ముప్పు ముంగిట గొట్టా
హిరమండలం: జిల్లా రైతులకు జీవనాధారమైన వంశధార నదిపై నిర్మించిన గొట్టా బ్యారేజీ ముప్పు ముంగిట నిలిచి ఆందోళన కలిగిస్తోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 2.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ సిరుల పంటలు పండిస్తున్న బ్యారేజీ ఎగువ భాగాన్ని చూస్తే భవిష్యత్తు ఎంతో భయానకంగా కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీగా పూడిక పేరుకుపోయి బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది. బ్యారేజీ నిర్మించి 37 ఏళ్లు పూర్తి అయినా ఇంతవరకు పూడిక తీసిన సందర్భాలు లేవు. ఫలితంగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా 25 శాతానికి పడిపోయిందని ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.
బ్యారేజీ గేట్ల వద్ద మట్టి, ఇసుక మేటలు వేయడమే ఈ పరిస్థితికి కారణం. దీని ప్రభావం పంటలకు నీటి సరఫరాపై పడుతోంది. కుడి, ఎడమ కాలువలకు అవసరమైనంత నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. గులుమూరు గ్రామం వద్ద నది గమనం మారడం కూడా నదిలో పూడిక పెరిగిపోయేందుకు ఒక కారణం. ఇలా గత 20 ఏళ్ల నుంచి మట్టి ఎక్కువగా చేరుతోంది. గతంలో ఇక్కడికి వచ్చిన ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ పూడిక తొలగింపునకు ప్రతిపాదనలు రూపొందించాలని వంశధార అధికారులను ఆదేశించినా అవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలుస్తోంది.
30 శాతం నీరే విడుదల
వంశధార కుడి కాలువ ద్వారా ఆయకట్టుకు 872 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 300 క్యూసెక్కులకు మించి విడుదల చేయలేకపోతున్నారు. బ్యారేజీ నుంచి కుడికాలువకు నీరు విడుదలయ్యే ప్రదేశం వద్ద పూడిక పేరుకుపోవడంతో ప్రవాహ దిశ అనుకున్న విధంగా సాగట్లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో తక్కువ పరిమాణంలోనే నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగాా శివారు ఆయకట్టుకు నీరందక రైతులు నష్టపోతున్నారు. గత ఏడాది ప్రధాన కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద భారీగా పూడికతో నిండిపోయి నీరు వెళ్లే పరిస్థితి కనిపించకపోవడంతో నీటి విడుదల సమయంలో తాత్కాలికంగా కొంత మట్టిని తొలగించారు. బ్యారేజీ 20, 21, 22 గేట్ల పెద్ద మట్టిదిబ్బల స్థాయిలో పూడిక నిండిపోయింది. ఇది కుడికాలువ నీటి ప్రవాహానికి అవాంతరంగా మారింది.
మహేంద్రతనయతో ముప్పు
వంశధారకు ఉపనదిగా ఉన్న మహేంద్రతనయ నుంచే ఎక్కువగా మట్టి కొట్టుకువస్తోంది. వంశధార ప్రవాహంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి కూడా మట్టి వస్తుండడంతో బ్యారేజీ వద్ద లోతు తగ్గి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దశాబ్దాల తరబడి నది ఎగువ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతుల చెబుతున్నారు. గొట్టా నుంచి గులుమూరు వరకు సుమారు 6.2 కి.మీ., తుంగతంపర నుంచి సుమారు 3.5 కి.మీ. మేరకు నదిలో పేరుకుపోయిన మట్టి, ఇసుక మేటలను తొలగించాల్సి ఉందని వంశధార అధికారులు చెబుతున్నారు. కనీసం దమ్ము ట్రాక్టర్లతో నీరు లేని సమయంలో ఈ ప్రాంతంలో దున్నించినా మట్టి మేటలు వదులై భారీ వరదల సమయంలో దిగువకు కొట్టుకుపోయి సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని పలువురు సూచిస్తున్నారు.