులకు ఇచ్చే ప్రాధాన్యం నిర్వాసితులకు చెల్లించే ప్యాకేజీలకు ఇవ్వలేదు. రిజర్వాయర్‌ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు చం ద్రబాబు ప్రభుత్వంలో కీలక నేతలు కావడంతో ఎప్పటికప్పుడు అంచనాలు పెంచి డబ్బులు దోచిపెట్టారు. వంశధార నిర్వాసితులు భూములు, ఇళ్లు కోల్పోతున్నప్పటికీ 2005లో సర్వే చేసినప్పటి ధరలే ఇచ్చారు. కాంట్రాక్టర్‌కు ధరలు పెంపు... నిర్వాసితుల పరిహారం లేకుండా పోయింది. ఇదెక్కడి న్యాయమో చంద్రబాబే చెప్పాలి.
– జి.మోహనరావు, వంశధార నిర్వాసితుడు, పాడలి ఆర్‌ఆర్‌ కాలనీ 

నిర్వాసితులకు అండగా ఉంటాం
ప్రతిపక్షంలో ఉన్నప్పడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే మాట చెబుతున్నా.. వంశధార నిర్వాసితులకు ఎప్పుడు అండగానే ఉంటాం. చంద్రబాబు ప్రభుత్వం వీరికి అనేక రకాలుగా అన్యాయం చేసిన సంగతి తెలిసిందే. వీరిపై లాఠీ చార్జి చేసి, తప్పుడు కేసులు నమోదు చేసి, జైల్లో వేసి, బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హిరమండలంలో బహిరంగ సభ నిర్వహించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగాను మెళియాపుట్టి సభలోను నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి జగనన్న హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక సందర్భంలో జగన్‌మోహన్‌ రెడ్డి వద్ద వంశధార నిర్వాసితుల సమస్యలపై నేనే ప్రస్తావించాను. వారికి ఇచ్చిన మాట నాకు గుర్తుంది, నిర్వాసితులకు  న్యాయం చేద్దామని జగనన్న ఆన్నారు. కొద్ది నెలల్లోనే నిర్వాసితులకు తీపి కబురు వస్తుంది. 
– రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement