Vamsadhara Reservoir
-
వంశ‘ధార’కు గ్రీన్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) తుది నివేదికపై ఒడిశా అభ్యంతరాలను కేంద్రం తోసిపుచ్చింది. నివేదికపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు సమన్యాయం చేస్తూ వంశధార జలాలను పంపిణీ చేసినందున ట్రిబ్యునల్ గడువు పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. దాంతో వంశధార ట్రిబ్యునల్‌ను రద్దు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2017 సెప్టెంబరు 13న ట్రిబ్యునల్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక, 2021 జూన్ 21న ఇచ్చిన తుది నివేదికలను సవాలు చేస్తూ ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ)లు దాఖలు చేసింది. సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోవడంతో తుది నివేదిక అమలుకు కేంద్రం సిద్ధమైంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్ఆర్డబ్ల్యూడీ) చట్టం–1956 సెక్షన్–6(1) ప్రకారం ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేసేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ వారంలోగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. తుది నివేదిక అమల్లోకి వస్తే.. ఏపీ, ఒడిశాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. సమన్యాయం చేసిన ట్రిబ్యునల్ వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మించి వంశధార ఫేజ్–1 కింద 21 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 45 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరందించి శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసే పనులకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 ఫిబ్రవరి 25న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుపై ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేసింది. వంశధార జలాల పంపిణీకి ట్రిబ్యునల్‌ను నియమించాలని కేంద్రాన్ని పట్టుబట్టింది. దీంతో నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ నిర్మించేలా మహానేత వైఎస్ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చారు. పనులు కూడా చేపట్టారు. ఒడిశా ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం 2010లో వంశధార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఏడేళ్లపాటు సుదీర్ఘంగా విచారించిన ట్రిబ్యునల్.. 2017 సెప్టెంబరు 13న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఒడిశా, ఏపీ ప్రభుత్వాలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని 2021 జూన్ 21న తుది నివేదిక ఇచ్చింది. తుది నివేదిక ప్రకారం ► వంశధారలో 75 శాతం లభ్యతగా ఉన్న 115 టీఎంసీల్లో చెరి సగం (57.5 టీఎంసీలు) చొప్పున రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ► నేరడి బ్యారేజీ వల్ల ఒడిశాలో ముంపునకు గురయ్యే 106 ఎకరాలను ఆ ప్రభుత్వం సేకరించి ఏపీకి అప్పగించాలి. ఇందుకు ఏపీ పరిహారం చెల్లించాలి. ► నేరడి బ్యారేజీ కుడి వైపున ఏపీ, ఎడమ వైపున ఒడిశా కాలువలు తవ్వుకుని ఆయకట్టుకు నీళ్లందించుకోవచ్చు. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో రెండు రాష్ట్రాలు భరించాలి. ► నేరడి బ్యారేజీ నిర్మించాక కాట్రగడ్డ సైడ్ వియర్‌ను తొలగించాలి. ► దీన్ని అమలు చేయడానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సీఈ అధ్యక్షతన రెండు రాష్ట్రాల అధికారులు సభ్యులుగా అంతర్రాష్ట్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి. ఫలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రయత్నాలు..: వంశధార ట్రిబ్యునల్ తుది నివేదిక అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు సస్యశ్యామలం చేయవచ్చునని సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలోనే ట్రిబ్యునల్ ప్రాథమిక నివేదికను అమలు చేయాలంటూ 2019 జూన్ 27న, తుది నివేదికను అమలు చేయాలంటూ 2021 సెప్టెంబరు 28న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సీఎం జగన్ లేఖలు రాశారు. ట్రిబ్యునల్ తుది నివేదిక అమలుకు సహకరించాలని, రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని 2021 ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశారు. ఇదే అంశంపై చర్చించేందుకు ఒడిశా సీఎం ఆహ్వానం మేరకు గతేడాది నవంబర్ 3న సీఎం జగన్ భువనేశ్వర్ వెళ్లారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి షెకావత్‌తో సమావేశమైన సందర్భంలోనూ ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వైఎస్ జగన్ కృషి ఫలితంగానే వంశధార తుది నివేదిక అమలుకు కేంద్రం కసరత్తు ప్రారంభించిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
మానని గాయం..అదో చీకటిరోజు
వారికి అదో చీకటి రోజు.. వందలాది మంది పోలీసులు ఆ గ్రామాలను చుట్టుముట్టి.. పిల్లా జెల్లా, ముసలి ముతక అని కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. తమ లాఠీలతో అమానుషంగా వ్యవహరించారు. వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణంలో సర్వం త్యాగం చేసిన 18 గ్రామాల నిర్వాసితుల పట్ల నాటి టీడీపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిన తీరు ఇది. ఈ ఘటన జరిగి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ ఇదో మానని గాయంగా నిలిచింది. హిరమండలం/ఎల్.ఎన్.పేట: వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణంలో హిరమండలం, కొత్తూరు మండలాల్లో 18 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞంలో భాగంగా వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయనపై ఉన్న నమ్మకంతో అప్పట్లో నిర్వాసితులు సైతం తమ భూములు ఇచ్చేందుకు, గ్రామాలను ఖాళీ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ మహానేత ఆకస్మిక మరణంతో వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల కర్కశంగా వ్యవహరించింది. ప్యాకేజీ, పరిహారం విషయంలో తీరని అన్యాయం చేసింది. నిజమైన నిర్వాసితులకు కాకుండా తమ పార్టీ చోటా నేతలకు పెద్దపీట వేసింది. కోట్లాది రూపాయలు ప్యాకేజీ, పరిహారం కోసం మంజూరు చేసినట్టు చెప్పుకొచ్చారు. అదే సమయంలో గ్రామాలను ఖాళీ చేయాలని, పొలాల్లో పంటలు పండించవద్దని హుకుం జారీ చేసింది. ఇంకా సమస్యలు పరిష్కరించలేదని, అంతవరకూ పంటలు పండించుకుంటామని నిర్వాసిత గ్రామాల ప్రజలు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో 2017 ఆగస్టు 17న దమ్ములకు సిద్ధమవుతున్న రైతులపై నాటి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు దాడులు చేశారు. వందలాది మంది మోహరించడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. అండగా నిలిచిన గ్రామ ప్రతినిధులపై కేసులు అక్రమంగా బనాయించారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి నాటి టీడీపీ ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టారు. నిర్వాసితులకు అండగా నిలిచారు. ఇప్పటికీ మరువలేకున్నాం నాటి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరిగాయి. వందలాది మంది పోలీసులు గ్రామాల్లో మహిళలు, పిల్లలని చూడకుండా దాడికి తెగబడ్డారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంది. అప్పట్లో జగన్మోహన్రెడ్డి నిర్వాసితులకు అండగా నిలిచారు. అందుకే వైఎస్సార్సీపీకి రుణపడి ఉంటారు. – గొర్లె మోహన్‌రావు, నిర్వాసితుడు, పాడలి అదో చీకటి రోజు నాటి టీడీపీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల కర్కశంగా వ్యవహరించింది. పంట పండించుకుంటామని చెప్పినా వినలేదు. రిజర్వాయర్ నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన వారిపై అమానుషంగా వ్యవహరించింది. పచ్చని పంట పొలాలను ధ్వంసం చేసింది. రక్తపాతం సృష్టించింది. నియోజకవర్గ, జిల్లా పెద్దలు కనీసం పరామర్శకు రాలేదు. ఈ విషయాన్ని ఎప్పటికీ మరువలేరు. – జీ తిరుపతిరావు, నిర్వాసితుడు, పాడలి -
బతుకులు.. కష్టాల అతుకులు
ఇల్లు వదిలారు, పొలాలు విడిచిపెట్టారు, ఇరుగుపొరుగు అనే మాట ను మర్చిపోయారు, జ్ఞాపకాలను సమాధి చేసి ఊరిని వంశధారకు అప్పగించి వెళ్లిపోయారు. ఇంత చేశాక కాసింత సాయం చేయాలని కోరితే ఒంటిపై లాఠీదెబ్బలు పడ్డాయి. బతకలేకపోతున్నాం న్యాయం చేయాలని అడిగితే జైలు ఊచలు కళ్లకు కనిపించాయి. ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఏటా అంచనాలు పెరిగేవి.. కానీ పరిహారం మాత్రం అంతే ఉండేది. ధరలు అందరికీ పెరుగుతాయి కదా.. అని అడిగితే అదే పాపమైపోయింది. వంశధార నిర్వాసితుల బతుకులు కష్టాల అతుకుల్లా మారాయి. గత టీడీపీ పాలకుల వైఫల్యాల కారణంగా సమస్యలతో సహజీవనం చేయాల్సి వస్తోంది. సాక్షి, ఎల్.ఎన్ పేట (శ్రీకాకుళం): భవిష్యత్ తరాల బాగు కోసం, జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉన్న ఊరిని, పంట భూములను, ఇరుగు పొరుగు వారిని వదిలి వెళ్లిపోయారు. ఎవరు ఎక్కడకు వెళ్లారో కూడా తెలీని దశకు చేరుకున్నారు. మీరు త్యాగధనులు, మీ త్యాగాలు ఈ జిల్లా ప్రజలు మరచిపోలేరు, సర్వం త్యాగం చేసిన మీకు ఏమిచ్చినా తక్కువే అని ఉపన్యాసాలు ఇచ్చిన గత పాలకులు న్యాయం చేయడంలో మాత్రం పిసినారితనం చూపించారు. అవస్థలు పడుతున్న దశలో సాయం చేయకుండా కాలక్షేపం చేశారు. దీనిపై ఇప్పటికీ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రిజర్వాయర్ పరిస్థితి ఇది ఏటా వర్షాకాలంలో ఒడిశా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వంశధార నది నుంచి వృధాగా వెళ్లి సముంద్రంలో కలిసి పోతున్న వరద నీటిని ఒడిసి పట్టి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది కుటుంబాలకు తాగునీరు అందించాలన్నదే ఈ ప్రాజెక్టు ఆశయం. వంశధార నదిపై హిరమండలం వద్ద ఉన్న గొట్టాబ్యారేజ్ సమీపంలో 10 వేల ఎకరాల విస్తీర్ణంలో 19 టీఎంసీ(శతకోటి ఘనపుటడుగు)ల నీటి నిల్వకోసం 2005 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి రూ.425 కోట్లు ఖర్చుతో వంశధార రిజర్వాయర్ పనులు శంకుస్థాపన చేశారు. 2011 నాటికి పనులు పూర్తి చేయాలన్నదే అప్పటి లక్ష్యం. రిజర్వాయర్ నిర్మాణంలో 13 గ్రామాలు పూర్తిగా మునిగిపోగా, 21 గ్రామాలకు పాక్షికంగా నష్టం జరుగుతుందని 2004 నుంచి 2006 వరకు నిర్వహించిన సర్వేలో తేల్చి చెప్పారు. ఆయా గ్రామాలకు చెందిన 7,480 కుటుంబాలకు పూర్తి స్థాయి ప్యాకేజీలు చెల్లించి, ఈ కుటంబాల వారికి పునరావాసం కల్పించాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పట్టించుకోని పాలకులు రాజన్న మరణం తర్వాత వచ్చిన పాలకులు నిర్వాసితులకు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. 2009 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు అవకాశం వచ్చినప్పుడల్లా వంశధార నిర్వాసితులకు అన్యాయం జరిగిపోతోందని, తనకు ఓట్లేసి గెలిపిస్తే ఉద్ధరిస్తానని ఎన్నో హామీలు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను గాలికి వదిలేశారు. రిజర్వాయర్ నిర్మాణంలో కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపించిన చంద్రబాబు నిర్వాసితులను పట్టించుకోవడం మానేశారు. కడుపు మండి ఎదురు తిరిగిన ని ర్వాసితులపై పోలీసులను ఉసిగొలిపి, అక్రమ కేసులు నమోదు చేయించి జైల్లో వేయించారు. 100 రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు చేసినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అప్పటి ఎమ్మెల్యే కలమట వెంకటరమణ దీనిపై దృష్టి సారించలేదు. రాజన్న హయాంలోనే.. 2005 మార్చిలో శంకుస్థాపన చేసిన పనులకు అవసరమైన నిధుల కేటాయింపు కూడా జరిగింది. రిజర్వాయర్ నిర్మాణం జరగనున్న గ్రామాల్లో అధికారులు ఒక వైపు సర్వేలు చేస్తుండగానే మరో వైపు పనులు చేపట్టారు. 2009 వరకు పనులు చురుగ్గానే జరిగాయి. అప్పటికే కొన్ని గ్రామాలకు చెందిన నిర్వాసితులను బయటకు పంపించాల్సి వచ్చింది. వారి కోసం ప్రభుత్వమే పునరావాస కాలనీలు ఏర్పాటు చేసేందుకు స్థలం సేకరించడం, సీసీ రోడ్లు, డైనేజీలు, విద్యుత్, తాగునీటితో పాటు మరెన్నో సదుపాయాలను ఏర్పా టు చేసింది. 3800 కుటుంబాలకు పునరావాసం కోసం స్థలాలు కేటాయించడం జరిగింది. కొన్ని కుటుంబాల వారు పాత గ్రామాలను వదిలి వచ్చేసి పునరావాస కాలనీల్లో ఇళ్లు కట్టుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ వైఎస్ రాజశేఖరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత జరిగిన ఒక సంఘటనలో ఆయ న మరణించడంతో వంశధార నిర్వాసితులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. శాపంగా మారిన పునరావాసం ఎన్నికల ముందు రిజర్వాయర్‌లో నీటిని నింపి తామే ఏదో చేశామని జిల్లా ప్రజలను నమ్మించాలనే తపనతో చంద్రబాబు ప్రభుత్వం 2017 ఆగస్టులో రిజర్వాయర్ పనులు జరుగుతున్న ప్రదేశంలో వందలాదిగా పోలీసులను మోహరించింది. నిర్వాసితులకు పునరావాసం కోసం ఇళ్ల స్థలం, కట్టుకునేందుకు కాలనీ ఇళ్లు, మి గులు భూములకు, డీ పట్టా భూములకు పరిహారం, యూత్ ప్యాకేజీలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తే తామే స్వచ్ఛం దంగా ఖాళీ చేసి వెళ్లిపోతామని కొందరు నిర్వాసితులు ఎదురు తిరిగారు. ఇలా ఎదురు తిరిగిన నిర్వాసితులపై పోలీసులతో లాఠీ చార్జి చేయించి, తప్పుడు కేసులు బనాయించి జైల్లో వేయించారు. కనీస గడువు, నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు ఖాళీ చేయించి బయటకు పంపించేశారు. ఇలా వచ్చేసిన నిర్వాసితులు ఎల్ఎన్ పేట, హిరమండలం, కొత్తూరు, ఆమదాలవలస మండలాల్లో పలు గ్రామాల వద్ద పునరావాసం ఏర్పాటు చేసుకునేందుకు రైతులు వద్ద పొలాలు కొనుగోలు చేసి రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ అనేక కుటుంబాల వారు రేకుల షెడ్లలోనే జీవిస్తున్నారు. వీరు ఏర్పాటు చేసుకున్న పునరావాస కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి కనీస సదుపాయాలు కూడా కరువయ్యాయి. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లు రిపేర్లకు గురైతే బాగు చేయించే నాథుడే లేకుండా పోయాడు. విద్యుత్ వీధి దీపాలు కాలిపోతే వేయించే దిక్కు లేదని పలువురు నిర్వాసితులు వాపోతున్నారు. ఇంటి స్థలాలు లోతట్టుగా ఉన్నాయని మట్టి వేసి ఎత్తు చేసే బాధ్యత ప్రభుత్వానిదే అయినా గతంలో మట్టి పేరుతో రూ.లక్షలు స్వాహా చేసుకున్నారు. వర్షాకాలం వస్తే పాఠశాల ఆటస్థలాల్లో వరద నీరు చేరిపోతుంది. నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పార్కులు పిచ్చిమొక్కలతో ఉన్నాయి. కొన్ని పునరావాస కాలనీల్లో అక్కడక్కడా మిగిలి ఉన్న ప్రభుత్వ స్థలాలు గతంలో టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నా పట్టించుకోలేదు. పునరావాసం ఒక శాపం వంశధార నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలు శాపంగా మారాయి. నిర్వాసితుల పునరావాస కాలనీల్లో ఏవేవో సదుపాయాలు కల్పిస్తామని చెప్పి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించేవారు. వాస్తవానికి వస్తే ఎక్కడా పైసా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. మా పేరుతో నిధులు దుర్వినియోగం జరిగాయి. నిర్వాసితులైన మాకు అన్యాయం జరిగింది. - ఇప్పిలి చిన్నంనాయుడు, వంశధార నిర్వాసితుడు, చిన్నకొల్లివలస ఆర్ఆర్ కాలనీ, ఎల్.ఎన్.పేట వికలాంగులకు ప్రత్యేక ప్యాకేజీ నిర్వాసిత గ్రామాలకు చెం దిన వికలాంగులకు ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేయాలని, వికలాంగులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వికలాంగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిం చాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఆదుకోవాలని గత ప్రభుత్వంతో ఎంతో పోరాటం చేశాం. ఇందుకోసం అప్పట్లో ప్రత్యేక సర్వే చేసినా ఫలితం లేకుండా పోయింది. గత పాలకులు మాకు అన్యాయం చేశారు. – గేదెల సింహాచలం, నిర్వాసిత వికలాంగుడు, వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు, తులగాం ఆర్ఆర్ కాలనీ, హిరమండలం పనులకే ప్రాధాన్యం – ప్యాకేజీలకు లేదు రిజర్వాయర్ నిర్మాణం పనులకు ఇచ్చే ప్రాధాన్యం నిర్వాసితులకు చెల్లించే ప్యాకేజీలకు ఇవ్వలేదు. రిజర్వాయర్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు చం ద్రబాబు ప్రభుత్వంలో కీలక నేతలు కావడంతో ఎప్పటికప్పుడు అంచనాలు పెంచి డబ్బులు దోచిపెట్టారు. వంశధార నిర్వాసితులు భూములు, ఇళ్లు కోల్పోతున్నప్పటికీ 2005లో సర్వే చేసినప్పటి ధరలే ఇచ్చారు. కాంట్రాక్టర్‌కు ధరలు పెంపు... నిర్వాసితుల పరిహారం లేకుండా పోయింది. ఇదెక్కడి న్యాయమో చంద్రబాబే చెప్పాలి. – జి.మోహనరావు, వంశధార నిర్వాసితుడు, పాడలి ఆర్ఆర్ కాలనీ నిర్వాసితులకు అండగా ఉంటాం ప్రతిపక్షంలో ఉన్నప్పడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే మాట చెబుతున్నా.. వంశధార నిర్వాసితులకు ఎప్పుడు అండగానే ఉంటాం. చంద్రబాబు ప్రభుత్వం వీరికి అనేక రకాలుగా అన్యాయం చేసిన సంగతి తెలిసిందే. వీరిపై లాఠీ చార్జి చేసి, తప్పుడు కేసులు నమోదు చేసి, జైల్లో వేసి, బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హిరమండలంలో బహిరంగ సభ నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగాను మెళియాపుట్టి సభలోను నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి జగనన్న హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వద్ద వంశధార నిర్వాసితుల సమస్యలపై నేనే ప్రస్తావించాను. వారికి ఇచ్చిన మాట నాకు గుర్తుంది, నిర్వాసితులకు న్యాయం చేద్దామని జగనన్న ఆన్నారు. కొద్ది నెలల్లోనే నిర్వాసితులకు తీపి కబురు వస్తుంది. – రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం -
వంశధార రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత
హిరమండలం: తమ న్యాయపరమైన సమస్యలు తీర్చిన తర్వాతే వంశధార రిజర్వాయర్ పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. సమీప గ్రామాల నిర్వాసితులు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో జరుగుతున్న వంశధార రిజర్వాయర్ పనులను గురువారం నిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు తీర్చకుండా పనులు ప్రారంభిస్తే.. ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. -
పోలీసుల నీడలో...
ఎల్.ఎన్.పేట(హిరమండలం):వంశధార రిజర్వాయర్ నిర్మాణం పనులు పోలీసుల నీడలో ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఈ పనులు భారీ బందోబస్తు మధ్య మళ్లీ మొదలు పెట్టారు. హిరమండలం బ్యారేజ్ సెంటర్ వద్ద 40 రోజులుగా చేస్తున్న రిలేనిరాహార దీక్ష శిబిరాన్ని తొలగించిన పోలీసులు శనివారం ఉదయం 11 గంటల సమయంలో వంశధార ఇంజనీరింగ్ అధికారులతో 0 నుంచి 750వ కిలోమీటర్ మధ్యలో రిజర్వాయర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాకే పనులు చేయాలని, అంతవరకు పనులు జరగనీయమని ఆందోళనకు దిగిన నిర్వాసితుల జాడేలేకుండా పోయింది. శుక్రవారం నుంచి హిరమండలంలో పోలీసు బలగాలు మోహరిస్తుండటంతో ఏక్షణంలో ఏమి జరుగుతుందోనని స్థానికులతో పాటు నిర్వాసితులు ఆందోళన చెందారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణతో పాటు పలువురు సీఐలు, ఎస్సైలు, ప్రత్యేక ఫోర్స్ పోలీసు బలగాలు, మహిళా పోలీసులు అధిక సంఖ్యలో హిరమండలం పోలీసు స్టేషన్‌కు శనివారం ఉదయం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పనులు అడ్డుకునేందుకు నిర్వాసితులు వస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అయితే నిర్వాసితులు ఎవరూ అటువైపుగా రాకపోవడంతో పనులు సాఫీగా జరిగాయి. పోలీసులు, వంశధార, రెవెన్యూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పనులు అడ్డుకుంటే చర్యలు:పాలకొండ డీఎస్పీ ప్రజల అభ్యున్నతి కోసం జరుగుతున్న వంశధార రిజర్వాయర్ నిర్మాణం పనులు అడ్డుకోవడం మంచిపద్ధతి కాదని, నిర్వాసితులకు పునరావాసం, ప్యాకేజీలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా ఆయా అధికారులకు గాని, తమకు గాని ఫిర్యాదు చేయవచ్చుని పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ అన్నారు. ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పనులు జరిగేందుకు నిర్వాసితులు సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 2017 జూన్‌కి వంశధార నీరు: వంశధార ఎస్ఈ వంశధార రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి 2017 జూన్‌లో ఖరీఫ్ వరికి సాగునీరు అందించడమే లక్ష్యంగా తీసుకున్నామని వంశధార ఎస్ఈ బి.అప్పలనాయుడు తెలిపారు. రిజర్వాయర్ పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారని, ఈ మేరకు పునరావాసం, ఆర్ఆర్ ప్యాకేజీలకు, నిర్మాణ పనులకు అవసరమైన నిధులు విడుదల చేశారని చెప్పారు. 2017 జూన్ నాటికి సింగిడి రిజర్వాయర్ ద్వారా 2వేల ఎకరాలకు, పారాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 18 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. పనులకు, ప్యాకేజీలకు రూ. 1,618 కోట్లు: ఆర్డీవో వంశధార రిజర్వాయర్ పనులు చేసేందుకు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పాటు అన్ని రకాల ఆర్ఆర్ ప్యాకేజీలను చెల్లించేందుకు ప్రభుత్వం రూ.1,618 కోట్లు నిధులు మంజూరు చేసిందని పాలకొండ ఆర్డీవో ఆర్.గున్నయ్య తెలిపారు. నిర్వాసితులకు అన్ని రకాల ప్యాకేజీలను రెండు నెలల్లో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. పనులు చేసేందుకు నిర్వాసితులు సహకరించాలని కోరారు. అలాగే వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులు వంశధార ఎస్ఈ బి.అప్పలనాయుడు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఎం.ఎ.సీతారాంనాయుడు, డీఈలు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, పాతపట్నం, కొత్తూరు, రాజాం, పాలకొండ సీఐలు జె.శ్రీనివాసరావు, కె.అశోక్‌కుమార్, ఎస్.శంకరరావు, వేణుగోపాల్‌తో పాటు హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి, సీతంపేట, కొత్తూరు, వీరఘట్టం ఎస్సైలు, వంశధార ఏఈలు, 85 మంది సివిల్ పోలీసులు, 20 మంది మహిళా పోలీసులు, 25 మందితో కూడిన ప్రత్యేక ఫోర్స్ పాల్గొన్నారు. మార్చి 28 వరకు పోలీసు యాక్టు అమలు హిరమండలంలో ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 28 వరకు నెల రోజుల పాటు పోలీసు యాక్టును అమలు చేస్తున్నట్టు పాలకొండ డీఎస్పీ సి.హెచ్.ఆదినారాయణ చెప్పారు. హిరమండలంలో వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులు పర్యవేక్షణకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. హిరమండలం మండలంలోని నిర్వాసిత గ్రామాలతో పాటు రిజర్వాయర్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో డీఎస్పీ అనుమతి లేకుండా ర్యాలీలు, బహిరంగ సభలు, దీక్షలు, ఊరేగింపులతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
రిజర్వాయర్ పనులను అడ్డుకున్న గ్రామస్తులు
ఎల్‌ఎన్‌పేట (శ్రీకాకుళం జిల్లా) : ఇర మండలం గొట్టా బ్యారేజీ సమీపంలో నిర్మిస్తున్న వంశధార రిజర్వాయర్ పనులను దార్లపాడు గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన సుమారు 100 మంది రిజర్వాయర్ పనులు సాగుతోన్న స్థలానికి వచ్చి పనులను ఆపు చేయించారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు, మిగులు భూములు విషయం, పునరావాస సమస్య తీరే వరకు పనులు మొదలు పెట్టవద్దని కోరారు. ఆ విషయం తేలకుండా పనులు చేపడితే ఊరుకునేది లేదని గ్రామస్తులు అక్కడి అధికారులకు తెలిపారు.