ఎల్.ఎన్.పేట(హిరమండలం):వంశధార రిజర్వాయర్ నిర్మాణం పనులు పోలీసుల నీడలో ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఈ పనులు భారీ బందోబస్తు మధ్య మళ్లీ మొదలు పెట్టారు. హిరమండలం బ్యారేజ్ సెంటర్ వద్ద 40 రోజులుగా చేస్తున్న రిలేనిరాహార దీక్ష శిబిరాన్ని తొలగించిన పోలీసులు శనివారం ఉదయం 11 గంటల సమయంలో వంశధార ఇంజనీరింగ్ అధికారులతో 0 నుంచి 750వ కిలోమీటర్ మధ్యలో రిజర్వాయర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాకే పనులు చేయాలని, అంతవరకు పనులు జరగనీయమని ఆందోళనకు దిగిన నిర్వాసితుల జాడేలేకుండా పోయింది. శుక్రవారం నుంచి హిరమండలంలో పోలీసు బలగాలు మోహరిస్తుండటంతో ఏక్షణంలో ఏమి జరుగుతుందోనని స్థానికులతో పాటు నిర్వాసితులు ఆందోళన చెందారు.
పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణతో పాటు పలువురు సీఐలు, ఎస్సైలు, ప్రత్యేక ఫోర్స్ పోలీసు బలగాలు, మహిళా పోలీసులు అధిక సంఖ్యలో హిరమండలం పోలీసు స్టేషన్‌కు శనివారం ఉదయం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పనులు అడ్డుకునేందుకు నిర్వాసితులు వస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అయితే నిర్వాసితులు ఎవరూ అటువైపుగా రాకపోవడంతో పనులు సాఫీగా జరిగాయి. పోలీసులు, వంశధార, రెవెన్యూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పనులు అడ్డుకుంటే చర్యలు:పాలకొండ డీఎస్పీ
ప్రజల అభ్యున్నతి కోసం జరుగుతున్న వంశధార రిజర్వాయర్ నిర్మాణం పనులు అడ్డుకోవడం మంచిపద్ధతి కాదని, నిర్వాసితులకు పునరావాసం, ప్యాకేజీలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా ఆయా అధికారులకు గాని, తమకు గాని ఫిర్యాదు చేయవచ్చుని పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ అన్నారు. ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పనులు జరిగేందుకు నిర్వాసితులు సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
2017 జూన్‌కి వంశధార నీరు: వంశధార ఎస్‌ఈ
వంశధార రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి 2017 జూన్‌లో ఖరీఫ్ వరికి సాగునీరు అందించడమే లక్ష్యంగా తీసుకున్నామని వంశధార ఎస్‌ఈ బి.అప్పలనాయుడు తెలిపారు. రిజర్వాయర్ పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారని, ఈ మేరకు పునరావాసం, ఆర్‌ఆర్ ప్యాకేజీలకు, నిర్మాణ పనులకు అవసరమైన నిధులు విడుదల చేశారని చెప్పారు. 2017 జూన్ నాటికి సింగిడి రిజర్వాయర్ ద్వారా 2వేల ఎకరాలకు, పారాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 18 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
పనులకు, ప్యాకేజీలకు రూ. 1,618 కోట్లు: ఆర్డీవో
వంశధార రిజర్వాయర్ పనులు చేసేందుకు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పాటు అన్ని రకాల ఆర్‌ఆర్ ప్యాకేజీలను చెల్లించేందుకు ప్రభుత్వం రూ.1,618 కోట్లు నిధులు మంజూరు చేసిందని పాలకొండ ఆర్డీవో ఆర్.గున్నయ్య తెలిపారు. నిర్వాసితులకు అన్ని రకాల ప్యాకేజీలను రెండు నెలల్లో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. పనులు చేసేందుకు నిర్వాసితులు సహకరించాలని కోరారు.
అలాగే వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులు వంశధార ఎస్‌ఈ బి.అప్పలనాయుడు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఎం.ఎ.సీతారాంనాయుడు, డీఈలు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, పాతపట్నం, కొత్తూరు, రాజాం, పాలకొండ సీఐలు జె.శ్రీనివాసరావు, కె.అశోక్‌కుమార్, ఎస్.శంకరరావు, వేణుగోపాల్‌తో పాటు హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి, సీతంపేట, కొత్తూరు, వీరఘట్టం ఎస్సైలు, వంశధార ఏఈలు, 85 మంది సివిల్ పోలీసులు, 20 మంది మహిళా పోలీసులు, 25 మందితో కూడిన ప్రత్యేక ఫోర్స్ పాల్గొన్నారు.
మార్చి 28 వరకు పోలీసు యాక్టు అమలు
హిరమండలంలో ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 28 వరకు నెల రోజుల పాటు పోలీసు యాక్టును అమలు చేస్తున్నట్టు పాలకొండ డీఎస్పీ సి.హెచ్.ఆదినారాయణ చెప్పారు. హిరమండలంలో వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులు పర్యవేక్షణకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. హిరమండలం మండలంలోని నిర్వాసిత గ్రామాలతో పాటు రిజర్వాయర్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో డీఎస్పీ అనుమతి లేకుండా ర్యాలీలు, బహిరంగ సభలు, దీక్షలు, ఊరేగింపులతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పోలీసుల నీడలో...
Published Sun, Feb 28 2016 1:07 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement