hiramandalam
-
హిరమండలం ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో వంశధార ఫేజ్–2, స్టేజ్–2 ఆయకట్టు రైతులకు ముందస్తు ఫలాలను అందించడం.. ఫేజ్–1 స్టేజ్–2 ఆయకట్టు, నారాయణపురం ఆనకట్ట ఆయకట్టును స్థిరీకరించడం, ఉద్దానం ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా హిరమండలం ఎత్తిపోతలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడానికి రూ.176.35 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ బుధవారం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వంశధార నదిలో గొట్టా బ్యారేజ్ వద్ద నీటి లభ్యతపై 2007 ఆగస్టులో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మళ్లీ అధ్యయనం చేసింది. ఇందులో గొట్టా బ్యారేజ్ వద్ద 105 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. ఇందులో రాష్ట్ర వాటా 52.5 టీఎంసీలు. వంశధార స్టేజ్–1, స్టేజ్–2ల ద్వారా 34.611 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వాటాలో ఇంకా 17.439 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశం ఉంది. ఆ నీటిని వాడుకోవడానికి వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను జలయజ్ఞంలో భాగంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ ప్రాజెక్టుపై ఒడిశా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. నేరడి బ్యారేజ్ స్థానంలో కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్‌ను నిర్మించి.. వరద కాలువ ద్వారా హిరమండలం రిజర్వాయర్ (19.5 టీఎంసీల సామర్థ్యం)కు మళ్లించి.. వంశధార పాత ఆయకట్టు 2,10,510 ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించే పనులను చేపట్టారు. సైడ్ వియర్ వల్ల ఎనిమిది టీఎంసీలను మాత్రమే హిరమండలం రిజర్వాయర్‌కు తరలించవచ్చు. గొట్టా బ్యారేజ్ నుంచి కుడికాలువ మీదుగా.. నేరడి బ్యారేజ్‌కు వంశధార ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ.. ట్రిబ్యునల్ తీర్పుపై ఒడిశా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దాన్ని కేంద్రం నోటిఫై చేయలేదు. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా సర్కార్‌ను ఒప్పించడం కోసం భువనేశ్వర్ వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో దౌత్యం జరిపారు. ఓ వైపు నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రాజెక్టు ముందస్తు ఫలాలను అందించడం కోసం గొట్టా బ్యారేజ్ నుంచి రోజుకు 1,400 క్యూసెక్కుల చొప్పున వందరోజుల్లో 10 నుంచి 14 టీఎంసీలను తరలించేలా ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ప్రతిపాదనలు పంపాలని మే 10న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గొట్టా బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతం నుంచి 1,400 క్యూసెక్కులను 650 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి.. వంశధార కుడికాలువలో 2.4 కిలోమీటర్ల వద్దకు ఎత్తిపోస్తారు. ఈ నీటిని హిరమండలం రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా 2.5 కిలోమీటర్ల పొడవున కుడికాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,265 క్యూసెక్కులకు పెంచుతారు. వందరోజుల్లో 10 నుంచి 12 టీఎంసీలను హిరమండలం రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. తద్వారా వంశధారలో వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని వంశధార స్టేజ్–1, స్టేజ్–2ల కింద 2,55,510 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు వంశధార–నాగావళి అనుసంధానం ద్వారా నారాయణపురం ఆనకట్ట కింద ఉన్న 37 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానానికి తాగునీటి కోసం 0.712 టీఎంసీలను సరఫరా చేస్తారు. -
చచ్చిపోతానని చెప్పి..ప్రాణం తీసుకున్నాడు..
శ్రీకాకుళం(హిరమండలం): చచ్చిపోతానని బంధువులకు ఫోన్లో చెప్పిన కొద్దిసేపటికే ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలుమూరు మండలం పర్లాం మాకివలస గ్రామానికి చెందిన అల్లు చిట్టిబాబు(35) మూడు నెలలుగా హిరమండలం మేజర్ పంచాయితీలోని పాతహిరమండలంలో గృహాన్ని అద్దెకు తీసుకొని ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరి దంపతుల మధ్య కొద్ది నెలలుగా వివాదం ఉంది. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట భార్య, పిల్లను కన్నవారి ఇంటికి పంపించేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని శుక్రవారం రాత్రి బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన వారు.. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు శనివారం ఉదయం వెళ్లి చూడగా.. గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. స్థానిక ఎస్సై ఎం.మధుసూదనరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. చదవండి: (బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..) -
మా పొట్ట కొట్టొద్దు
హిరమండలం: వంశధార నిర్వాసితులు మరోమారు అధికారులకు ఎదురెళ్లారు. కడుపు నింపుతున్న పొలాలను తవ్వే పనులు చేయవద్దని హెచ్చరించారు. చేసిన త్యాగాలను మర్చిపోయి కడుపు కొట్టే చర్యలు తీసుకోవద్దని వేడుకున్నారు. నాయకుల పొలాలు వదిలేసి పేదల పంటలను ధ్వంసం చేయడం తగదని సూటిగా చురకలంటించారు. తులగాం రెవెన్యూ పరిధిలో వంశధార రిజర్వాయర్ గట్టు నిర్మాణానికి మట్టి సేకరించేందుకు అధికారులు రెండు రోజులుగా పంట పొలాలను నాశనం చేస్తున్నారు. ఇందులో భాగంగా తులగాం గ్రామ సమీపంలో నాట్లు వేసిన పంట పొలాలను మంగళవారం యం త్రాలతో ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న తులగాం నిర్వాసితులు ఒక్కసారిగా పొలాల వద్దకు వచ్చి తామంతా పేదలమని, పొట్టకూటి కోసం రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నామన్నారు. పోలీసులు, వంశధార అధికారులు తమ భూముల్లో ఉన్న వరి నాట్లను ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. తమ పక్కనే ఉన్న నాయకుల భూముల్లో నాట్లు ఉన్నా వాటిని ఎందుకు పాడు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. అన్ని భూముల నుంచి క్రమేపీ మట్టిని సేకరిస్తామని అధికారులు నచ్చజెప్పుతూ పక్కనే ఉన్న పలువురి నాయకుల భూముల్లో వరినాట్లు నాశనం చేసి మట్టి తవ్వారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, తహసీల్దార్లకు తెలియజేశారు. నిర్వాసితులతో అధికారుల చర్చలు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్య, తహసీల్దార్ కాళీప్రసాద్ ఈఈ సీతారాం నాయుడు, సీఐ ప్రకాష్‌లు నిర్వాసిత గ్రామాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పంట ఉన్న పొలా లను విడిచి పెట్టాలని నాట్లు వేయని ఖాళీగా ఉన్న పొలా ల్లో మట్టి సేకరణ చేసుకోవచ్చునని నిర్వాసితులు తెలి పారు. అలాగే తులగాంకు చెందిన నాయకుడు మాట్లాడుతూ తులగాం రెవెన్యూ పరిధిలో సుమారు 900 ఎకరాల విస్తీర్ణం ఉందని ఇందులో సుమారు 750 ఎకరాలు విస్తీర్ణంలో గట్టు నిర్మాణానికి మట్టి సేకరించారని మిగి లిన గ్రామాల్లో ఒక్క ఎకరా విస్తీర్ణంలో మట్టి సేకరించలేదని ఆ గ్రామాలకు వెళ్లి మట్టి సేకరించుకోవాలని తెలిపారు. దీంతో ఈఈ మాట్లాడుతూ ప్రస్తుతానికి అన్ని గ్రామాల్లో కూడా మట్టి సేకరణ చేస్తామని తెలిపారు. అయితే పంట భూముల్లో మట్టి సేకరిస్తే ఊరుకొనేది లేదని ఖాళీ ప్రదేశాల్లో సేకరించుకోవాలని నిర్వాసితులు తెలపడంతో... నాట్లు వేయవద్దని సూచించినా వేశారని ఖాళీ పొలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని వంశధార అధికారులు అడిగారు. దీనికి నిర్వాసితులు ఆగ్రహం చెంది సమస్యలు పరిష్కరించాకే పనులు చేయాలని తేల్చి చెప్పారు. దీంతో ఆర్డీవో సమస్యలు తెలపాలంటూ నిర్వాసిత నాయకులను అడిగి తెలుసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న భూముల నుంచి మట్టి సేకరించేందుకు తులగాం పరిసరాలకు చేరుకున్నారు. అక్కడ పనులు జరిగేందుకు మరిన్ని యంత్రాలు తే వాలని అందరి భూములను చదును చేయాలని కాం ట్రాక్టర్లను ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న తులగాం నిర్వాసితులు మరికొందరు మళ్లీ అధికారులను అ డ్డుకున్నారు. ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసి తమ డి మాండ్లను ఏకరువు పెట్టారు. దీంతో పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సాయంత్రం కావడంతో అధికారులు పనులను ఆపి యంత్రాలను తరలించారు. దీంతో నిర్వాసితులు వెనుదిరిగారు. -
పెరుగుతూ..తగ్గుతూ..!
హిరమండలం: ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వంశధార నదిలో వరద మంగళవారం రోజంతా పెరుగుతూ.. తగ్గుతూ పరవళ్లు తొక్కింది. గొట్టా బ్యారేజీ వద్ద ఉదయానికి 41,221 క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి ప్రమాదపు హెచ్చరికను జారీ చేశారు. అయితే ఆ తరువాత ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. మధ్యాహ్నం సయామానికి 36,300 క్యూసెక్కులకు, సాయంత్రానికి 30,740 క్యూసెక్కులకు చేరింది. ఈ నీటిని 22 గేట్ల ద్వారా బయటకు విడిచి పెడుతున్నట్లు ప్రాజెక్టు డీఈ ప్రభాకర్ తెలిపారు. కాగా ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో మంగళవారం మధ్యాహ్నం12 గంటల వరకు 256.26 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వంశధారలో వరద ప్రవాహం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సాయాంత్రానికి కుట్రగూడ వద్ద 25.8 మిల్లి మీటర్లు, గుడారి వద్ద 51.6 మి.మీ, మోహన్ వద్ద 26.8 మి.మీ, గుణుపూర్‌లో 61 మి.మీ, మహేంద్రగడ వద్ద 51.6 మి.మీ, కాశీనగర్ వద్ద 36 మి.మీ, గొట్టా వద్ద 36 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. నదీ తీర గ్రామాల్లో అప్రమత్తం వంశధారలో మంగళవారం ఉదయం వరద నీటి ప్రవాహం పెరిగి మొదటి ప్రమాద హెచ్చరికను దాటడంతో నదీ పరివాహక గ్రామాల్లో రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. గొట్టా బ్యారేజీ కార్యాలయానికి వెళ్లి వరదనీటి పరిస్థితి, ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో నమోదైన వర్షపాతం గురించి అడిగి తెలుసుకున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో 14 మందికి తీవ్ర గాయాలు
ఆగిఉన్న ఆటోను ఢీకొన్న వ్యాను హిరమండలం:అవలంగి గ్రామం సమీపంలో ఆగిఉన్న ఆటోను వ్యాను ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం హిరమండలం నుంచి పాతపట్నం వైపు ప్రయాణికులతో వెళుతున్న ఆటో అవలంగి గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యాన్‌కు సైడ్ ఇవ్వడానికి డ్రైవర్ ఆపాడు. ఆగిఉన్న ఆటోను వ్యాన్ ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఆటోలో ఉన్న డ్రైవర్ చొడి చిన్నారావు, కోటబొమ్మాళి మండలానికి చెందిన శిల్లా కరుణాకరరావు, మొయిలి నారాయణరావు, సుభలయ ఆర్ఆర్ కాలనీకి చెందిన బి.కొండమ్మ, ఈగ ధనలక్ష్మి, నీలమ్మ, కొండరాగోలుకు చెందిన సాదు శివ, హిరమండలంనకు చెందిన బోయిన కృష్ణారావు, పద్మావతికి తీవ్రగాయాలయ్యారుు. వీరిని హిరమండలం పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పాతపట్నం, శ్రీకాకుళం తరలించారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ కె.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘దేశం’లో దెబ్బలాట
హిరమండలం: హిరమండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. సోమవారం మండల పరిషత్ కార్యాలయం వేదికగా నేతలు వాగ్వాదానికి దిగారు. మండలంలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న మండల ఇంజినీర్ బి.కూర్మనాథరావుపై విచారణ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పంచాయతీ రాజ్ ఏఈ సీసీ రహదారులు అంచనా వేసే సమయంలోనూ, బిల్లుల చెల్లింపుల్లో అవినీతికి పాల్పడుతున్నాడని కొంతమంది టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పాతపట్నం సబ్ డివిజన్ డీఈ జి.ప్రదీప్‌కుమార్ విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సమయంలో టీడీపీలోని రెండు వర్గాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వైస్ ఎంపీపీ నక్క వెంకటరావు, అక్కరాపల్లి సర్పంచ్ గోళ్ల సింహాచలంతో పాటు మరికొంతమంది ప్రజా ప్రతినిధులు మరో వర్గానికి చెందిన రుగడ సర్పంచ్ లోలుగు లక్ష్మణరావు, అంబావల్లి నీటిసంఘం అధ్యక్షుడు సీహెచ్ శ్రీరామూర్తితోపాటు మరికొందరితో వాగ్వాదానికి దిగారు. కొందరు ఏఈని బదిలీ చేయాలని కోరగా, మరికొందరు ఇక్కడే ఉంచాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏఈపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని, నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గార రమణమ్మ, సూపరింటెండెంట్ కాశీ విశ్వనాధం తదితరులు ఉన్నారు. -
మా కన్నీరు కనిపించదా..?
ఎల్.ఎన్.పేట, హిరమండలం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంశధార నిర్వాసితులపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే వారి మాట మరిచిపోయారు. ఆయన మాటలు నమ్మినందుకు వేలాది మంది వంశధారలో మునిగిపోతున్నారు. వంశధార నదిలో వథాగా పోతున్న వరద నీటిని ఒడిసి పట్టి జిల్లా ప్రజల అవసరాలకు సాగు, తాగునీరు అందించేందుకు 2005 ఏప్రిల్ నెలలో జిల్లాలోని హిరమండలం వద్ద 19టిఎంసీల నీటి నిల్వ కోసం సుమారు 10వేల ఎకరాల్లో చేపట్టిన వంశధార రిజర్వాయర్ పనుల్లో 13 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలో ఉండిపోతున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన 7100 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. వీరికి సకల సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించడంతో పాటు ఆర్ఆర్ ప్యాకేజీలు చెల్లించాలి. కానీ భూములు తీసుకున్నంత శ్రద్ధగా వారి సంక్షేమం చూడలేకపోతున్నారు. రిజర్వాయర్ పనులకు ఇస్తున్న ప్రాధాన్యం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదని వారు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా హిరమండలం బ్యారేజ్ కూడలి వద్ద ఈ ఏడాది జనవరి 20వ తేదీన రిలేనిరాహార దీక్షలకు దిగారు. దీక్షలు ప్రారంభించి శుక్రవారానికి వంద రోజులైనా ప్రభుత్వం స్పందించలేదు. ఇది తమ బాధలు, తమ కన్నీటికి జరుగుతున్న అవమానమని నిర్వాసితులు వాపోతున్నారు. వంద రోజుల రిలే నిరాహార దీక్షలో ప్రభుత్వం నుంచి పోలీసుల వరకు ఎన్నో అడ్డంకులను స్థానికులు ఎదుర్కొన్నామని, అయినా పోరాటం మానలేదని నిర్వాసిత పోరాట కమిటీ నాయకులు గంగరాపు సింహాచలం చెప్పారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు. నిర్వాసితుల డిమాండ్లు ఇవీ.. నిర్వాసితులు కోరిన చోట ఐదు సెంట్లు ఇళ్ల స్థలంతో పాటు సకల సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించాలి. 2005లో పనులు ప్రారంభించినప్పటికీ నిర్వాసితులకు ఇప్పటికీ ఆర్ఆర్ ప్యాకేజీలు వర్తింపజేయలేదు. కాబట్టి 2013 భూసేకరణ చట్టాన్ని వంశధార నిర్వాసితులకు అమలు చేయాలి. రిజర్వాయర్ నీటిలో మునిగిపోతున్న ఇరపాడు, పాడలి, దుగ్గుపురం, తులగాం, బ్యారేజ్ సెంటర్, హిరమండలం (కొంతభాగం), గార్లపాడు, చిన్నకొల్లివలస, చిన్నసంకిలి, పెద్దసంకిలి, సోలిపి తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులు కోరిన చోట పునరావాసం కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. 2015 డిసెంబర్ నెలాఖరు నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ,యువకులకు ఆర్ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలి. రిజర్వాయర్ నిర్మాణం కోసం పదేళ్ల క్రితం (2005) నిర్ణయించిన అంచనాలు పెంచుతున్నట్లే నిర్వాసితుల ప్యాకేజీలు పెంచాలి. ఇరపాడు, దుగ్గుపురం, పాడలి, తులగాం, గార్లపాడు, సోలిపి, చిన్నసంకిలి, గదబపేట తదితర గ్రామాల్లో ఇళ్లకు, దేవాలయాలకు కొత్త రేట్లు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. గూనబద్రకాలనీ, దబ్బగూడ గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించివారికి పునరావాసం కల్పించాలి. పాడలి, దుగ్గుపురం, పెద్దసంకిలి గ్రామాల్లో వ్యవసాయం చేసేందుకు వీలు లేకుండా ఉన్న మిగిలు భూములకు నష్టపరిహారం చెల్లించాలి. డి.పట్టా భూములకు జిరాయితీ భూములు మాదిరిగానే పరిహారం ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారితో పాటు ఇంకా ఇళ్లు కట్టుకోవడానికి మిగిలిన వారికి కూడా ఐఏవై ఇళ్లును అనుసంధానం చేయాలి. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసిత గ్రామాలకు చెందిన యువతకు రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేక కోటా కేటాయించాలి. నిర్వాసితులందరూ భూములు కోల్పోయినందున ఐఏవై కార్డులు, నెలకు రూ.2వేలు పింఛను ఇవ్వాలి. కులవత్తులవారికి వత్తిప్యాకేజీ వెంటనే చెల్లించాలి. -
హిరమండలంలో ఏనుగుల బీభత్సం
హిరమండలం (శ్రీకాకుళం జిల్లా) : హిరమండలంలో ఏనుగులు సోమవారం రాత్రి బీభత్సం సృష్టించాయి. ఎగువరుగడ, ఈతలగూడ, కొమనాపల్లి గ్రామాల్లో ఏనుగులు దాడి చేసి ఆరు ఇళ్లను, 3 పశువుల పాకలను ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. -
ఆగ్రహ‘ధార’!
వంశధార రిజర్వాయర్ కోసం భూములిచ్చి.. నిర్వాసితులైన వారు సహనం కోల్పోయారు. తమకు పునరావాసం కల్పించకుండా, ఆర్.ఆర్. ప్యాకేజీ ఇవ్వకుండా పనులు చేపడుతుండడంపై ఆగ్రహించారు. తమకు న్యాయం చేయాలని..తరువాతే పనులు చేపట్టాలంటూ ఆదివారం ఆందోళనకు దిగారు. నీడ కోసం పోలీసులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు, కుర్చీలకు నిప్పుపెట్టారు. హిరమండలం మండల తహశీల్దార్‌పై దాడికి దిగారు. బస్సులను సైతం అడ్డుకున్నారు. రైతులు, వృద్ధులు, మహిళలు, యువకులు భారీగా తరలిరావడంతో హిరమండలం మండలం.. గొట్టా బ్యారేజ్ జంక్షన్ రణరంగంగా మారింది. పోలీసులు, కలెక్టర్, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు సంయమనం పాటించడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఎల్.ఎన్.పేట(హిరమండలం): పోలీసుల నీడలో శనివా రం ప్రారంభించిన వంశధార రిజర్వాయర్ నిర్మాణం పనులను నిలిపి వేయాలంటూ హిరమండలం మండలంలోని పలు గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఆదివారం గొట్టా బ్యారేజ్ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. వేలాది మంది తరలిరావడంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నిర్వాసితులు రిజర్వాయర్ పనులు అడ్డుకోవడంతో పాటు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడతారని ముందుగానే తెలుసుకున్న పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ తన సిబ్బందితో అన్ని నిర్వాసిత గ్రామాలకు ఆదివారం తెల్లవారు జామున ఐదు నుంచి పది గంటల వరకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఆందోళనలు వద్దని కోరారు. అయినప్పటికీ ఉదయం 11 గంటల సమాయానికి పాడలి, తులగాం, గార్లాపాడు, దుగ్గుపురం, బర్రిపేట, చిన్నసంకిలి, పెద్దసంకిలి, బ్యారేజ్ సెంటర్, హిరమండలం, చిన్నకొల్లివలస, భీమవరం, సోలిపిలతో పాటు కొత్తూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలు, యువకులు, వృద్ధులు భారీగా పాడలి, తులగాం వెళ్లేదారిలోని పామాయిల్ తోట వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మిరపకాయల కారం, కర్రలు చేతపట్టుకుని వంశధార రిజర్వాయర్ వద్ద 0 నుంచి 750వ కిలోమీటరు వద్ద జరుగుతున్న పనుల వద్దకు చేరుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో శనివారం జరిగిన పనులను ఆదివారం ఉదయానికే పోలీసులు ఆపించేసి.. యంత్రాలను తరలించేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్, స్థానిక తహశీల్దారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పనులు చేపట్టిన ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే ముగ్గురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 11 మంది ఎస్సైలతో పాటు రెండు స్పషల్ పార్టీ పోలీసులు, 20 మంది మహిళా పోలీసులు, 100 మంది సివిల్ పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారు. ఈ సమయంలో భారీగా పోలీసులు ఉండడం, నిర్వాసితులు కూడా ఎక్కువగానే ఉండడంతో ఏం జరుగుతుందోనని ఆందరూ ఆందోళన చెందారు. అయితే పోలీసులు సంయమనంగా వ్యవహరించి నిర్వాసితులను శాంతింప చేశారు. టెంట్లు, కుర్చీలు దగ్ధం నీడ కోసం పోలీసులు వేసుకున్న టెంట్లు, కుర్చీలకు నిప్పు పెట్టాలని నిర్వాసితులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని వారించారు. అయితే పోలీసులు వెళ్లిపోయిన వెంటనే కొంతమంది నిర్వాసితులు వాటికి నిప్పు పెట్టారు. తహశీల్దార్‌పై దాడి! ఆందోళన జరుగుతున్న ప్రాంతంలో ఉన్న పాలకొండ ఆర్డీవో ఆర్.గున్నయ్య, హిరమండలం తహశీల్దారు జె.రామారావులతో పలువురు నిర్వాసితులు వాదనకు దిగారు. తమకు అన్యాయం చేస్తున్నారని, కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఒకదశలో హిరమండలం తహశీల్దారు జె.రామారావుపై దాడికి దిగారు. పోలీసులు వలయంలా ఏర్పడి ఆతన్ని ఆక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు తరలించారు. అయినప్పటికీ దుర్భాషలాడుతూ తహశీల్దారుకు శాపనార్థాలు పెట్టారు. బస్సుకు నిప్పంటించేందుకు యత్నం ఆందోళన చేస్తున్న నిర్వాసితులు గుంపులు గుంపులుగా విడిపోయారు. సమీపంలో ఉన్న బ్యారేజ్ కూడలి వద్దకు చేరుకుని అలికాం-బత్తిలి రోడ్డుపై వచ్చిన ఆర్టీసీ బస్సులపై దాడిచేసి చేశారు. మరికొందరు నిప్పు పెట్టాలని భావించినప్పటికీ.. నిర్వాసితుల్లో కొందరు ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేయడం సరైనది కాదని, మన నిరసన మరో విధంగా తెలియజేద్దామని చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. అక్కడే ఉన్న పాతపట్నం సీఐ జె.శ్రీనివాసరావుతో పాటు పలువురు పోలీసులు కూడా నిర్వాసితులను శాంతిపజేశారు. వంశధార ఉద్యోగులుంటే.. ఆందోళనకారులు వచ్చే సమయంలో వంశధార ఇంజినీరింగు అధికారులు, పనులు చేస్తున్న కాంట్రాక్టరుకు సంబంధించిన మనుషులు, యంత్రాలు ఉంటే పోలీసులు వారించినా దాడి తప్పేది కాదని నిర్వాసితులే చెపుతున్నారు. పని జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న రెండు పొక్లయినర్లను కాల్చేందుకు నిర్వాసితులు ప్రయత్నాలు చేశారు. పాలకొండ డీఎస్పీ ఆదినారాయణతో పాటు విధుల్లో ఉన్న సీఐలు, ఎస్సైలు వారిని శాంతింప చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరూ ఆందోళన చెందినప్పటికీ పోలీసులు సంయమనం పాటించడంతో పరిస్థితులు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పనులు నిలుపుదల : డీఎస్పీ ఆదినారాయణ హిరమండలం(ఎల్.ఎన్.పేట): వంశధార రిజర్వాయర్ పనులు చేపట్టడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుండడంతో కొన్ని రోజుల పాటు పనులు నిలుపుదల చేయాలని కాంట్రాక్టర్లకు సూచించామని పాలకొండ డీఎస్పీ సీహెచ్.ఆదినారాయణ చెప్పారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకర్లతో మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణంలో నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్ఆర్ ప్యాకేజీలతో పాటు పునరావాసం కల్పించాకే పనులు చేపడితే ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. -
ఉసురుతీసిన క్షణికావేశం
భార్యతో స్వల్ప వాగ్వాదం.. ఆపై ఆత్మహత్య మృతునిది గుంటూరు జిల్లా హిరమండలం (ఎల్.ఎన్.పేట): క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యభర్తల మధ్య జరిగిన స్వల్ప వివాదం చివరికి భర్త బలవన్మరణానికి ప్రేరేపించింది. హిరమండలం మేజర్ పంచాయతీ బ్యారేజ్ సెంటర్లో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాకు చెందిన ఉయ్యాల ఏసురత్నం(25) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ప్రకారం... గుంటూరు జిల్లా ఈవూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన ఏసురత్నం తన భార్య తిరుపతమ్మతో రెండు నెలల క్రితమే స్థానిక బ్యారేజ్ సెంటర్లో ఒక ఇంట్లో అద్దెకు దిగారు. వీరు రైతులకు నూర్పులకు అవసరమయ్యే టార్పలిన్లు అద్దెకు ఇస్తుంటారు. ఆదివారం ఉదయం భార్య భర్తల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే ఇంట్లో వేరే గదిలో భార్యను ఉంచేసి ఉరి వేసుకుని మృతిచెందాడని పోలీసులు చెప్పారు. బయట ఉన్న గది నుంచి పరుగున వీధిలోకి వెళ్లిన భార్య, కొందరిని పిలుచుకుని వచ్చి తలుపులు తీసేలోగా మృతి చెందాడన్నారు. వీరికి వివాహం జరిగి మూడు సంవత్సరాలే అయిందని, ఎప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, చిన్నపాటి గొడవతో క్షణికావేశానికి లోనై బలవన్మరణానికి పాల్పడ్డాడని భార్య మేనమామ వెంకటేష్ రోదిస్తూ చెప్పాడు. కళ్లముందే భర్త చనిపోవడంతో భార్య గుండెలవిసేలా రోదిస్తోంది. అక్కడికి చేరుకున్న వారు కూడా ఆమెను ఓదార్చలేకపోతున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై కె.వెంకటేశ్వరరావు చెప్పారు. -
ముప్పు ముంగిట గొట్టా
హిరమండలం: జిల్లా రైతులకు జీవనాధారమైన వంశధార నదిపై నిర్మించిన గొట్టా బ్యారేజీ ముప్పు ముంగిట నిలిచి ఆందోళన కలిగిస్తోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 2.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ సిరుల పంటలు పండిస్తున్న బ్యారేజీ ఎగువ భాగాన్ని చూస్తే భవిష్యత్తు ఎంతో భయానకంగా కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీగా పూడిక పేరుకుపోయి బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది. బ్యారేజీ నిర్మించి 37 ఏళ్లు పూర్తి అయినా ఇంతవరకు పూడిక తీసిన సందర్భాలు లేవు. ఫలితంగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా 25 శాతానికి పడిపోయిందని ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ గేట్ల వద్ద మట్టి, ఇసుక మేటలు వేయడమే ఈ పరిస్థితికి కారణం. దీని ప్రభావం పంటలకు నీటి సరఫరాపై పడుతోంది. కుడి, ఎడమ కాలువలకు అవసరమైనంత నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. గులుమూరు గ్రామం వద్ద నది గమనం మారడం కూడా నదిలో పూడిక పెరిగిపోయేందుకు ఒక కారణం. ఇలా గత 20 ఏళ్ల నుంచి మట్టి ఎక్కువగా చేరుతోంది. గతంలో ఇక్కడికి వచ్చిన ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ పూడిక తొలగింపునకు ప్రతిపాదనలు రూపొందించాలని వంశధార అధికారులను ఆదేశించినా అవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలుస్తోంది. 30 శాతం నీరే విడుదల వంశధార కుడి కాలువ ద్వారా ఆయకట్టుకు 872 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 300 క్యూసెక్కులకు మించి విడుదల చేయలేకపోతున్నారు. బ్యారేజీ నుంచి కుడికాలువకు నీరు విడుదలయ్యే ప్రదేశం వద్ద పూడిక పేరుకుపోవడంతో ప్రవాహ దిశ అనుకున్న విధంగా సాగట్లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో తక్కువ పరిమాణంలోనే నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగాా శివారు ఆయకట్టుకు నీరందక రైతులు నష్టపోతున్నారు. గత ఏడాది ప్రధాన కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద భారీగా పూడికతో నిండిపోయి నీరు వెళ్లే పరిస్థితి కనిపించకపోవడంతో నీటి విడుదల సమయంలో తాత్కాలికంగా కొంత మట్టిని తొలగించారు. బ్యారేజీ 20, 21, 22 గేట్ల పెద్ద మట్టిదిబ్బల స్థాయిలో పూడిక నిండిపోయింది. ఇది కుడికాలువ నీటి ప్రవాహానికి అవాంతరంగా మారింది. మహేంద్రతనయతో ముప్పు వంశధారకు ఉపనదిగా ఉన్న మహేంద్రతనయ నుంచే ఎక్కువగా మట్టి కొట్టుకువస్తోంది. వంశధార ప్రవాహంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి కూడా మట్టి వస్తుండడంతో బ్యారేజీ వద్ద లోతు తగ్గి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దశాబ్దాల తరబడి నది ఎగువ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతుల చెబుతున్నారు. గొట్టా నుంచి గులుమూరు వరకు సుమారు 6.2 కి.మీ., తుంగతంపర నుంచి సుమారు 3.5 కి.మీ. మేరకు నదిలో పేరుకుపోయిన మట్టి, ఇసుక మేటలను తొలగించాల్సి ఉందని వంశధార అధికారులు చెబుతున్నారు. కనీసం దమ్ము ట్రాక్టర్లతో నీరు లేని సమయంలో ఈ ప్రాంతంలో దున్నించినా మట్టి మేటలు వదులై భారీ వరదల సమయంలో దిగువకు కొట్టుకుపోయి సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని పలువురు సూచిస్తున్నారు. -
ఒక గ్రామం.. రెండు సభలు!
జన్మభూమి గ్రామ సభలు గ్రామానికొకటి చొప్పున జరగాలి.. దానికి సర్పంచ్ నేతృత్వం వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.కానీ కొన్ని గ్రామాల్లో జరుగుతున్న తంతు వేరేగా ఉంది..తమ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రూపొం దించిన మార్గదర్శకాలనే టీడీపీ నేతలు కాలదన్నుతున్నారు. టీడీపీ సర్పంచులు లేని చోట్ల తమ పెత్తనం నిరూపించుకునేందుకు పోటీ గ్రామ సభలు నిర్వహిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో ఏ సభకు వెళ్లాలో తెలియక ఇటు ప్రజలు.. అటు అధికారులు ఇరకాటంలో పడుతున్నారు. సోమవారం దుగ్గుపురం గ్రామంలో సరిగ్గా ఇదే జరిగింది. హిరమండలం: హిరమండలం మండలం దుగ్గుపురం గ్రామంలో సోమవారం జన్మభూమి-మా ఊరు గ్రామ సభ జరగాల్సి ఉంది. వైఎస్ఆర్సీపీకి చెందిన ఆర్.మోహనరావు ఈ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం పది గంటలకు సభ ప్రారంభమైంది. అయితే అదే సమయంలో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప సర్పంచ్ వర్గీయులు దీనికి పోటీగా స్థానిక పాఠశాల వద్ద మరో సభ నిర్వహించారు. దీంతో అధికారులు అయోమయంలో పడ్డారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు రెండు సభలకు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఐటీడీఏ పీవో ఆగ్రహం అదే సమయంలో ఐటీడీపీ పీవో సత్యనారాయణ గ్రామ సభ జరుగుతున్న తీరు పరిశీలించేందుకు పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ అధికారులు పెద్దగా కనిపించకపోవడంతో విషయమేమిటని ఆరా తీశారు. పాఠశాల వద్ద నిర్వహిస్తున్న మరో జన్మభూమి సభకు వెళ్లారని సర్పంచ్, స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. అలా ఎందుకు జరిగిందని పీవో ప్రశ్నించారు. ఇంతలోనే ఎంపీడీవో కుమారస్వామి అక్కడికి వచ్చారు. గ్రామ సభలో ఉండకుండా ఎక్కడికి వెళ్లారని పీవో ప్రశ్నించగా గ్రామ పరిశీలనకు వెళ్లానని ఆయన సమాధానమిచ్చారు. దాంతో ఆగ్రహం చెందిన పీవో సాయంత్రం వరకు పంచాయతీ కార్యాలయం వద్దే ఉండి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశించారు. కాగా ఈ పరిస్థితికి అధికారుల వైఖరే కారణమని ఇరుపార్టీల వారు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలోనే గ్రామ సభ జరగాలని, అయితే వేరే చోట సభ ఏర్పాటు చేయాలని తమను అధికారులు కోరడం వల్లే వివాదం ఏర్పడిందని ఉప సర్పంచ్ పి.శ్రీనివాసరావు చెప్పారు. రెండు చోట్ల సమావేశాలు జరగడంతో అటు ప్రజలు, ఇటు అధికారులు ఇబ్బం దులకు గురయ్యారు. గ్రామస్తులు పార్టీలవారీగా విడిపోయి.. రెండు సభలకు వెళ్లడంతో పార్టీ విభేదాలను రెచ్చగొట్టినట్లు అయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కొందరు అధికారులు, సిబ్బంది కూడా ఏ సభకు వెళ్లా లో.. ఎక్కడ భోజనం చేయాలో అర్థం కాక.. చివరికి రెండింటికీ డుమ్మా కొట్టి పస్తులున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం:ఎమ్మెల్యే కలమట దుగ్గుపురంలో నిబంధనలకు విరుద్ధంగా రెండుచోట్ల జన్మభూమి-మాఊరు సభలు నిర్వహించడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నామని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రూపొందిం చిన నిబంధనలను ఆ పార్టీవారే ధిక్కరించడం దారుణమని, బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
మరణంలోనూ జంటగానే..!
హిరమండలం : అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి.. ఇంతకాలం కలిసి జీవించిన ఆ వృద్ధ దంపతులను మృత్యువు సైతం విడదీయలేకపోయింది. చివరికి ఇద్దరినీ ఒకేసారి తీసుకుపోయింది. వడదెబ్బ ఆ జంటను ఉమ్మడిగా కాటేసింది. తీవ్రంగా వీస్తున్న వడగాడ్పుల ధాటికి ఆ దంపతులిద్దరూ ఒకేసారి కుప్పకూలి విగతజీవులయ్యారు. హిరమండలంలో జరిగిన ఈ సంఘటన ఆ కుటుం బంతోపాటు స్థానికులను కలచివేసింది. హిరమండలం మండలం మేజర్ పంచాయతీలోని గాంధీనగర్ వీధికి చెందిన రాడ అప్పయ్య (65) వంశధార ప్రాజెక్టులో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఆయన భార్య గరికమ్మ (60) గృహిణి. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఆర్టీసీలో ఆయన ఉద్యోగి. గత వారం రోజులుగా జిల్లాను అతలాకుతలం చేస్తున్న వడగాడ్పుల తీవ్రత సోమవారం కూడా కొనసాగింది. వడగాడ్పుల దాటికి తట్టుకోలేకపోయిన అప్పయ్య సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో హఠాత్తుగా మృతి చెందారు. మరోవైపు అప్పటికే వడగాడ్పుల ప్రభావంతో నీరసించిపోయిన గరికమ్మ భర్త మరణంతో తీవ్ర మనస్తాపానికి గురై గంట వ్యవధిలోనే తను కూడా మరణించింది. తల్లిదండ్రులిద్దరూ ఒకేరోజు మృతి చెందడాన్ని తట్టుకోలేక వారి కుమారుడు కోటి, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ భోరున విలపించారు. మధ్యాహ్నం వరకు అందరినీ పలకరిస్తూ గడిపిన దంపతులు సాయంత్రానికి మరణించడాన్ని తలచుకొని స్థానికులు సైతం కంటతడి పెట్టారు.