వంశధార రిజర్వాయర్ కోసం భూములిచ్చి.. నిర్వాసితులైన వారు సహనం కోల్పోయారు. తమకు పునరావాసం కల్పించకుండా, ఆర్.ఆర్. ప్యాకేజీ ఇవ్వకుండా పనులు చేపడుతుండడంపై ఆగ్రహించారు. తమకు న్యాయం చేయాలని..తరువాతే పనులు చేపట్టాలంటూ ఆదివారం ఆందోళనకు దిగారు. నీడ కోసం పోలీసులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు, కుర్చీలకు నిప్పుపెట్టారు. హిరమండలం మండల తహశీల్దార్‌పై దాడికి దిగారు. బస్సులను సైతం అడ్డుకున్నారు. రైతులు, వృద్ధులు, మహిళలు, యువకులు భారీగా తరలిరావడంతో హిరమండలం మండలం.. గొట్టా బ్యారేజ్ జంక్షన్ రణరంగంగా మారింది. పోలీసులు, కలెక్టర్, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు సంయమనం పాటించడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
ఎల్.ఎన్.పేట(హిరమండలం): పోలీసుల నీడలో శనివా రం ప్రారంభించిన వంశధార రిజర్వాయర్ నిర్మాణం పనులను నిలిపి వేయాలంటూ హిరమండలం మండలంలోని పలు గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఆదివారం గొట్టా బ్యారేజ్ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. వేలాది మంది తరలిరావడంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నిర్వాసితులు రిజర్వాయర్ పనులు అడ్డుకోవడంతో పాటు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడతారని ముందుగానే తెలుసుకున్న పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ తన సిబ్బందితో అన్ని నిర్వాసిత గ్రామాలకు ఆదివారం తెల్లవారు జామున ఐదు నుంచి పది గంటల వరకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఆందోళనలు వద్దని కోరారు. అయినప్పటికీ ఉదయం 11 గంటల సమాయానికి పాడలి, తులగాం, గార్లాపాడు, దుగ్గుపురం, బర్రిపేట, చిన్నసంకిలి, పెద్దసంకిలి, బ్యారేజ్ సెంటర్, హిరమండలం, చిన్నకొల్లివలస, భీమవరం, సోలిపిలతో పాటు కొత్తూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలు, యువకులు, వృద్ధులు భారీగా పాడలి, తులగాం వెళ్లేదారిలోని పామాయిల్ తోట వద్దకు చేరుకున్నారు.
అక్కడి నుంచి మిరపకాయల కారం, కర్రలు చేతపట్టుకుని వంశధార రిజర్వాయర్ వద్ద 0 నుంచి 750వ కిలోమీటరు వద్ద జరుగుతున్న పనుల వద్దకు చేరుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో శనివారం జరిగిన పనులను ఆదివారం ఉదయానికే పోలీసులు ఆపించేసి.. యంత్రాలను తరలించేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్, స్థానిక తహశీల్దారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పనులు చేపట్టిన ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే ముగ్గురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 11 మంది ఎస్సైలతో పాటు రెండు స్పషల్ పార్టీ పోలీసులు, 20 మంది మహిళా పోలీసులు, 100 మంది సివిల్ పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారు. ఈ సమయంలో భారీగా పోలీసులు ఉండడం, నిర్వాసితులు కూడా ఎక్కువగానే ఉండడంతో ఏం జరుగుతుందోనని ఆందరూ ఆందోళన చెందారు. అయితే పోలీసులు సంయమనంగా వ్యవహరించి నిర్వాసితులను శాంతింప చేశారు.
టెంట్లు, కుర్చీలు దగ్ధం
నీడ కోసం పోలీసులు వేసుకున్న టెంట్‌లు, కుర్చీలకు నిప్పు పెట్టాలని నిర్వాసితులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని వారించారు. అయితే పోలీసులు వెళ్లిపోయిన వెంటనే కొంతమంది నిర్వాసితులు వాటికి నిప్పు పెట్టారు.
తహశీల్దార్‌పై దాడి!
ఆందోళన జరుగుతున్న ప్రాంతంలో ఉన్న పాలకొండ ఆర్డీవో ఆర్.గున్నయ్య, హిరమండలం తహశీల్దారు జె.రామారావులతో పలువురు నిర్వాసితులు వాదనకు దిగారు. తమకు అన్యాయం చేస్తున్నారని, కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఒకదశలో హిరమండలం తహశీల్దారు జె.రామారావుపై దాడికి దిగారు. పోలీసులు వలయంలా ఏర్పడి ఆతన్ని ఆక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు తరలించారు. అయినప్పటికీ దుర్భాషలాడుతూ తహశీల్దారుకు శాపనార్థాలు పెట్టారు.
బస్సుకు నిప్పంటించేందుకు యత్నం
ఆందోళన చేస్తున్న నిర్వాసితులు గుంపులు గుంపులుగా విడిపోయారు. సమీపంలో ఉన్న బ్యారేజ్ కూడలి వద్దకు చేరుకుని అలికాం-బత్తిలి రోడ్డుపై వచ్చిన ఆర్టీసీ బస్సులపై దాడిచేసి చేశారు. మరికొందరు నిప్పు పెట్టాలని భావించినప్పటికీ.. నిర్వాసితుల్లో కొందరు ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేయడం సరైనది కాదని, మన నిరసన మరో విధంగా తెలియజేద్దామని చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. అక్కడే ఉన్న పాతపట్నం సీఐ జె.శ్రీనివాసరావుతో పాటు పలువురు పోలీసులు కూడా నిర్వాసితులను శాంతిపజేశారు.
వంశధార ఉద్యోగులుంటే..
ఆందోళనకారులు వచ్చే సమయంలో వంశధార ఇంజినీరింగు అధికారులు, పనులు చేస్తున్న కాంట్రాక్టరుకు సంబంధించిన మనుషులు, యంత్రాలు ఉంటే పోలీసులు వారించినా దాడి తప్పేది కాదని నిర్వాసితులే చెపుతున్నారు. పని జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న రెండు పొక్లయినర్లను కాల్చేందుకు నిర్వాసితులు ప్రయత్నాలు చేశారు. పాలకొండ డీఎస్పీ ఆదినారాయణతో పాటు విధుల్లో ఉన్న సీఐలు, ఎస్సైలు వారిని శాంతింప చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరూ ఆందోళన చెందినప్పటికీ పోలీసులు సంయమనం పాటించడంతో పరిస్థితులు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
శాంతిభద్రతల దృష్ట్యా పనులు నిలుపుదల : డీఎస్పీ ఆదినారాయణ
హిరమండలం(ఎల్.ఎన్.పేట): వంశధార రిజర్వాయర్ పనులు చేపట్టడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుండడంతో కొన్ని రోజుల పాటు పనులు నిలుపుదల చేయాలని కాంట్రాక్టర్లకు సూచించామని పాలకొండ డీఎస్పీ సీహెచ్.ఆదినారాయణ చెప్పారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణంలో నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్‌ఆర్ ప్యాకేజీలతో పాటు పునరావాసం కల్పించాకే పనులు చేపడితే ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు.
ఆగ్రహ‘ధార’!
Published Mon, Feb 29 2016 12:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement