పెరుగుతూ..తగ్గుతూ..!
హిరమండలం: ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వంశధార నదిలో వరద మంగళవారం రోజంతా పెరుగుతూ.. తగ్గుతూ పరవళ్లు తొక్కింది. గొట్టా బ్యారేజీ వద్ద ఉదయానికి 41,221 క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి ప్రమాదపు హెచ్చరికను జారీ చేశారు. అయితే ఆ తరువాత ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. మధ్యాహ్నం సయామానికి 36,300 క్యూసెక్కులకు, సాయంత్రానికి 30,740 క్యూసెక్కులకు చేరింది.
ఈ నీటిని 22 గేట్ల ద్వారా బయటకు విడిచి పెడుతున్నట్లు ప్రాజెక్టు డీఈ ప్రభాకర్ తెలిపారు. కాగా ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలో మంగళవారం మధ్యాహ్నం12 గంటల వరకు 256.26 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వంశధారలో వరద ప్రవాహం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సాయాంత్రానికి కుట్రగూడ వద్ద 25.8 మిల్లి మీటర్లు, గుడారి వద్ద 51.6 మి.మీ, మోహన్ వద్ద 26.8 మి.మీ, గుణుపూర్‌లో 61 మి.మీ, మహేంద్రగడ వద్ద 51.6 మి.మీ, కాశీనగర్ వద్ద 36 మి.మీ, గొట్టా వద్ద 36 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు.
నదీ తీర గ్రామాల్లో అప్రమత్తం
వంశధారలో మంగళవారం ఉదయం వరద నీటి ప్రవాహం పెరిగి మొదటి ప్రమాద హెచ్చరికను దాటడంతో నదీ పరివాహక గ్రామాల్లో రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. గొట్టా బ్యారేజీ కార్యాలయానికి వెళ్లి వరదనీటి పరిస్థితి, ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలో నమోదైన వర్షపాతం గురించి అడిగి తెలుసుకున్నారు.