నేడు వనంలోకి వనదేవతలు
సాక్షి, మేడారం: మూడు రోజులుగా తీరొక్క మొక్కులు అందుకున్న వన దేవతలు శనివారం వనప్రవేశం చేయనున్నారు. జాతరలో చివరి అంకమైన ఈ ఘట్టం శని వారం సాయంత్రం జరగనుండగా, గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజారులు జరిపిస్తారు. నలుగురు దేవతల పూజారులు గద్దెల వద్ద పూజలు చేస్తారు. అనంతరం సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం సమీపంలోని చిలకలగుట్టపైకి తీసుకువెళతారు. ఈ సమయంలో గద్దెల వద్ద ఉన్న భక్తులకే వనప్రవేశాన్ని చూసే వీలుంటుంది. ఆలయం దాటిన తర్వాత బయట వారినెవరినీ రానివ్వరు. అందుకే ఈలోగానే అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని భక్తులు భారీగా వస్తున్నారు.
19న తిరుగువారం: సమ్మక్క-సారలమ్మ తిరుగువారం పండగను ఫిబ్రవరి 19న గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా దేవతలను దుమ్ముకాళ్లతో తీసుకువచ్చినందుకు, పూజల్లో తప్పిదాలు జరిగితే మన్నించాలని వేడుకుంటూ ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. తిరుగువారం రోజున సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గుళ్లను, గద్దెలను శుభ్రం చేస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మేకలను దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో మేడారం మహా వన జాతర ముగుస్తుంది.