సాక్షి, అమరావతి: వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) తుది నివేదికపై ఒడిశా అభ్యంతరాలను కేంద్రం తోసిపుచ్చింది. నివేదికపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు సమన్యాయం చేస్తూ వంశధార జలాలను పంపిణీ చేసినందున ట్రిబ్యునల్ గడువు పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. దాంతో వంశధార ట్రిబ్యునల్‌ను రద్దు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
2017 సెప్టెంబరు 13న ట్రిబ్యునల్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక, 2021 జూన్ 21న ఇచ్చిన తుది నివేదికలను సవాలు చేస్తూ ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ)లు దాఖలు చేసింది. సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోవడంతో తుది నివేదిక అమలుకు కేంద్రం సిద్ధమైంది.
అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ) చట్టం–1956 సెక్షన్–6(1) ప్రకారం ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేసేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ వారంలోగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. తుది నివేదిక అమల్లోకి వస్తే.. ఏపీ, ఒడిశాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది.
సమన్యాయం చేసిన ట్రిబ్యునల్
వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మించి వంశధార ఫేజ్–1 కింద 21 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 45 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరందించి శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసే పనులకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 ఫిబ్రవరి 25న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుపై ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేసింది. వంశధార జలాల పంపిణీకి ట్రిబ్యునల్‌ను నియమించాలని కేంద్రాన్ని పట్టుబట్టింది.
దీంతో నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ నిర్మించేలా మహానేత వైఎస్ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చారు. పనులు కూడా చేపట్టారు. ఒడిశా ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం 2010లో వంశధార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఏడేళ్లపాటు సుదీర్ఘంగా విచారించిన ట్రిబ్యునల్.. 2017 సెప్టెంబరు 13న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఒడిశా, ఏపీ ప్రభుత్వాలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని 2021 జూన్ 21న తుది నివేదిక ఇచ్చింది.
తుది నివేదిక ప్రకారం
► వంశధారలో 75 శాతం లభ్యతగా ఉన్న 115 టీఎంసీల్లో చెరి సగం (57.5 టీఎంసీలు) చొప్పున రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసింది.
► నేరడి బ్యారేజీ వల్ల ఒడిశాలో ముంపునకు గురయ్యే 106 ఎకరాలను ఆ ప్రభుత్వం సేకరించి ఏపీకి అప్పగించాలి. ఇందుకు ఏపీ పరిహారం చెల్లించాలి.
► నేరడి బ్యారేజీ కుడి వైపున ఏపీ, ఎడమ వైపున ఒడిశా కాలువలు తవ్వుకుని ఆయకట్టుకు నీళ్లందించుకోవచ్చు. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో రెండు రాష్ట్రాలు భరించాలి.
► నేరడి బ్యారేజీ నిర్మించాక కాట్రగడ్డ సైడ్ వియర్‌ను తొలగించాలి.
► దీన్ని అమలు చేయడానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సీఈ అధ్యక్షతన రెండు రాష్ట్రాల అధికారులు సభ్యులుగా అంతర్రాష్ట్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి.
ఫలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రయత్నాలు..:
వంశధార ట్రిబ్యునల్ తుది నివేదిక అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు సస్యశ్యామలం చేయవచ్చునని సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలోనే ట్రిబ్యునల్ ప్రాథమిక నివేదికను అమలు చేయాలంటూ 2019 జూన్ 27న, తుది నివేదికను అమలు చేయాలంటూ 2021 సెప్టెంబరు 28న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సీఎం జగన్ లేఖలు రాశారు. ట్రిబ్యునల్ తుది నివేదిక అమలుకు సహకరించాలని, రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని 2021 ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశారు.
ఇదే అంశంపై చర్చించేందుకు ఒడిశా సీఎం ఆహ్వానం మేరకు గతేడాది నవంబర్ 3న సీఎం జగన్ భువనేశ్వర్ వెళ్లారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి షెకావత్‌తో సమావేశమైన సందర్భంలోనూ ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వైఎస్ జగన్ కృషి ఫలితంగానే వంశధార తుది నివేదిక అమలుకు కేంద్రం కసరత్తు ప్రారంభించిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment