
శ్రీకాకుళం జిల్లా నౌపడలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
మనం అధికారంలోకి రాక ముందు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులు మాత్రమే ఉన్నాయి. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక, ఈ 46 నెలల కాలంలో మరో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. మరో మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు అప్రూవల్ తీసుకున్నాం. వేగవంతంగా నిర్మాణంలోకి తీసుకువస్తాం. తద్వారా పారిశ్రామికాభివృద్ధికి తీర ప్రాంతం వేదిక అవుతుంది. లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
నౌపడ నుంచి సాక్షి ప్రతినిధి: మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజీ ఎత్తిపోతల పథకం, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టుల ద్వారా రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. విశాఖ నుంచి 170 కిలోమీటర్లు, చెన్నై– కోల్‌కతా నేషనల్ హైవేకు కేవలం 14 కిలోమీటర్లు, ప్రధాన రైల్వే మార్గానికి 11 కిలోమీటర్ల దూరంలో 1,250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న మూలపేట పోర్టు.. రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇక్కడే 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని చెప్పారు.
పోర్టు ఆధారిత, అనుబంధ పరిశ్రమలు, ఇతరత్రా లక్షల్లో మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందివచ్చే కార్యక్రమం చేపడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని మూలపేట తీరంలో పోర్టు నిర్మాణానికి, ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్ ఎత్తిపోతల పథకానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులను పునఃప్రారంభించారు.
ఈ సందర్భంగా సంతబొమ్మాళి మండలంలోని నౌపడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉంటే, అందులో ఏకంగా 193 కిలోమీటర్లు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఉందన్నారు. అయినా ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, కనీసం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఉండి ఉంటే ఈ జిల్లా చెన్నై, ముంబయిగా అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. ఈ విషయం తెలిసీ కూడా దశాబ్దాలుగా ఎవ్వరూ ఈ దిశగా అడుగులు వేసి, చిత్తశుద్ధి చూపలేదన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ఇంకా ఏమన్నారంటే..
అభివృద్ధికి మూల స్తంభం
► మూలపేట ఇక మూలనున్న గ్రామం కాదు. ఇది అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తుంది. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలు రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మరో చెన్నై, ముంబయి కాబోతున్నాయి.మూలపేటలో మనం కట్టబోతున్న పోర్టు సామర్థ్యం ఏకంగా ఏడాదికి 24 మిలియన్ టన్నులు. ఈ పోర్టులో 4 బెర్తులు నిర్మిస్తున్నాం.
► ఈ రోజు నుంచి 24 నెలల్లో ఈ పోర్టు నిర్మాణం పూర్తవుతుంది. దాదాపు రూ.2,950 కోట్ల ఖర్చుతో పోర్టు నిర్మాణం చేపడుతున్నాం. ఇక్కడ ట్రాఫిక్ పెరిగి ఈ పోర్టు సామర్థ్యం వంద మిలియన్ టన్నులకు పెరిగే రోజు సమీపంలోనే ఉంది. దీన్ని ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడానికి 14 కిలోమీటర్ల పొడవున రోడ్డు, 11 కిలోమీటర్ల పొడవున రైలుమార్గం నిర్మిస్తున్నాం.
► ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టా బ్యారేజీ నుంచి పైపులైన్ వేసి 0.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి సరఫరా చేయడానికీ శ్రీకారం చుడుతున్నాం. ఇలా మౌలిక వసతులకు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తదితర వ్యయాలను కలిపితే మూలపేట పోర్టు నిర్మాణానికి మనందరి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము రూ.4,362 కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా.
గంగపుత్రుల కళ్లల్లో మరింత కాంతి
గంగపుత్రుల కళ్లల్లో మరిన్ని కాంతులు నింపడానికి, మత్స్యకార సోదరులకు మరింత అండగా ఉండేందుకు మూలపేట పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. రూ.365.81 కోట్లతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. మంచినీళ్లపేటలో రూ.12 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి 2019 సెప్టెంబర్‌లో శ్రీకారం చుట్టాం. దాన్ని మరో రూ.85 కోట్ల ఖర్చుతో ఫిషింగ్ హార్బర్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నాం.
రైతుల శ్రేయస్సే లక్ష్యం
► వంశధార, నాగావళి నదులు ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల శ్రీకాకుళం జిల్లా ఇప్పటికీ సస్యశ్యామలం కాని పరిస్థితి. అప్పట్లో దివంగత నేత, నాన్న గారు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వంశధార ఫేజ్ 2, స్టేజ్ 2 కింద 33 కిలోమీటర్ల పొడవున కాలువల తవ్వకం, హిరమండలం రిజర్వాయర్‌ను 19 టీఎంసీల కెపాసిటీతో నిర్మాణ పనులకు అడుగులు వేగంగా వేయించారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఆ అడుగులు ముందుకు పడలేదు.
► నేరడి బ్యారేజ్ పూర్తయితే తప్ప హిరమండలం రిజర్వాయర్‌లో 19 టీఎంసీల కెపాసిటీతో నీరు పెట్టడం సాధ్యం కాదు. మీ బిడ్డ గతంలో ఏ ముఖ్యమంత్రి చూపని చొరవ చూపించారు. ఒడిశాకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలిసి నేరడి బ్యారేజ్ గురించి మాట్లాడారు. దాని పరిస్థితి అలానే ఉన్నా మధ్యేమార్గంగా మన రైతన్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి జరగాలన్న ఉద్దేశంతో రూ.176.35 కోట్లతో గొట్టా బ్యారేజ్‌పై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తున్నాం.
► మరోవైపు వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా ఆగçస్టు నెలలోనే పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం. మహానేత రాజశేఖరరెడ్డి మొదలు పెట్టిన మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేసేందుకు, మూడు నియోజకవర్గాల రూపురేఖలను మార్చేందుకు మరో రూ.400 కోట్లు ఖర్చయ్యే పనులకు ఈ రోజు శ్రీకారం చుట్టాం.
ఉద్దానంలో కిడ్నీ బాధితులకు ఊరట
► ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మొదలు పెట్టిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూన్‌లో ప్రారంభోత్సవం చేస్తాను.
► హిరమండలం రిజర్వాయర్ నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమానికి రూ.700 కోట్లతో నాంది పలికాం. దీన్ని జూన్ మాసంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను. అదే రోజున పాతపట్నం నియోజకవర్గంలో మరో రూ.265 కోట్లతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తూ శంకుస్థాపన చేస్తాను.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బేరీజు వేయండి
► ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించిన పరిస్థితులను ఒక్కసారి బేరీజు వేయండి. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, పార్వతీపురం, నర్సీపట్నం, విజయనగరంలో మెడికల్ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి.
► ఈ ప్రాంతంలో ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్న విషయం గమనించాలి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీకి జూన్‌లో శంకుస్థాపన చేస్తాం. మే 3వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి వీలుగా రూ.6,200 కోట్లతో ఆరు లైన్ల రహదారిని నిర్మించబోతున్నాం. తీర ప్రాంతంలో ఇలాంటి అభివృద్ధి గతంలో ఎందుకు జరగలేదో ఆలోచించండి.
సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం
► ఏపీలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి మీ బిడ్డ విశాఖలో కాపురం పెడతాడని తెలియజేస్తున్నా.
► ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా, ఏ గ్రామం తీసుకున్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి కనిపిస్తోంది. స్కూళ్లు మారుతున్నాయి. కొత్తగా మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఉన్న ఆస్పత్రులన్నీ రూపురేఖలు మారుతున్నాయి.
► ప్రతి ఇల్లూ అభివృద్ధి కావాలి. నా అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనపడాలి. 46 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా సొమ్మును నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసింది.
► మీ బిడ్డ జగన్ డీబీటీ బటన్ నొక్కటం మాత్రమే కాదు... కులాలు, కుటుంబ చరిత్రలను మార్చాలన్న తపన, తాపత్రయంతో పని చేస్తున్నాడని గుర్తించాలి. నవరత్నాల పాలనతో ఇంటింటి చరిత్రను, సామాజిక వర్గాల చరిత్రను తిరగ రాస్తున్న ప్రభుత్వంగా, ప్రాంతాల చరిత్రలను, పారిశ్రామిక వాణిజ్య చరిత్రను కూడా మారుస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment